నేను నా రాక్షసి - రివ్యూ

Nenu-Naa-Rakshasi-Movie-Wallpaper

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, నేను సినిమాలు అంత తొందరగా చూడను అలాగే చూడాలని అనుకోను. ఒకవేళ అనుకున్నానా, అంతే, కొంప కొలాస్ సినిమా డింకీ డిలాస్. అలాంటి కోవకే చెందుతుందీ సినిమా కూడా. అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా నేను చూడాలి అని అనుకోలేదు. ఇంతకు ముందు ఇచ్చిన బిల్డప్ అంతా తూచ్, ఉత్తిత్తినే. ఈ సినిమా హీరో గారిపై నాకు పెద్ద సదాభిప్రాయం లేదు. ఎందుకంటే, ఈ సినిమా ఆడీయో రిలీజ్ సమయంలో అనుకుంటా, ఈయన గారి గురించి మఱో హీరోగారు పెద్ద ఘన కార్యం చేసినట్లు స్టేట్‍మెంట్ ఇచ్చాడు.

హీరోగా చెయ్యడమంటే ఇన్వెస్టుమెంట్ లెని వ్యాపారమంట, ఈ రానాగారి అభిప్రాయంలో. ఎంతైనా మఱో నిర్మాత కొడుకు కదా. ఒక్కొసారి ఇలా వంశ పారంపర్యంగా వస్తున్న తరాన్ని చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. అది ప్రస్తుత వీరో మన రానా గారైనా లేక అల్లూ వారసుడైనా లేక నంద మూరి వంశంలోని వారెవ్వరైనా. సినిమా అనేది చాలా మందికి ఒక ఆనందాన్నిచ్చే వ్యాపకం అయితే, ఇలాంటి బడా బాబులకు అది ఒక విలాస ప్రక్రియ. అయితే ఆ ఒడ్డు లేదా ఈ ఒడ్డు. సినిమా ఆడిందనుకోండి, అదిగో మావోడు బాగా చేసాడు అని చంకలు కొట్టుకుంటారు. లేదు, డింకీ కొట్టిందనుకోండి, ఛాత్.. ఆ దర్శకునికి సినిమా తీయ్యడం చేత కాలేదు అని నిదంలేసేయ్యడం. కాకా పట్టడం అనేది నరనరాల్లో జీర్ణించుకు పోతేనే ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారనేది చేదు నిజం. అందుకు సాక్షమే మన జూ.ఎన్టీయార్.

సరే సినిమా పై రివ్యీ వ్రాసే ప్రక్రియలో అదేదో వ్రాసేస్తున్నాను. ఇక ప్రస్తుత సినిమా విషయానికి వస్తే, కధా పరంగా చాలా మంచి సినిమా అలాగే బాగా వ్యాపార విలువలు వ్యక్తపరచ కలిగిన సినిమా. నాకు తెలిసి ఖచ్చితంగా లాభాలే వచ్చుంటాయి. కానీ, నా వరకూ నాకు ఇది ఓ చెత్త సినిమా అనిపించింది. డబ్బులు సంపాదించుకోవాలంటే, చాలా మార్గాలున్నాయి. చాలా సున్నితమైన భావాలను మానవతా దృక్పధంతో చూపించి జనాల మన్నలను పొందేలా సినిమాలు తీస్తే బాగుంటుంది కానీ ఇలా మాసశిక సంక్షోబంలో కొట్టు మిట్టాడే వారిని తీసుకుని దానికి మషాలా దట్టించి, వారి మనోభావాలతో వ్యాపారం చేసే విధానం నాకు వెగటు పుట్టించింది.

