తనదాకా వస్తే గానీ .. రెండవ భాగం

క్రిందటి పుట, తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ.. జరిగిన తరువాత కొద్ది రోజులకు జరిగింది.. ప్రస్తుత కధాంశం. అస్సలు కధలోకి వచ్చేటప్పుడు కొంత ఉపోధ్ఘాతం.

ఇది జరిగిన ముందు రోజు కార్యాలయం నుంచి అధికారి చేత తిట్లు తిని, ఆలస్యంగా ఇంటికి చేరుకున్నా. తెల్లవారి ఝామున వేళ్ళలో అనుకుంటా అప్పటి మా క్లైంట్ ఫోన్ చేసి మేము ఇచ్చిన ప్రాజెక్ట్ పని చెయ్యటం లేదు కాస్త చూడమనగానే, సగంలో ఉన్న నిద్రకాస్తా ఎగిరిపోయింది. కొద్దిగా కష్ట పడగానే, ప్రాజక్టు మళ్ళీ మామూలు స్తితికి వచ్చేసింది. ’ఈ మాత్రం దానికే.. మాంఛి నిద్రలో ఉన్న నాన్ను మేలుకొలపాలా .. ’ అనుకుంటూ నిద్రకు ఉపక్రమించా. నిద్రకైతే ఉపక్రమించా గానీ, ఉదయం కార్యాలయానికి వెళ్ళి ఎంత మందిని తిట్టాలా.. ఎలా అస్సలు విషయాన్ని టీంలో ఉన్నవాళ్ళకు తెలియ జేయాలా.. మనం చేసే ప్రతీ పనికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి ఎలా తెలియజేయ్యాలా అనుకుంటూ కాలక్షేపం చేసా.

ఇంతలో ఎప్పుడు తెల్ల వారిందో తెలియదు, తీరా చూద్దునుకదా ఎనిమిదిన్నర. ఇంత లేటయినా లేపనందుకు పెళ్ళాన్ని తిట్టుకుంటూ, గబా గబా కాల కృత్యాలు తీర్చుకునే దిశగా ఉపక్రమించాను. ఎంత గబా గబా చేసినా తొమ్మిది పది అయ్యింది. ఇంతలో భార్య, తన ఆఫీస్‍కు లేటవుతోందని, టిఫిన్ చేసి హాట్ పాక్ లో పెట్టానని చెప్పడం లీలగా వినిపించింది. లఘు పూజ, ఫలహారం అయ్యేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటి, రాహు కాలం అయ్యింది. ఇంతకీ ఈ రాహు కాలమేమిటనుకుంటున్నారా..

మా ఇంటి దగ్గర నుంచి 9:20 లోపుల బయలు దేరితే, ట్రాఫిక్ జామ్ ఉండదు. కొంచం దాటిందా, ఇంతే సంగతులు. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా.. పుణ్య కాలం అంటే, 9:20 లోపుల.. రాహు కాలమంటే.. 9:30 దగ్గరనుంచి అన్నమాట. ఆరోజు నా దురదృష్టవశాత్తు, నేను రాహు కాలంలో బయలు దేరవలసి వచ్చింది.

అయినా, వెయ్యి దేవుళ్ళను ప్రార్దిస్తూ బయట పడ్డా..

పైన చెప్పిన ప్రదేశం గుర్తు కొచ్చిందను కుంటా. నా ప్రయాణం పైన చెప్పిన U turn మొదటి దాకా బాగానే సాగింది. అదిగో అప్పుడు మొదలైంది నా కష్టకాలం.

