నాతెలుగు తల్లికి (వాడిన) మల్లెపూదండ

నేను ప్రస్తుతం ఉంటున్నది మన రాష్ట్రరాజధాని, హైదరాబాదులో. మన రాష్ట్ర భాష తెలుగు. అట్టి తెలుగుకి ఎంత దుస్తితి పట్టిందో ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

భాషాప్రయుక్త భావనపై వేరు పడి, తెలుగును ఒక వెలుగు తెచ్చిన వారందరూ ఈనాటి మన హైదరాబాదు నగర స్ంచారానికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానని భావించి.. మన హైదరాబాదు జనాల్ని పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడని తెలుకుని, మీళ మధ్య బ్రతకడం కన్నా చావడమే మేలనుకుంటారు.

నండూరి సుబ్బారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమసేఖర శర్మ గారు, కొంపల్లి జనార్దన రావు గారు, ఆధునిక తెలుగు పితామహుడిగా పేరుగాంచిన గురజాడ వేంకట అప్పారావు గారు, పైన చెప్పిన వారికి ఏమాత్రం తీసిపోని శ్రీరంగం శ్రీనివాసరావు గారు, వీరందరినీ మించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, కవికొండల వెంకట రావు గారు, చింతా దీక్షితులు గారు అబ్బురి రామకృష్ణ రావు గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు .. ఎందరో మరెందరో మహానుభావులు కనుకా ఈరోజుల్లోని పిల్లలని చూసి ఉంటే.. మనభాషకి పట్టిన గతికి చింతించడమే కాక, తాము పడ్డ కష్టానికి.. చేసిన కృషికి లభిస్తున్న ఆదరణకి ఎంత భాధ పడేవారో ఒక్క సారి ఊహించుకోండి.

అస్సలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా?? నిన్నటి సాక్షి పత్రికలో చదివిన వ్యాసం కిక్కు ఇవ్వాళ్టికి నషాళానికి ఎక్కింది. ఈ మధ్య మన ప్రస్తుత అధికార ప్రబుత్వం చిన్నపిల్లలకు ఒకటవ తరగతి నుంచి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందట. పిల్లలకి చిన్నవయస్సు నుంచే తెలుగుని దూరం చేస్తే.. వారికి మన మాత్రు భాషపై మమకారం ఎలా పెరుగుతుంది? అభం శుభం తెలియని పిల్లలు.. అందునా పసి మొగ్గలు.. వాళ్ళు, వాళకేం తెలుస్తుంది ఏ భాష నేర్చుకోవాలి అని??? అన్నెం పుణ్యం తెలిసిన మన భుద్దికేం అయ్యింది?? ఎదో పెద్దయిన తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాబట్టి ఇప్పటినుంచే పెద్ద పెద్ద పాఠశాలలో చిన్న చిన్న చదువులు చదివించేస్తే సరిపోతుందని అలోచిస్తున్న నేటి తల్లి తండ్రులు తప్పు చేస్తున్నారా.. లేక వాళని చూసుకుని వారు వేసే ఓట్లకోసం ఈ ప్రభుత్వం ఇంతకు బరి తెగించిందా??

ఏదైనా భాషపై పట్టు రావాలంటే మూడు మాధ్యమాల ద్వారా మాత్రమే కుదురుతుంది. అవి, మాట్లాడగలగడం మెదటిదైతే.. చదవగలగడం రెండవ దస. ఆఖరున వ్రాయగలగడం. మాట్లాడడానికైతే ఇంట్లో తల్లి తండ్రులు.. స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ తెలుగుని చదవడానికి మరియు వ్రాయడానికి ఉన్న ఒకె ఒక్క అవకాశం .. పాఠశాల మాత్రమే. అట్టి పాఠశాలలోనే మనం తెలుగుని విస్మరిస్తున్నామంటే... ఇక పిల్లలకు తెలుగుదనం యొక్క ఉనికి ఒక్క మాటలకి మాత్రమే మిగిలిపోతుంది. ఈ రోజుల్లోని తల్లి తండ్రులు తమ తమ పిల్లల్ని చక్కగా.. అమ్మా .. నానగారు .. అనేటటువంటి పిలుపులకు దూరంచేసి.. మమ్మీ డాడి వంటి అరువు తెచ్చుకున్న పిలుపులకు దగ్గర చేస్తున్న వైనం ఏమాత్రం హర్షణీయం??