ఆత్మహత్య అనే మూల కధాంశంతో తనికెళ్ళ భరణి గారు, గ్రహణం అనే సినిమా తీసినట్టు నాకు గుర్తు. ఆ సినిమా వ్యాపార పరంగా వర్కౌట్ అయినట్లు లేదు. కానీ అది చాలా సున్నితమైన కధ. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు లాభాపేక్ష లేకుండా, జనాలకి ఎక్కుతుందా లేదా అని చూడకుండా, సున్నితత్వాన్ని సున్నితంగా చూపించే ప్రయత్నంలో వ్యాపార దృక్పధంగా భరణి గారు ఓడిపోయినా, సినిమా మాధ్యమాన్ని వ్యాపార పరంగా చూడకుండా ఓ మంచి విషయం వివరించే ప్రయత్నంలో వీరు మనఃసాక్షిగా వ్యవహరించి ఓ మానవత్వం కలిగి ఉన్న వ్యక్తిగా నా ఆలోచనలలో నిలచిపోయ్యారు. నాకు తెలిసి భరణిగారు పెద్ద ధన వంతులేం కారనుకుంటా, వ్యక్తిగతంగా నాకు వీరితో పరిచయం లేదు. కావున, ఏమీ వ్రాయలేను. కానీ వీరు చేసిన పాత్రల పరంగా కానీ వీరి నిరాడంబరత బట్టి గానీ వీరు పెద్దగా వెనకేసుకున్నది ఏమీ లేదని నా అభిప్రాయం. ఒక వేళ నా అభిప్రాయం తప్పవౌచ్చు. కానీ మన వీరో గారికేం వచ్చింది. వీళ్ళ నాన్న సంపాదించింది మూలుగుతోందిగా, వీరు సంపాదించి ఇంకా ఎంత వెనకేయ్యాలంట? అందునా ఇలాంటి సున్నితమైన వ్యవహారాన్ని కమర్షియల్ చేసి సంపాదించడం అనే ప్రక్రియ శెవాన్ని తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు జల్లుతారే వాటిని ఏరుకునేటట్లు ఉంది.

ఈ హీరో గారు ఇంతకు ముందు చేసిన సినిమాతో పోల్చుకుంటే, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా పరిశ్రమకి మఱో వారసుని తరంలో మంచి కాంపిటీషన్ ఇచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడెప్పుడో షట్టర్ ఐలాండి అనే సినిమా లోని హింసని ప్రేరేపించే జుగుప్సా కరమైన ఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇకపై వీరినుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. ఇంతకీ నచ్చిన మఱియు నచ్చని అంశాల విషయానికి వస్తే..

నచ్చిన అంశాలు..

  • దర్శకుని ప్రతిభ
  • స్క్రీన్ ప్లె
  • లొకేషన్స్ ప్రిఫరెన్స్ – ఎంచుకున్న విధానం
  • వెనిస్ నగరాన్ని చాలా ఎక్కువ సేపు చూపించడం
  • కటకటాల వెనకాల ఉన్న కొడుకుని విడిపించుకునే సీన్లో పోలీస్ ఆఫీసర్ ప్రవర్తన
  • ప్రతీ వ్యక్తి ఆత్మహత్య వెనకాల ఓ బలమైన కారణం ఉంటుంది అని చూపించడం
  • మన శరీరంలో ఆత్మహత్య నిరోధించే తత్వం ఉంటుంది అని తెలియ జెప్పే ప్రయత్నం

నచ్చని అంశాలు..

  • మొదటిగా, ఆత్మహత్య అనే అంశాన్ని వ్యాపారం చెయ్యడం
  • పిల్లని చంపేయ్యడం
  • ప్రతి నాయకుడు చంపే ప్రతీసారి అమ్మవారిని స్మరించడం
  • హింస పరంగా పైశాచిక ఆనందాన్ని చూపించడం
  • ముమ్మయిత్ ఖాన్ పాత్ర
  • డబ్బున్న వారు నిర్భయంగా ఎలాంటి అఘాయిత్యాలైనా చేసేయ్యండి అని ప్రేరేపించే విధానం

ఇంకా మరెన్నో.. కానీ, ఈ చిట్టాని ఇక్కడితో ఆపేస్తాను. ఆఖరిగా, సున్నిత మనస్కులు ఈ సినిమాని చూడవద్దని మనవి

 
Clicky Web Analytics