నాకన్నా ముందు ఉన్న ఇద్దరు వాహన చోదకులు నాకు దారి ఇవ్వరు, వాళ్ళు వెళ్ళరు. తీరా కుడి చేతి వైపు చూడ బోతే, ట్రాఫిక్ పలచగా ఉంది. ఎదో విధంగా వీళ్ళని దాటుకుని ప్రక్క రోడ్డులోకి చేరుకుందా మనుకుంటూ ఉంటే, నాకోసమే పుట్టి నట్లుగా, వాళ్ళు కావాలని నాకు ఆడ్డం వస్తూ ముందుకు సాగి పోయ్యారు. నేను U turn, దగ్గర కి వచ్చే సరికి, నాకు ముందు ఒక ఆటో వాడు, కావలని ఇరికించెసాడు. ఒక్క నిమిషం కనక వీలు కలిగితే, దాటి పోయ్యేవాడిని. ఇంతలో అక్కడున్న రక్షక భటుడు, అందరినీ ఆపేశాడు. ఎవ్వరో మినిష్టర్ ఆ వైపుగా పోతున్నాడంట.

వాడి కోసం ముందున్న ట్రాఫిక్ అంతా కదిలించి రోడ్డు కాస్తా ఖాళీ చేయించారు. హమ్మయ్య.. పోతే.. పోయింది, కాస్త రోడ్డంతా విశాలంగా ఉంది .. ఝూయ్.. మంటూ పోవచ్చు అనుకుంటూ wait చెస్తున్నా.. ఇంతలో ఏమైందో ఎమో, ఉన్న ఫళ్ళంగా మయూరి పిలిమ్స్ ప్రక్కనుంచి జనం పలో మంటూ రావడం, అప్పటి దాకా మన మినిష్టరు గారికోసం ఎదురు చూస్తు దారి వదిలిన వాహన చోదకులు, ఉన్న జనంతో పాటుగా ఒక్కసారిగా ముందుకు దూకేసారు. ఇది అక్కడి పోలీసళ్ళకు మింగుడు పడలేదు. ఈ ఘటనని ఉపయోగించు కుంటూ నాముందున్న ఆటో వాడు, జనం మధ్యనుంచి ముందుకు దూకడానికి చేసిన ప్రయత్నంలో అడ్డుగా ఉన్న కానిష్టేబులు ని గుద్దేశాడు. ఇంకే ముంది, జనం మాకు ఆడ్డు పడ్డారు. నానా తతంగం..

సీను కట్ చేస్తే.. పది గంటల పది నిమిషాలు.. సిచ్యుయేషన్ సేమ్.. అదే స్తలం, అదే ట్రాఫిక్, చిన్న తేడా.. నేను బండి మీద.

ఒక వైపు లేటవుతోందన్న చికాకు.. మరోవైపు చెయ్యని తప్పుకు జనాల చేత మాటలు పడ్డ భాధ.. వీటన్నింటికీ మించి చిందర వందరగా ట్రాఫిక్. క్రిందటి పుటలో చెప్పినట్లు, ఫుట్ పాత్‍లు ఎక్కి పోయే వాహన ఛోదకులు.. అంతా కలసి గజిబిజి గందర గోళంగా తయారయ్యాయి. వీటన్నింటినీ మించి, క్రిందటి పుటలో నేను వహించిన పాత్ర ఒక ముసలాయన వహిస్తున్నారు.

వయస్సులో ఉన్న వాళ్ళంతా ఆయనను గేలి చేస్తూ, సాగి పోతున్నారు. ఎంత ఎక్క వద్దనుకున్నా, ప్రక్కనున్న వాళ్ళు నన్ను కూడా అటు వైపు పొమ్మంటూ వొత్తిడి చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు, నన్ను తిట్టడం కూడా జరిగి పోయింది..

’బండి తోలడం చేతగాక పోతే ఎలా.. అటు చూడు, ఎంత మంది పోతున్నారో.. జర ప్రక్కకి తప్పుకో రాదే.. నేను గూడా పోతా..’

సరే కదా అని, అతనికి చోటిచ్చా.. అంతే సంగతులు, చీమ తలకాయ దూర్చేంత చోట్టిచ్చామంటే, ఏనుగునే దూర్చేసే రకం మన ద్విచక్ర వాహకులు. ఇరికించు కుంటూ మరో పది మంది దూరేశారు. వీళ్ళలో ఒకడు దాదాపు ముందు చెప్పిన ముశలాయనను గుద్దేంత పని చేశాడు. ఆ పెద్దాయన, ఈ కుర్రాడితో తగువుకు దిగాడు.