ఇవన్నీ ఒక ఎత్తైతే.. మన రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న టికెట్ కండక్టర్లకు ఎంతమందికి తెలుగు వచ్చో ఎప్పుడైనా మాట్లాడి చూసారా?? అప్పుడప్పుడు మేము విజయవాడనుంచి వచ్చేటప్పుడు తెల్లవారుఝాము వేళలో బాగుంటుంది కదా అని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాము. నాకు ఆశ్చర్యం వేసే విషయమేమిటంటే.. వాళు అనేటటు వంటి మొట్ట మొదటి మాట.. కహా జానెకా.. (హిందిలో, ఎక్కడికి వెళాలి?). ఒకటి రెండుసార్లు భాషపై ఉన్న మమకారం చంపుకోలేక, వాళు మారరని తెలిసీ నావంతు కృషిగా వారితో మాట మాట కలిపి,వారికి అస్సలు తెలుగు వచ్చో.. రాదో.. తెలుసుకునే ప్రయత్నంలో, వాళకి తెలుగు తెలుసు అన్న చేదు నిజం తెలిసిన తరువాత నాగొంతుక మూగబోతుంది. కొంత మందైతే, తెలుగు తెలిసినా రానట్లు నటించడం చూస్తుంటే, వాళను ఏమి చెయ్యలేని నా నిస్సహాతకు నామీద నాకే అసహ్యమేస్తుంది. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి, హమ్ కో తెలుగు నహి అతాహై.. తుమ్ హిందీ మే బోల్.. అంటూ తిరిగి, రివర్స్‍లో నన్నే గదమాయిస్తూంటారు. మన ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తే, ఇట్లాంటి వాళు అలాంటి ఉద్యోగాలు చెసేవారా??? ఏమి చేస్తాం.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ కూర్చోవటం తప్ప. దేవుడా.. నా తెలుగు తల్లిని రక్షించు.

ఎల్‍వీ ప్రసాద్ గారిపై నా అభిప్రాయం

మెదటి విషయం.. ముఖ్యంగా.. నేను తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తాను.. తక్కువగా అనేకన్నా, అరుదుగా అంటే బాగుంటుందేమో.. ఏది ఏమైనా.. ఇక్కడ నేను ప్రస్తావించే విషయాలు పూర్తిగా నాస్వగతం.

రెండవది.. ఇన్నాళ్ళు, ఎల్‍వీ ప్రసాద్ గారంటే.. ఒక నేత్ర చికిత్సాలయం యొక్క స్వంతదారుడిగానో లెక హక్కుదారుడుగా మాత్రమే అనుకునేవాణ్ణి.. నేనింత వరకూ ఈ మహానుభావుడు ఎదో పెద్ద వైద్యుడై ఉండి ఉంటాడు.. అనుభవంతో వచ్చిన ఙ్ఞానాన్ని, తనకు వీలున్నంతలో సాధారణ ప్రజానీకానికి తనవంతు కర్తవ్యంగా తనకు కలిగినంత సేవ చేస్తున్నాడు అనుక్కున్నా.. తీరా ఈరోజు, నవతరంగంలో ఈయన మీద ప్రచురితమయిన వ్యాసాన్ని ఆసాంతం చదివిన తరువాత అస్సలు కధ ఏమిటో తెలిసింది.