కుర్రాడు: ఏం.. అలా అడ్డంగా నిలబడక పోతే.. కొంచం జరగరాదే..

పెద్దాయన: కళ్ళు కనబడటంలే.. ఇది ఫుట్ పాత్ అనుకున్నావా.. లేక రోడ్డనుకున్నావా..

కుర్రాడు: కళ్ళు కనబడ పట్టే, బ్రేకు వేసా.. లేకుంటే.. ఈ పాటికి ఎగ్గిరి అక్కడ పడేవాడివి..

పెద్దాయన: గుద్దుతావురా.. బొత్తిగా క్రమశిషణ లేకుండా పెరిగితే.. ఇలాగే తయారవుతారు..

కుర్రాడు: ఏంది వయ్యా .. ఎదో ఎదో వాగుతున్నావ్..

ఇంక చూడడం నావల్ల కాలేదు. కొంచం ప్రక్కగా చేరి, బండి మీద ఉన్న కుర్రాడితో... ఎదో చెప్ప జూసా.. ఇంతలో వెనకనుంచి ఎవ్వడో మరో డ్రైవర్ మెల్లగా వచ్చి నా బండిని గుద్దాడు..

మీరెందుకు సారు ఆగుతారు.. వాళ్ళ భాధ వాళ్ళేదో పడతారుగా.. మీరు కానీయ్యండి

ఇక చేసేది ఏమీ లేక, నాకు అప్పటికే ఆలస్యం అయ్యేటప్పటికి, స్వకార్యం .. స్వామి కార్యం (పెద్దాయనని రక్షించే పని) గా పనికొస్తుందని, ఫుట్ పాత్ ఎక్కించి, ముందున్న కుర్రాడి బండికి ఒక చిన్న డాష్ ఇచ్చా.. వాడికన్నా నేను పెద్దగా కనబడ్డానేమో.. గుర్రుగా చూస్తూ ఒక లుక్కేసాడు..

నేను: కానీ .. పద.. పద..

కుర్రాడు: ఏంది సార్.. ఈయన చూడండీ..

నేను: ఏందయ్యా చూసేది.. పెద్దాయన్ని పట్టుకుని..

కుర్రాడు: పెద్దాయన..!!! (ఎదో ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్లు..) అలా మాట్లాడు తున్నాడా..

నేను: ఆయన విషయం ప్రక్కన పెట్టు.. నువ్వు మాకు అడ్డంగా తయారయావు.. నీ సంగతి చూసుకో.. లేదా.. ప్రక్కకి తప్పుకో.. అంటూ ఒక్కసారి నా బండి ఎక్సలరేటర్ రైజ్ చేసా..

ఏమనుకున్నాడో ఏమో.. వెంటనే, ముందుకు లాగించేసాడు.. ప్రక్కనున్న పెద్దాయన ఇవేమీ గమనించనట్లు నన్ను కూడా ఓ రెండు తిట్టి ’క్రిందకి ఫో..’ అన్నట్లు ఓ లుక్కేశారు. అలా ఫుట్ పాతు ఎక్కిన నేను, ఆరోజు అనుకున్నా, మనం ఎంత వద్దనుకున్నా ..

ఈట్రాఫిక్ మనచేత తప్పుడు పనులు చెయ్యాలనుకోకుండానే చేయిస్తుందని

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ..

మొదటి సన్నివేశం:

ప్రస్తుత సన్నివేశ స్థలం

సమయం: ఉదయం పది గంటలు

ప్రదేశం: ప్రబుత్వ మహిళా కాలేజి, బేగంపేట, హైదరాబాదు

పాత్రలు పాత్రధారులు : నేను మరియు ఆఫీసులకు పోయ్యే హైదరాబాదీ జనం. పైన చిత్రంలో పసుపురంగు నేను

పరిస్తితి: ట్రాఫిక్ చాలా బాగా ఉంది, ఆంగ్లంలో crawling అనే పదానికి, తెలుగులో పాకుతోంది అనే పదానికి సరిపోయే విధంగా, ఆరోడ్డుపై నిలచి ఉన్న కార్లు మెల్లగా .. అతి మెల్లగా కదులుతున్నాయి

అసలు కధ:

హీరో : ఇంకెవ్వరో కాదు నేనే

నా ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‍కి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుండటంతో, ఆ రోజు ఉదయానే రాహుల్ బజాజ్ సర్వోసింగ్ షోరూమ్‍లో ఇచ్చి, ఇంటికి వచ్చా. అర్దాంగి వేడి వేడిగా ఇడ్లీలు వేసి ఇస్తే.. గుటుక్కు మంటూ లాగించేస్తుండగా మెరుపులా మెదిలింది ఓ ఆలోచన. మేము ఉండేది, బ్రాహ్మణవాడ, బేగంపేట రైల్వేస్టేషన్ దగ్గర. ఆఫీసేమో జూబ్లీహిల్స్. రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుండా U టర్న్ కొట్టి, మహిళా కళాశాల మీదుగా, లైఫ్ స్టైల్ దగ్గరి ఫ్లైఓవర్ మీదుగా సోమాజీగూడ చేరుకుంటా. ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ఉండడం వలన అందునా తొందరగా బయలు దేరుతానేమో, ట్రాఫిక్ సమస్య అంతగా చికాకుగా అనిపించదు. ఆరోజు బండి లేకపోవడంతో ఆటోలో వెళదాం అనుకున్నా. కానీ పైన చెప్పినట్లు మెరుపులా ఒక ఆలోచన మదిలో మెదిలింది.

 

నాతో పనిచేసే మరో సహ ఉద్యోగిని సికింద్రాబాద్ నుంచి వస్తారు. ఆవిడ కారులో వస్తారు. ఎలాగో ఇటునుంచేకదా వెళ్ళేది అని తలంచి వెంటనే ఒక తంతి తగిలించా. అదేనండీ, ఫోను కొట్టా. ఎప్పుడు అడక పోవడం వల్ల, అడగంగానే ఒప్పుకున్నదామె. కాకపోతే ఒక చిన్న మెలిక పెట్టింది. ఆవిడ ఇంటి దగ్గరే కొంచం లేటుగా బయలు దేరుతాను కాబట్టి, ’నేను మహిళా కాలేజీ దగ్గరకు చేరుకునేటప్పటికి దాదాపు పావుతక్కువ పదకొండవుతుంది.. ఫరవాలేదా..’ అంది. ’ దానిదేముంది.. ఒక్క రోజు ఆఫీసుకి లేటుగా పోతే నన్నెవరూ అడగరు .. మెల్లగానే రండీ..’ అంటూ సమాధానమైతే ఇచ్చాగానీ. ఆఫీసుకి లేటుగా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఎదైతే ఎంటి, ఎలాగో అడిగేశాం .. ఇక ఆవిడకోసం వెయిట్ చెయ్యకపోతే బాగుండ దనుకుని ఇంట్లోనే పది నలభై వరకూ కాలక్షేమం చేసా.

 