ఇక ఆ వ్యాసాన్ని చదివిన తరువాత, ఎల్‍వి ప్రసాద్ గారిపై ఉన్న గౌరవం కాస్తా మంటలో కలిసింది. పాతరోజుల్లో చెప్పినట్లు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. తన కుటుంబం అప్పుల పాలై.. తండ్రి మరణించి.. అభం శుభం తెలియని మేనమామ కూతురు, ఊహ తెలియని వయస్సులో .. వచ్చీ రానీ వయస్సులో .. తెలిసీ తెలియని పెళ్ళి చేసుకుని .. త్వరలోనే పిల్లకి తల్లై .. పరిపక్వతలేని స్తితిలో ఉన్నపుడు.. ఈయనగారు, తల్లిని.. కట్టుకున్న ఆలిని.. కడుపున పుట్టిన పిల్లనూ వదిలి .. ఏదో సాధిద్దామని, ఇంట్లో ఎవ్వరికి చెప్పాపెట్ట కుండా బొంబాయి చెక్కేస్తారా.. కనీసం చుట్టూ ఉన్న సమాజం తల్లిని గానీ, కట్టుకున ఆలిని గానీ.. "ఏమ్మా మీ అబ్బయి కనబడటం లేదు.. మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా!! " వంటి ప్రశ్నలు వేస్తే, ఏమి సమాధానం చెబుతారో అన్న ఆలోచన లేకుండా.. అందరిని గాలికొదిలేసి.. భాధ్యతలకు దూరంగా "బొంబాయి పారిపోయాడు..", అని చదివిన తరువాత, మనసుకి చాలా కష్టం కలిగింది. ఇంతే కాకుండా.. ఈయనగారికి చదువుమీద ఏమాత్రం శ్రద్ద లేదంట. మన పిల్లలు చదువు విషయంలో శ్రద్ద వహించక పోతేనే మనం సహించమే.. అట్లాంటిది, ఇంత పెద్దాయనకి మాత్రం "శ్రద్ద లేదు" అని తెలుసుకున్నా మనమేం పట్టించుకోం. పైగా, ఈయన ఇంత పోడిచాడు.. అంత పీకాడు.. అంటూ ప్రసంగాలిస్తూంటాం.. చ చ.. తల్లిని, పెళ్ళాన్ని అంతేకాక కన్న కూతురిని కష్టాలో ఉన్నప్పుడు గాలికొదిలేసి, తన స్వంత ప్రయొజనాలకే విలువనిచ్చే వ్యక్తీ ఒక వ్వక్తేనా.. ఇదేమయినా స్వాతంత్ర్య పోరాటమా.. దేశం కోశం, త్యాగం చేసాను అని సర్ది చెప్పు కోవడానికి .. పూర్తిగా వ్యక్తిగత అభిరుచి..

నిజ్జంగా చెప్పాలంటే.. ఆ ఇద్దరు స్త్రీ మూర్తులకు చేయెత్తి నమస్కరించవచ్చు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు, తల్లి పడే భాధ వర్ణనాతీతం.. అటువంటి సమయంలో ప్రతీ స్త్రీ, కట్టుకున్న భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అటువంటి సమయంలో ముఖం చాటువేసినా, తిరిగి వస్తున్నానని టెలిగ్రాం వచ్చినప్పుడు, కూతురు చనిపోయిందనే విషయాన్ని ఈయనకు ఎలా తెలియ జేయాలా అని వారిద్దరు పడ్డ భాధ గురించి చదివినప్పుడు.. ఆ పుణ్య మూర్తులకు సాష్టాంగ పడాలనిపించింది. బ్రతికి ఉన్నాడో లేడో అనేటి సంసయావస్తలో ఉన్న తల్లికి కొడుకు వస్తున్నాడు అన్న విషయం పోయే ప్రాణం లేచొచ్చేటటు వంటి వార్తే.. కానీ, సుమారు రెండు సంవత్సరాలు ఆమె అనుభవించిన సందిగ్దావస్త ఏ తల్లికీ రాకూడదు అని నేను భావిస్తున్నాను. ఇంత మందిని ఇబ్బంది పెట్టి సాధించింది ఏమిటి..

ఒప్పుకుంటాను.. అటువంటి మహానుభావుడే లేకపోతే.. ఎన్నో మంచి మనోరంజక మయిన చిత్రాలు రాకపోయేవి అంటారు.. ఎవ్వరికి కావాలండీ ఇవన్నీ.. మేమేమయినా అడిగామా.. తన స్వంత ప్రయోజనాలకు, ధన సంపాదనకు మాత్రమే చేసారా లేదా?? ఫలాపేక్షణ కోసంచేసి, పెద్ద.. ఎదో.. సమాజాన్ని ఉద్దరించామంటారేమిటి?? ఒక వ్యక్తిత్వం అంటూ లేని వ్యక్తి.. దానికి తోడు లాభాపేక్షణ .. వీటన్నింటినీ మించి.. పులితోలు కప్పి.. మహానుభావుడు అనేటటువంటి పెద్ద పదాలు .. ఏమిచేస్తాం .. సమస్య మనలోనే ఉంది.. మనం ఇంకొకళ్ళను అనుకునేం లాభం.. ఈ సినిమా వాళ్ళంతా ఇంతే..

అదేదో సినిమాలో హీరోయిన్, నటించే చాన్సు కోసం పడుపు వృత్తికి కూడా వెనుకాడదు .. మళ్ళీ తను చేసేది తప్పుకాదన్నట్లు / సరైనట్లు డైలాగు .. "ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు ..", వీళందరినీ పెద్ద స్టార్‍లుగా మనం గుర్తించేయ్యడం. మనం గుర్తింస్తున్నాం కదా అని వాళ్ళు కనీస విలువలను గంగలో తుక్కి, మానవతా విలువలకు తిలోదకాలిచ్చి ఇదిగో ఇలా గొప్ప వాళై పోతారు. మన నవతరం ఇలాంటి వాళని తమ తమ గాడ్ ఫాదర్‍గా అనేసుకుని, ఇంకే .. ఇంకేముంది, నేను కూడా అంత వాడినై పోతాను అని ఒక తాడు బొంగరం లాగా తిరిగేస్తూ ఉంటారు.