ఇక చాల్లే అనుకుని మెల్లగా స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని.. అదేనండీ ల్యాప్ టాప్.. మెల్లగా మైన్ రోడ్డుకి చేరుకున్నా. ఇదిగో ఇక్కడ అస్సలైన కధ మొదలైంది. చూడబోతే, ట్రాఫిక్ చాల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఎదోలే అనుకుంటూ మెల్లగా ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ మేమిద్దరం అనుకున్న చోటుకి చేరుకున్నా. ఇదిగో ఇప్పుడు మొదలైంది అస్సలు సీను.. కష్టాల సీను. ట్రాఫిక్ బాగాఉండటం వల్ల, ద్విచక్ర వాహనాలు మెల్లగా రోడ్డు మీదనుంచి, ఫుట్ పాత్ ఎక్కుతున్నాయి. నేనేమో అక్కడే అడ్డంగా నించున్నానాయే. ఇంక చేసేదేమీ లేక వాహన చోదకులు అడగలేక మెల్లగా నా ప్రక్కనుంచి ఫుట్ పాత్ ఎక్కేస్తున్నారు. నాకేమో ఈ తతంగం అంతా చాలా చికాకుగా ఇబ్బందిగా ఉంది. ఇక లాభం లేదనుకుని. ఫుట్ పాత్‍కి అడ్డంగా నిల్చొని వచ్చే వాళ్ళందరినీ పోలీసులా గదమాయించడం మొదలుపెట్టా..

’ఏందిది.. ఇదేమన్నా రోడనుకున్నారా.. ఫుట్‍పాత్.. అటునుంచి వెళ్ళండి..’ నా స్వరంలో కోపం కొట్టొచ్చినట్లుగా అనిపించగానే..

’కొంచం తపుకో అన్నా.. ట్రాఫిక్ చూసావుగా.. ఆఫీసుకి లేటైతోందే..’ అంటున్నాడు ఓ మొటరిస్టు

’ఫుట్ పాత్‍లు ఉన్నవి.. మనుష్యులు నడవడానికి బాసూ.. బండ్లు నడపడానికి కాదు .. అర్ద మైందా..’ అంటూ.. ’పోలీసోళ్ళు ఇక్కడ నిలబడి, ఫుట్‍పాత్‍లు ఎక్కి నడిపించే వీళ్ళందరికీ ఫైన్ వెయ్యచ్చు కదా..’ అని మనసులో అనుకుంటూ ఉండగానే .. జూయ్యి మంటూ మరో మోటరిస్టు అమాంతం వచ్చి గుద్దినంత పని చేసాడు..

’ఏం బాసూ కనబడటంలే.. అలా అడ్డం నిలబడక పోతే తప్పుకోవచ్చుగా ..’ డబాయిస్తున్నాడు. ’ఎదో పెద్ద ఈ ఫుట్ పాత్‍లన్నీ వీళ్ళే కట్టించినట్లు.. చూడండి ఎలా అడ్డం నుంచున్నాడో..’ ప్రక్కనున్న మరో మొటరిస్టుతో అనగానే..

అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా ఒక్క దూటున నా మీద విరుచు పడ్డారు. ’ఏందయ్య.. ఇందాకణ్ణించి చూస్తున్నాం .. ఎవ్వరినీ ఫుట్ పాత్ ఎక్కనివ్వటం లేదు .. ఇదేమన్నా నీ బాబు జాగీరనుకున్నావా...’ మరో గొంతుకు ..

’జరగవయ్యా.. జరగమంటూంటే వినబడటం లేదా..’ ఇంకొడడు.. ఎక్కడ లేని ఐక్యత వీళ్ళందిరిలో ఒక్క సారిగా పుంజుకుంది.

ఇలా ఒకరొకరుగా నామీద యుధానికి దిగటంతో, అలవి కాని చోట అధికుల మన రాదన్నట్లు.. ప్రక్కకి జరిగి వాహన చోదకులకు త్రోవనిచ్చా.. దొరికిందే తడవుగా, ఒకళ్ళు తరువాత మరొకళ్ళు దూసుకుంటూ ఫుట్‍పాత్ పైకి పోనిచ్చేసారు..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

మరో పుటలో తరువాతి సన్నివేశం.. అంత వరకూ ’ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ ఉండకండే.. ’. ఈ పుటకి స్పందిస్తూ తరువాత situation ఎమై ఉంటుందో మీఊహకి ఎలా తోచిందో.. నేను ఈ పుటకి శీర్షికగా ’తనదాక వస్తే కానీ..’ అంటూ ఎందుకు పెట్టానో చెప్పకోండి చూద్దాం



ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన, నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా, విశ్వదాభిరామ! వినురవేమ!

రెండవ ఝాడ్యం.. ఏమి చెయ్యాలి?

ఈ పుట యొక్క మూల విషయాని వెళ్ళే ముందు, కొంత ఉపోధ్ఘాతం. ఇందులో నేను తెలియజేయబోయే కొన్ని విషయాలను, ’మీకు తెలియని నా ఐదు విషయాలు..’ అనే ప్రచురణగా మీ ముందుంచుదాం అని అనుకున్నా. ఇలాంటి ఒక దారాన్ని మన బ్లాగు స్నేహితుల ముందు ఉంచుదాం అనే ఆలోచన మొదటిసారిగా ఏప్రియల్ నెల eతెలుగు సమావేశంలో కలిగింది. దీనిలో భాగంగా, ఆది తెలుగు బ్లాగర్‍గా అందరికీ సుపరిచితులైన చావా కిరణ్ గారిని వారితోపాటుగా.. లేఖినీ, కూడలి వంటి వాటిల్లి విజయ వంతంగా నిర్వహిస్తూ.. బ్లాగింగ్‍ ప్రపంచానికి దూరంగా.. ఉంటూ వస్తున్న వీవన్ గారిని.. మరియూ దీప్తిధారగా పేరొందిన చీమకుర్తి భాస్కర రావు గార్లను మొదటగా ఎంచుకున్నా. వారందరికీ ఒక పెద్ద చాంతాడంత ఉత్తరం వ్రాయడం జరిగింది. వారి వారి అనుమతిని కోరుతూ నేను లిఖించిన ఆ ఉత్తరం ఎక్కడకి చేరిందో తెలియదు గానీ, ఆ అలోచన మాత్రం చిత్తు కుండీ చేరుకుంది. ఎందుకంటారా.. చదవండి..

అడిగినదే తడవుగా.. వయస్సులోనూ.. అనుభవంలోనూ.. ఎన్నని చెప్పమంటారు, అన్నింటిల్లోనూ పెద్దవారైనా భాస్కర రావు గారు వెంటనే స్పందించి వారి సమ్మతిని తెలియజేసారు. మరి మన చావాకిరణ్ గారేమో తన తొలిరేయి నందు, అదేనండీ పది పుటల ప్రచురణలో పూర్తిగా నిమగ్నమై పోయ్యారో ఎమో.. ఈ సంగతి గురించి అస్సలు పట్టించుకున్నట్లు లేరు. మరి మన వీవెన్ గారేమో తరచుగా ఈ విషయాన్ని గుర్తు చేసి, మీ సమ్మతినో లేక తిరస్కారాన్నో తెలియజేయండి అని పలు సార్లు అడగగా, ’ప్రస్తుతానికి కొంచం బిజీగా ఉన్నాను. మైల్ చెయ్యండి.. ఆలోచిస్తా..’ నంటూ తప్పించుకున్నారు. అంటే.. దీనికి ముందు లిఖించిన ఉత్తరం ఎక్కడికి చేరుకుందో నాకర్దం కాలేదు. ఏది ఏమైనా ఇంటర్వూలకు వెళ్ళినప్పుడు, ’We will get back to you..’  అని hr అన్నారంటే దాని అర్దం ఇంక ఈ ఉద్యోగానికి ఆశలొదులుకోవాల్సిందే అని అనుభవం ఉన్న వాళ్ళు అర్దం చేసుకుంటారు. అలాగే, ఎవ్వరైనా పెద్ద వారిని ఎదైనా విషయం గురించి అడిగారనుకోండి, ’మైల్ చెయ్యి.. చదివి రిప్లై ఇస్తా..’ అని మీకు జవాబు ఇచ్చారో .. దాన్ని ఎలా అర్దం చేసుకోవాలో (అనుభ)విఙ్ఞులకు వేరేగా చెప్పనక్కరలేదు. ఏది ఏమైనా అప్పుడు మిస్సైన కొన్ని విషయాలు ఇప్పుడు ఇక్కడ.