ఇక్కడ, ఇప్పుడు మరొక ప్రస్తుత పెద్ద నటుడు విషయం తలవని తలంపుగా మదిలోకొచ్చింది. పేరు అప్రస్తుతం.. కానీ విషయం చాలా సున్నితం. ఈ పెద్ద హీరో గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బయి. పెద్ద పిల్ల వివాహం ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒకరితో నిత్సయ తాంబూలాలు తెగతెంపులు.. వేరొకరితో వివాహం. చిన్నకూతురు, అస్సలు చెప్పాపెట్టాకుండా పారిపోయి వివాహం. ఆరోజుల్లో.. చిన్న కూతురు వివాహం పెద్ద వార్తా విషయం. అట్టి మన ప్రభుద్దుడు, ప్రస్తుతం మన రాజకీయాల్లోకి అడుగుడతాడు అనే ఊహాగానాలకు చిలువలు పలువలుగా ఎవ్వరికిష్టమొచ్చినట్లు వారు తమ తమ స్టేట్‍మెంట్ల్.. ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారో .. వాళ్ళ అభిరుచులేమిటో .. వాళ్ళను అదుపులో పెట్టలేక విఫలమయినటు వంటి వ్యక్తి.. రాజకీయాల్లోకి రావడమేమిటో.. మనమందరం కలసి, ఆయనకు ఓట్లు వేసి ఆయన్ను మనల్ని పాలించే అధికారం కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనేమిటో.. వీటన్నింటికి మనం గొర్రెల్లాగా .. తానా అంటే తానె తందానా అనడం ఏమిటో.. నాకయితే అర్దం కావటం లేదు ..

ఇక ముగించేముందు, తేలిందేమిటంటే.. సినిమావాళందరూ ఇంతే.. స్వప్రయోజనలే తప్ప పరోపకారం ఏమాత్రం లేనివారు అని... వీళందరినీ చూస్తుంటే.. పర భాష వాడైనా .. షారుక్ ఖాన్ .. అదేదో కార్యక్రమంలో నిఖచ్చితంగా అన్నాడట.. నేను చేసేది అచ్చంగా వ్యాపారం .. నేను రాజకీయాలలోకి పనికిరాను అని. తెలివయిన వాడు అనిపించింది. నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి ధైర్యంకావాలి.

గాజులకు వేళాయరా

అమ్మ పిల్లలకందరికి గాజులు కొనుక్కొచ్చి స్వయంగా వేస్తుంటే తీసినది. నిన్నటి పుటలో చెప్పినట్లు.. ముగ్గురు పిల్లలకి గాజులు కొన్నుకొచ్చింది, అమ్మ. ఇంకే.. భోజనాలు అయ్యిన తరువాత పిల్లలిద్దరికి దగ్గరుండి తనే స్వయంగా వాళకు గాజులేస్తుంటే, చెప్పా పెట్టకుండా.. ఫోటో తీసేసాను..

పాతరోజుల్లో అయితే గాజులబ్బి వచ్చేవాడు.. ఈరోజుల్లో వాళెక్కడా కనబడటం లేదు కదా.. నా ఉద్దేశం హైదరాబాదు వంటి ఊళ్ళల్లో అని .. విజయవాడ లాంటి ప్రదేశాల్లో బహుశా కనిపిస్తారెమో.. మరి మీ ఊళ్ళో పరిస్తితి ఏమిటో???
అస్సలు ఇంతకీ మీకు ఈ చిత్రంలో గాజులు కనబడ్డాయా?? లేకపోతే ఒక్కసారి ఈ చిత్రం మీద ఎలుక ఎడమ బొత్తంని ఒత్తి చూడండి..
ఏమిటి .. ఎలుక .. ఎడమ బొత్తం .. ఒత్తడం.. అర్దం కాలేదు కదా..
అర్దం అయితే ఫరవాలేదు.. కాకపోతే..
మౌసు లెఫ్టు బటన్ ని ఈ ఫొటో పైన క్లిక్ చెయ్యమని దానర్దం ..
కొంచం తికమక పెట్టినట్లు ఉంది కదూ.. నాకూ అలాగే ఉంది... ఇప్పుడు కాదు .. ఆ వాక్యాన్ని ఆలోచించినప్పుడు .. కొంచం వింతగా ఉంటుందని అలా వాడేశాను.. ఎలా ఉంది నా ఈ ప్రయోగం ??
మొహమాట పడకుండా.. నిజం చెప్పండి..

పులిహొర

మామిడికాయని చెక్కి(అదే తురిమి) పులిహొర చేస్తే, ఇలాగే ఉంటుంది. ముందు చెప్పినవన్నీ ఒక ఎత్తైతే .. పులిహోర ఒక్కటే ఒక్క ఎత్తు. మా ఇళ్ళల్లో చేసే పులిహోరలో తప్పనిసరిగా పచ్చిమిరపకాయలు మరియు ఎండు మిరపకాయలు ఉండాల్సిందే. వాటిల్ని పులిహోరతో పాటుగా తింటూ ఉంటే అస్సలు కారమే అనిపించదు.

మా ఇంట్లో అందరికి పులిహోరతో తప్పనిసరిగా ఇవి తినే అలవాటు, ఒక్క శ్రీమతికి తప్ప. మీరెప్పుడైనా పచ్చిమిరపకాయ కారంలేకుండా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అనుకున్నదే తడవుగా, మా ఇంటికి వచ్చేయండి..

ఎదో చెప్పానుకదా అని చెప్పాపెట్టకుండా వచ్చేయ్యకండి, మొహమాటానికయినా ఒక్క చిన్న కబురు.. అదేననండీ.. పాతరోజుల్లో అంటూటారే.. కాకితో కబురు చెయ్యమన్నట్లు .. మీరు కాకితో కబురు పంపకండి.. ఎందుకంటే, నాకు కాకి బాష రాదు కదా.. అందుకని .. వీలయితే ఒక ఈపత్రమో, లేక దూరవాణి యంత్రముద్వరానో తెలియజేయగలరు. మేముకూడా సిద్దంచేసుకోవాలికదా..

ఏమంటారు?? ఎప్పుడొస్తున్నారు??

పులుసు-కేసరి-పప్పు

ముక్కల పులుసు, కేసరిలతో మామిడి కాయ పప్పు. ఈమద్య నాకు కూరగాయల మీద కొంచం శ్రద్ద ఎక్కువయింది. అందుకనే కూరగాయలు ఎక్కువగా లాగించేస్తున్నాను. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరినీ తినమని ఒకటే పోరు.

అస్సలు ఈ విషయం ప్రక్కన పెడితే.. పులుసు పెట్టాలంటే.. మా అమ్మే.. అందునా ముక్కల పులుసు.. ఏమిటండోయి.. ముక్కల పులుసు అనగానే.. చికెను, మటను ముక్కలనుకున్నారా.. మేము పూర్తిగా శాఖాహారులం. కాబట్టి, ముక్కల పులుసు అనగానే పులుసులో వేసే కాయగూరల ముక్కలు అన్నమాట.. ఏమిటండి.. నిరుత్సాహ పరిచాననుకుంటున్నారా.. తప్పదు సార్.. యావత్ ప్రపంచమే.. శాఖాహారం భుజించండి అని ఇల్లెక్కిన కోడిలా కూస్తూఉంటే, మీరు మాత్రం మాంశాహారం భుజించడం ఏమాత్రం బాగాలేదండి.. ఒక్క సారి ఆలోచించి చూడండి.

ఇక తీపి పద్దార్ద విషయాని కొస్తే.. కేసరి.. అమ్మ చెయ్యాలి మేము తినాలి.. అహా .. ఎంతబాగా చేస్తుందంటే......... ఈ విషయం చెప్పడం కన్నా .. ఏమేసి చేస్తుందో చెబితేసరి.. చక్కగా నెయ్యి వేసి.. నిండుగా గుండు జీడిపప్పేసి.. ఎర్రగా వేయించిన కిస్‍మిస్‍లు దట్టించి.. వడ్డించందంటేనా.. నా సామి రంగా.. కేకనుకోండి..

వీటన్నింటికీ ముందిగా నేనున్నానంటూ.. మామిడికాయ పప్పు.. కొంచం నెయ్యి వేసుకుని.. కొంచం ఆవకాయ కారం నంచుకుంటూ తింటూ ఉంటే.. అహా.. ఏమి హాయిలే హరా ఆఆఆఆ .. అన్నట్లు ఉంటుంది.. ఇంక చాలు

 
Clicky Web Analytics