-----------ఉపోద్ఘాతం ఇంతటితో ముగిసింది--------------

ఇప్పుడు అస్సలు విషయానికొస్తా. ఉబుసు పోక నేను ప్రారంభించిన ఈ బ్లాగ్ ఎటో ఎటో తిరిగి, నా మెదడంతా పురుగు తొలిచి వేసినట్లు తొలిచేసేసిన తరువాత భవదీయుడు ఉదయించాడు. అంత వరకూ బాగానే ఉంది. కానీ అస్సలు భాధ ఇప్పుడే మొదలైంది. నాజీవితంలో రెండు సంఖ్యకూ పెద్ద పీటే ఉంది. నా ప్రయత్నం లేకుండానే చాలా విషయాలు ఈ రెండు సంఖ్యతో ముడి పడి ఉన్నాయి. ఏమి చెయ్యాలో తోచక ఇదిగో ఇలా మీతో ఇక్కడ.

  • నేను మా తల్లి తండ్రులకు రెండవ సంతానం
  • బ్రాహ్మణుడు స్వతహాగా ద్విజన్ముడంటారు. మొదటిది సాధారణ జన్మమయితే, మరోది ఉపనయనం అయ్యినప్పుడు
  • ఏడవ తరగతి చదివేటప్పుడు ఒకసారి చావు దరిదాపులలోకి వెళ్ళి వచ్చానంట. అమ్మా వాళ్ళు అంటూ ఉంటారు. ఆవిధంగా నేను ఓ రకంగా రెండవ సారి చావు దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది
  • ఒక్క intermediate మాత్రమే మొదటి సారిగా వ్రాసిన పరిక్షలో పాస్ అయ్యా. ఎందుకంటే, దీనికీ రెండు సంవత్సరాలే కదా ఉండేది
  • intermediateలో నేను vocational science గా కంప్యూటర్ సైన్సుని తీసుకున్నా. నా దురదృష్టవశాత్తు, అందులో అన్ని సీట్లు నిండుకున్నందున, మొదట Electrical & Electronics లో చేరి, తరువాత Computersకి మారి పోయా
  • ఇలా చాలా చాలా..
  • వీటన్నింటికీ మించి, ఉబుసు పోక మొదలు పెట్టిన ఈ బ్లాగు కూడా రెండవది. మొదటిది ఆంగ్లంలోని చక్రవర్తి అయితే, రెండవది ఈ ఉబుసు
  • పోనిలే భవదీయుడు మూడవదవతుందనుకుంటే.. తెలుగులో నేను మొదలు పెట్టిన రెండవ బ్లాగు ఈ భవదీయుడు
  • ఇది ఇలా ఉంటే.. పుండు మీద కారం జల్లినట్లు, భవదీయుడు శీర్షిక పేరుతో మరోవ్యక్తి ఇప్పటికే భ్లాగు మొదలు పెట్టడం నాకు మింగుడు పడని విషయం

ఎక్కడి కెళ్ళినా ఇది నన్ను వదలటం లేదు .. సాధరణంగా ఎవ్వరినైనా మీ లక్కీ సంఖ్య ఏమిటి అని ప్రశ్నవేస్తాం, అలాగే నన్ను ఎవ్వరైనా ప్రశ్నిస్తే.. ఏమి సమాధానం చెబుతానో తెలియదు కానీ, మీ unlucky number ఏమిటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా రెండునే గుర్తుకు తెచ్చుకుంటా. ఏమి చేస్తే బాగుంటుందో పాలు పోవటంలేదు. మీకేమైనా తోస్తే తెలియజేయ గలరని మనవి.

ఇట్లు,

భవ అస్మ దీయుడు

RSS Feeds ని చదవడానికి అనువైన సాధనమేమి?

ఈ మధ్య తరచు గా అందరి బ్లాగులు చదవడం మొదలు పెట్టా. ఇక్కడ నేను ఎదుర్కొంటున్న మొదటి సమస్య ఏమిటంటే, ఎవ్వరు ఎప్పుడు ప్రచురిస్తారో మనకి తెలియని విషయం కదా. అందువల్ల, అందరి బ్లాగులు అను నిత్యం వెతుకుతూ ఉండాల్సి వస్తోంది. ఇలా ఎందుకు, చక్కగా జల్లెడ, తెలుగుబ్లాగర్స్[డాట్]కామ్, కూడలి, లాంటివి ఉన్నాయి కదా.. అనుకుంటే, వాటిని కూడా తరచుగా సందర్శిస్తూ ఉండాల్సి వస్తోంది.

నేను స్వతహగా మైక్రోసాఫ్టు వారి అవుట్‍లుక్ ఎక్స్‍ప్రెస్ ద్వారా బ్లాగులను సబ్‍స్క్రైబ్ చేసుకుని చదువు కుంటాను. కానీ తెలుగుని అర్దం చేసుకోలేక, అవుట్‍లుక్ వింత వింతగా చూపుతోంటే, విసుగెత్తి 3rd party టూల్స్‍కై వెతికి కనబడిందల్లా ప్రయత్నించి చూసా. ఈ ప్రయత్నంలో నాకు శ్రమ తప్పితే, అన్నీ తెలుగుని అర్దం చేసు కోవటం లేదన్న విషయం సుస్పష్ట మయ్యింది.

ఇవన్ని ఎందుకు, ఎదో సామెత చెప్పినట్లు,

సామాన్యుడు అన్ని విషయాలు స్వతహాగా తాను అనుభవించి సోధించి సాధించి నేర్చుకుంటాడు, కానీ తెలివైన వాడు ఎదుటి వారి అనుభవాల నుంచి నేర్చుకుంటాడు

నేనే అన్ని ఎందుకు ప్రయత్నించాలి? నాకన్నా ముందుగా చాలా మంది అనుభవఙ్ఞులు ఇలాంటి సాధనం కోసం ప్రయత్నం చేసే ఉంటారు కదా. వాళ్ళని అడిగేస్తే పోలా అని అనిపించిందే తడవుగా, ఆఫీస్‍కు వెళ్ళే సమయం ఆసన్న మవుతున్నా,వ్ెనుకనుంచి భార్య,

ఏమండీ ఆఫీస్‍కు లేటవుతోంది.. దారిలో మళ్ళీ ట్రాఫిక్కు.. జామూ .. అంటారు .. బయలు దేరండీ.. తొమ్మిదిన్నరైంది..

అంటున్నా వినకుండా.. మీ అందరికీ నా విన్నపమేమిటంటే.. మీకు తెలిసిన RSS Readers గురించి తెలియ జేయగలరు. చదివి నందులకు ధన్యవాదములు.

ఎమ్ ఎమ్ కే గారి స్పందన చదివిన తరువాత అనిపించింది. వారు చెప్పిన రెండు సలహాలలో గూగుల్ వారి రీడర్ కే నా ఓటు. కానీ నేను వెతుకుతున్నది అంతర్జాలం (online) లో చదవడానికి వీలైయ్యే రీడర్లు కాదు. అంతర్జాలంలో కాకుండా, offlineలో చదువుకోవడానికి వీలైనటు వంటివి అన్న మాట. నేను ప్రయత్నించి నచ్చక పోయిన టూల్స్ వివరాలు ఈ క్రింది విధంగా..

  • Feed Reader 3.12
  • NewGator - FeedDemon
  • Thunderbird
  • Sharp Reader
  • Omea Reader
  • News Crawler
  • Blog Navigator
  • Blog Bridge
  • Alertbear
  • RSS Bandit

ఇంకా ఎవేవో.. ఏవీ నన్ను తృప్తి పరచలేక పోయ్యాయి. మీరు ఏదైనా ఇష్ట పడి నట్లైతే .. తెలియజేయగలరని మనవి.

తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics