చంద్రగ్రహణం : వికారి : ఆషాడం : గురు పౌర్ణిమ

కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలు

గ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51
గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43
గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44
గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39
ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38

* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి
* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి
* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన చేస్తే ఇంటి యజమానికి స్రేయస్కరం

1- మేషరాశివారు గ్రహణాన్ని గమనించి, శ్రద్దగా పరిశీలనచేయడానికి అనువైన సమయం

2- వృషభరాశివారు గ్రహణాన్ని గమనించకుండా వారికి ఉపదేశానుసారంగా మంత్ర/యంత్ర/తంత్ర జపానలు సాధనలను చేసుకోవాలి. గ్రహణానంతరం తలస్నానం చేసి, సూర్యోదయం తరువాత చంద్రనికి ఓ నూలుపోగుని సమర్పించాలి. పసుపు పూసినదైతే శ్రేష్టం

3- మిధున రాశి వారు గ్రహణాన్ని చూడరాదు. సాధనకి ఇది అనువైన సమయం. తమ ఉద్దతిని కోరుకుని, ఇష్ట దైవానుగ్రహంగా, సూద్రులకు గానీ వైశ్యులకు గాని దానమిస్తే శ్రేష్టం

4- కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం నిమిత్త మాత్రంగా ఉంటుంది. కావున అశ్రద్ద చేయకుండా, సత్కర్మలు చేయకపోయినా సమ్మతమే కానీ ప్రయత్న పూర్వకంగా వికల్పాలకు దూరంగా ఉంటే వారికి శ్రేయస్కరం

5- సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం దుష్కరమల నిర్మూలనకు పనికి వస్తుంది. కావున అంతవరకూ తెలిసి చేసిన దుష్క్రుత్యాలకు పశ్చాతాపం చెంది, పునరావృత్తం కాకుండా ఉండటానికి అనువైన సమయంగా పనిచేస్తుంది. ఈ సమయంలో వీరు క్షత్రీయులకు దానం ఇస్తే శ్రేష్టం

6- కన్య రాశి వారు కూడా ఈ గ్రహణ సమయానికి పూజా మందిరం దగ్గరలో ఉంటే శ్రేష్టం. వీరు గ్రహణాన్ని దర్శించ రాదు. మరునాడు తల స్నానం చేసి వారి ఇష్ట దైవ ప్రీత్యర్దం వైశ్యులకు దానం ఇస్తే మంచిది. గ్రహణానంతరం మీన రాశి వారితో గ్రహణ విషయాలను చర్చించి అధ్యయనం చేస్తే ఇరువురికీ మంచిది

7- తులారాశి కూడా ఈ గ్రహణాన్ని దర్శించ రాదు. మరునాడు తల స్నానం చేసి రావి చెట్టునకు ప్రదక్షణలు చేస్తే మంచిది. గ్రహణానంతరం, వృశ్చిక రాశి వారితో గ్రహణ విశేషాలను చర్చించి అధ్యయనం చేస్తే ఇరువురికీ మంచిది

8- వృశ్చిక రాశి వారికి విధ్యార్దన నిమిత్తం గ్రహణాన్ని పూర్తిగా అభ్యసించాలి. మరునాడు, వీరు వృషభరాశి వారితో చర్చించడం ఇరువురికీ శ్రేయస్కరం.

9- ధనురాశి వారు కూడా ఈ గ్రహణాన్ని దర్శించరాదు. మరునాడు, వీరు వృషభరాశి వారితో కలిసి మేషరాశి వారితో గ్రహణ వి్శేషాలను చర్చించి అధ్యయనం చేస్తే మువ్వురికీ మంచిది

10-మకర రాశి వారుకూడా గ్రహణాన్ని దర్శించకపోవడమే శ్రేయస్కరం. వీరు సింహ రాశి వారికి దానం ఇస్తే లేదా పుచ్చుకుంటే ఇరువురికీ మంచిది

11-కుంభరాశి వారుకి ఈ గ్రహణం అశుభాన్ని కలిగించడానికి అవకాసాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రాశి వారు ఈ గ్రహణానికి అత్యంత దూరంగా ఉంటే వారికి శ్రేయస్కరం. పూర్తిగా ఉపవాశం ఉండి సాధన చేసుకోవాలి

12-మీన రాశివారుకూడా ఈ చంద్రగహణాన్ని అధ్యయన / సాధనలకు అనుకూలమైన సమయంగా తీసకుంటే మంచిది. కావున వీరు తప్పని సరిగా దర్శించి విషయాలను యధావిధిగా ఇతరులతో పంచుకోవాలి.

చక్రవర్తి
జ్యోతిష్య విద్యార్ది ..

** ఈ విషయాలకు నేను మాత్రమే భాద్యుడను. కావున ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలిగినా అందుకు పూర్తి భాద్యత నాదే అని గమనించ గలరు *****

****************************
ఇచ్చిన సమయాలు భారత కాల మాన ప్రకారం ఇవ్వబడ్డాయి. అంటే, ఏఏ ప్రాంతాల వారు వారి వారి ప్రాంతాల అనుగుణంగా మార్చుకోవాలి అన్న మాట.

ఉదాహరణకు, భాగ్యనర వాసులు 16 నిమిషాల 16 సెకన్ల సమయాన్ని తీసేయ్యాలన్నమాట.
************************************

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

చాలా రోజుల తరువాత

ఏదో వ్రాయాలని ఉంది.. ఇంతకాలం గెలిచానో తెలియదు ఓడానో కూడా నాకు తెలియదు..

గెలిచాను అనుకొని ఓడిపోతూ వచ్చానా !! ఓడిపోతూ గెలిచానా !!

కాలం మాత్రం గడిచిపోయింది.. ఎన్నో భావాలు మరెన్నో జ్ఞాపకాలు..

ఏమి సంపాదించానో తెలియట్ల.. ఏమి కోల్పోయానో అర్థం కావడం లేదు..

ఇదంతా అసహనమో అసంతృప్తో అర్ధం కావడం లేదు.. 

ఎంతో చేయాలి అనుకున్నా.. ఏం చేశాను అనుకుంటే ఏమీ కనబడలేదు..

చేయలేక చేయలేదా!! చెయ్యగలిగి చేయలేదా!!

నాకే నేను ప్రశ్నగా మిగిలిపోతున్నానా!! లేక ప్రశ్నించుకుంటూ మిగిలిపోతున్నానా !!

మహిళా ప్లస్సర్ల సమావేశం .. భాగ్యనగరంలో..

నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక.

ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి?

ఆ!!! మహిళలను రాజకీయ నాయకులతో పోల్చడమా !!!

రాజకీయ నాయకులకు దోచుకోవడానికి ఏ పధకం పేరైతేనేమిటి? వాళ్ళకు కావలసినది దోచుకోవడమే, నాకెంత? నీకెంత? అనే కదా అనుకునేది. అదే విధంగా మహిళలకు వారి సమావేశాలకు పేర్లతో పని ఉందా?? ఏ పేరైతే నేమిటి, తలా ఒక వంటకం చేసి తీసుకొచ్చి ఓ చోట పేర్చుకుని కూర్చుని, అప్పట్లో నేనేమి చేసానో తెలుసా.. నువ్వేంమి చేసావు .. అంటూ బాతాకానీ కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి కదా!!

ఈ తతంగం అంతా నాలాంటి ఒంటి కాయ సొంటి కొమ్ము లాంటి వాడు ఖండిస్తున్నాడు. చరిత్ర పునరావృత్తం అవుతుంది అంటే ఏమిటో అనుకున్నా, ఇవ్వాళ కూడా మా ఇంట్లో బెండకాయ కూరే!! Sad smile  అక్కడ వాళ్ళేమో రకరకాల వంటలతో భోజనమా!! నాకేమో బెండకాయ కూర, నీళ్ల చారా.. తూచ్ .. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను..

నిజం వ్రాయాలంటే, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నాకు భలే సంతోషం వేస్తుంది. ఏదో విధంగా మహిళా లోకం అంతా కాకపోయినా, కొందరైనా వీలు చేసుకుని మరీ కలుస్తున్నారు. పాతరోజుల్లో వనభోజనాలు జరిగేవి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా నేను వనభోజనాలలో పాల్గొన్నట్లు ఙ్ఞప్తి లేదు. కారణాలు లేకుండా, మరొకరి హితవు కోరుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చుట్టం చూపుగానైనా వీరందరూ కలుస్తుంటే, ఎంతో ఆనందం కలుగుతుంది. చుట్టాలతో కొన్ని సార్లు ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ, వారింటికి మనల్ని ఆహ్వానించినా, లేక, మన ఇంటికి వారిని ఆహ్వానించిన సమయాన ఈ క్రింది డైలాగ్ సాధారణంగా వినబడుతుంది..

“ .. .. మీ ఇంట్లొ ఏదైనా ఫంక్షన్ పెట్టుకోండి, ఆ వంకనైనా మనం కలుద్దాం .. .. ”

కానీ ఈ మహిళలు కలవడానికి ఓ సాకుని ఎన్నుకుని కలుస్తున్నారే, అది హర్షించదగ్గ విషయం. మనకు ఎలాంటి చుట్టరికం లేని మఱో మహిళను మన ఇంటికి ఆహ్వానించడం లేదా వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారింటికి వెళ్ళడాని ఎదుటి వారితో మనకి ఎంతో సాన్నిహిత్యం ఉండాలి. అలాంటి భావన ఇలాంటి ఘటనల ద్వారా ఈ మహిళలు వ్యక్తపరుస్తున్నారు. కావున ఇలాంటివి మరింత తక్కువ సమయంలో మరిన్ని ఎక్కువసార్లు కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళా ప్లస్సర్లూ!! వింటున్నారా!! సారి, చదువుతున్నారా నా మనోభిష్టాన్ని?

 

[[ష్ .. ష్ .. గప్ చిప్.. గూఢాచారిగా నా భార్య వెళుతోంది, అక్కడ ఏమి జరిగింది, ఎవ్వరెవ్వరు ఏమేమి తెచ్చారు, ఎవ్వరెవ్వరు ఏమేమి మాట్లాడుకున్నారు, వగైరా .. వగైరా.. వంటి మరిన్ని వివరాలు త్వరలో..]]

ప్రస్తుతం మానవునికి తెలిసిన దూరమెంత అంటే!!


ముందు ఈ లంకె చూడండి .. ఐదు భాగాలుగా విడగొట్టి చిత్రంలాగా ఉంచితే.. ఇంతౌతుంది

















------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తెలంగాణా వాదులూ.. మీకు అన్యాయం జరిగిపోతోంది

ఇవ్వాళ ఉదయం ఇంట్లో టిఫిన్ ఆలశ్యం అయ్యేటప్పటికి, బయటికి వెళ్ళి తిందాం అని బయలుదేరాను. ప్రస్తుతం నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను కదా, అదో పెద్ద చెత్త కుండి అని ఆలశ్యంగా తెలిసింది. ఉదయం వేళల్లో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళితే ఓ చోట చాలా మందు గుమ్మి కూడి ఉన్నారు. ఏంటిదిరా, అనుకుంటూ కొంచం నిశితంగా పరిశీలిస్తే అప్పుడు అర్దం అయ్యింది అక్కడ గుమ్మి కూడి ఉన్న వారంతా టిఫిన్ కోసం అని.

చూడబోతే అదో పెద్ద పద్మ వ్యూహంలా ఉంది. దానిని ఎలాగో ఒకలా ఛేదించుకుని టోకెన్లు ఇచ్చే వాడి వద్దకు వెళ్ళి ఇడ్లీ టొకెన్ అడిగాను. ఏదో పేద్ద తప్పు చేసినట్లు వాడో లుక్కు ఇచ్చాడు. తీరా విషయం ఏమిటంటే అక్కడ ఇడ్లీల కన్నా పూరీలు ఫేమస్. సరే నా భార్యకు పూరీ అంటే ఇష్టం కదా అని ఓ ప్లేట్ పూరీ కట్టించుకుని నేను తినడానికి ఏమి ఉందన్నాను. ’అక్కడ బొండాలున్నాయి పోయి ఏది కావాలో పెట్టించుకుని తిను..’ అని ఓ డైలాగ్ వేశాడు.

సరే కదా అని ఆ ప్రక్కనే ఉన్న సర్వింగ్ టేబుల్ వాడి దగ్గరకు వెళ్ళి బాబూ ఓరెండు బోండాలివ్వు అన్నాను. ఏ బోండా కావాలి అన్నాడు? అప్పుడు నా గొంతులో వెలక్కాయ పడింది. బోండాలో రకాలా !! ఏమిటబ్బా ఆ రకాలు అని తేరిపారా చూశాను. అక్కడ రొండు రకాల బోండాలు కనబడ్డాయి. ఒకటి బాగా వేయించ బడి అచ్చం వెజ్ మంచూరియాలా కరకర లాడే రకంగా గరుకుగా పెద్ద సైజు జామకాయ లాగా కనబడింది. అంటే అది వెజ్ మంచూరియా అంత సైజు లేదు కానీ అంతకు ఓ రెండు మూడింతలు సైజు పెద్దగా ఉంది. మఱొకటి కొంచం లేతగా దోరగా వేయించినట్లు నున్నగా నాజూకుగా మగ్గిన సపోటాలా ఉంది.

ఇంతకీ ఏమిటా అవి అనిడిగితే, దోరగా వేయించినట్లున్న దానిని మైసూర్ బోండా అంటారండీ అన్నాడు. మరి మరోదేమిటి అని అడిగితే వాడిచ్చిన సమాధానమే ఈ పోస్టుకి మూలాధారం. దానిని .. అంద్రా బోండా అంటారంట. గేందిరా ఇది, ఈడకొచ్చి ఈడ కొట్టేటి ఈడ అమ్ముకుంటూ ఆంద్రా అంటావ్ .. గిసంటుదే మరోటి సెయ్యాలా.. గసొంటి దానికి తెలంగాణా బొండా అని పేరట్టాలా. ఏమంటార్ ర్రా.. మీకు సానా అన్నాయం సేత్తుండ్రు. తినే తిండికాడ గూడా మీకు హాక్కు లే? దీన్ని మీరందరూ గల్సి కండిచాలే, గా పేరెట్టినోడ్ని బొక్కల్ చూరజూర నూకల్న. గపుటిదాఁక నేను బొండా దిన. బిడ్డా నీ తెలంగాణా బొండామీదొట్టు

ఇది కూడా నిజమే ..

నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని పూరిద్దాం కదా అని చేసిన నా ప్రయత్నంలో నేను బొటా బొటిన పాస్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో బొటా బొటి అంటే వందకు పాస్ మార్క్ అన్నమాట. హిందిలో అయితే వందకు పదిహేను మార్కులు వస్తే పాస్ అన్న మాట అలాగే మిగిలిన సభక్ట్ లలో అయితే ముప్పై ఐదు వస్తే పాస్ అన్న మాట. ఆ లెక్కలో నాకు వందకు నలభై మార్కులు వచ్చాయి.

సమస్యలో వాడు ఇచ్చింది ఐదు ఖాళీలు పూరించమని. నాకు ఙ్ఞప్తికి వచ్చినవి రెండు. అంటే పాస్ అన్న మాట. వాడు ఇచ్చినవి వాటిల్లో నాకు వచ్చినవి ఇక్కడ ఉంచుతా.

వరుస తెలుగు పదం మొదటి అక్షరం రెండొవ అక్షరం మూడవ అక్షరం నాల్గవ అక్షరం ఐదవ అక్షరం
బ్రతికిన       V E
ధైర్యము B R A V E
నడువు       V E
నదులు       V E
బానిస S L A V E

మిగిలిన తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు ఏమై ఉంటుందబ్బా!!

మీరేమవ్వాలనుకుంటున్నారు / ఏమి చెయ్యాలనుకుంటున్నారు

WorstNew

పేజీ తిప్పితే ..

ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది.

ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ మించి కధాగమనంలోని మాటల విషయంలో ఆ రచయితని మెచ్చుకోకుండా ఉండలేను. దీనినే క్రియాత్మకత అని అంటారు.

ఎవ్వరైనా ఏదైనా ఫొటో మోడల్ గా చేద్దాం అని అనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఆనందిస్తారు అని వ్రాయటం కన్నా ఆస్వాదిస్తారు అని వ్రాయటం భేషుగా ఉంటుందేమో. ఒక్క సారి ఆలోచిస్తే పుస్తకంలో ఉండే ప్రకటనలలోని పాత్రలు నిజంగా ఇలాగే ఆలోచిస్తాయా అనేటటువంటి ఊహ ఎంత విచిత్రంగా ఉందో కదా. ప్రకటనలలోని పాత్రలు కనుక నిజంగా ప్రాణం వస్తే ఇలాగే ఆలోచిస్తాయేమో!!

పుస్తక ప్రదర్శన 3వ రోజు విశేషాలు

eతెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న పుస్తక ప్రదర్శన యందలి స్టాల్ యొక్క మూడొవ రోజు విశేషాలు వ్రాద్దామని రెండు రోజులనుంచి అనుకుంటున్నా, కుదరటం లేక ఇవ్వాళ ఎలాగైనా వ్రాసి ముగిద్దామని కూర్చున్నాను. వీలైన వివరంగా వ్రాస్తాను.

మూడోరోజు ప్రధమంగా నేను వెళ్ళటం జరిగింది. మూడోరోజు శనివారం అయినందున ఉదయం పదకొండు గంటలకే తెరుస్తారని చాలా సార్లు నిర్వాహకులు ప్రచారం చేసినందున ఆరోజు ఇంకొంచం ముందుగా వెళదాం అనుకున్నా, భోజనం చేసి అక్కడికి చేరుకునేటప్పటికి పన్నేండున్నర అయ్యింది. స్టాల్ మూసి ఇన్న వైనం ఎందుకో కించిత్ నచ్చక పోయినా, చేసేది లాభాపేక్ష లేకుండా కదా.. ఎవ్వరికి వీలైతే వారు మనకు కలసి వస్తారు, వీలుకాలేని వారిని ఎందుకు వీలుకాలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా అని సమర్దించుకుని, నా వంతు కర్తవ్యంగా నేను వచ్చాను కదా అనుకుని ఓదార్చుకున్నాను. అదిగో అలా మొదలైంది పుస్తక ప్రదర్శనలో మొదటి శనివారం.

అన్నీ సద్దుకుని నా అంకోపరిని నలుగురికి కనబడేటట్టు పెట్టి, కరపత్రాలను సర్ది కుర్చీలో కూలబడ్డాను. జనాలు చాలా పలుచగా వస్తూ ఉన్నారు. మెల్ల మెల్లగా ఒక్కరొక్కరూ రావటం మొదలైంది. వచ్చిన వారికి కరపత్రాలు అందిస్తూ, అడిగిన వారికి తెలిసిన విషయాన్ని తెలియజేస్తూ సాగుతుండగా, మూడున్నర వేళలో కొంచం కునుకు పట్టింది. అలాగే కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతుంటే, ఓ నడి వయస్కుడు చక్కగా నా అంకోపరిని సర్దేసే పని చేశాడు. గబుక్కున మెళకువ వచ్చింది కాబట్టి బ్రతికి పోయ్యాను. మేలుకుని అతని చేతిలో కరపత్రాన్ని ఉంచి పంపేటప్పటికి పట్టిన కునుకు కాస్తా పోయింది.

అలా గట్టేక్కిన సమయానికి మెల్ల మెల్లగా తెలుగు బ్లాగర్లు, eతెలుగు కార్యవర్గ సభ్యులు రావటం మొదలైంది. కబుర్లు చెప్పే కశ్యప్ గారు ముందుగా అక్కడికి చేరుకున్నారు. వారి వెనకాల జావాలినిక్స్ వ్రాసే కట్టా విజయ్ గారు రావటం జరిగింది. ఆనాటి విషయాలలో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే, కట్టా విజయ్ గారు తనతో తెచ్చిన ఎయిర్ టెల్ వారి ఇంటర్ నెట్ కార్డ్. దాని సహాయంతో సందర్శకులకు అంతర్జాలంలో తెలుగు ఎంత బాగా అభివృద్ది చెందుతుందో చూపించగలిగాం. అంతర్జాల సదుపాయాన్ని ఆనాడు eతెలుగు వారికి అందించినందులకు సభా ముఖంగా వారికి ధన్యవాదములు.

అదిమొదలు, ఏకలింగం పేరుతో బ్లాగే మాలికా మూలకారుకులలో ఒక్కరైన శ్రీనివాస్ గారు, శంకరాభరణం అని బ్లాగుతున్న తెలుగు మాస్టారైన కంది శంకరయ్యగారు, వారి వెనకాలే ప్రఙ్ఞ అనే శీర్షికన బ్లాగుతున్న మఱో బ్లాగరు, కోతి కొమ్మచి బ్లాగరుతో మాట్లాడుతుండగా మూడు బీర్ల తరువాత అంటూ అక్కిరాజుగారు వచ్చి కాసేపు పిచ్చాపాటి వేసారు. ఆఖర్లో అనుకుంటా ఒక మంచి మాట చెబుతానంటూ మఱో తెలుగు బ్లాగరు అప్పారావుగారు రావటం జరిగింది. మహిళా బ్లాగర్లలో చురుకుగా పాలు పంచుకుంటున్న జ్యోతిగారు కూడా ఆరోజు తళుక్కున మెరిసి అదృశ్యం అయ్యారు. వీరందరితో పాటుగా సంసృత డాక్యుమెంట్స్ వెబ్ సైట్ నకు సహకారాన్ని అందిస్తున్న గుత్తిన శ్రీనివాస్ గారు కూడా విచ్చేసి వారి అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు.

ఆనాటి చిత్రాలను ఈ లంకెలో చూడవచ్చు.

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.

మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.

వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.

రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.

మొదటి విషయాలలో మఱొకటి

నా జీవితంలో మొదటి సారిగా నేను చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న కొన్ని పనులలో ఇది ఒకటి. గృహ ప్రవేశ ఆహ్వాన పత్రం. నా పెళ్ళికి కూడా ఆహ్వాన పత్రాలు ముద్రించినా, దానియందు నా ప్రవేశం చాలా తక్కువ. ఎందుకంటే, అక్కడ పెద్దవాళ్ళ ప్రమేయమే ఎక్కువ. ఇదిగో ఇప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఓ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కునాను. ఆ ఇంటి లోనికి గృహ ప్రవేశం చేసే ప్రక్రియలో మున్ముందుగా ఆహ్వాన పత్రాన్ని తయారు చెయ్యడం దగ్గరనుంచి ముద్రించడం వరకూ నేనే చేసుకున్నాను. ఈ ప్రయోగంలో తెలుగు సరిగ్గారాని నాకు, రాజశేఖరుని విజయ్ శర్మ గారు, ధూళిపాళ ఆర్క సోమయాజిగారు మఱియు తాడేపల్లి బాల సుబ్రహ్మణ్యం గారు సహాయం చేసారు. వీరికి నేను ఎంతో ఋణపడి ఉంటాను.

ఆహ్వాన పత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది.

Invite

ఆహ్వానితులకు పంచే పత్రాన్ని ఉంచే కవర్ పైన ఈ క్రింద విధంగా ఉంటుంది.

Cover

ఆహ్వానితుల సౌకర్యార్దం మా క్రొత్త ఇంటికి రావడానికి దారి చూపే చిత్రపటం ఈ విధంగా ఉంటుంది.

RouteMap

స్టీవ్ జాబ్స్ – ఆపిల్ సంస్థ మూలం

స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.

steve_jobs

నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ. అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా. ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే. అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం. ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని కారణాలలో మొదటిది ఏమిటంటే..

.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి, అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.

ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా, ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా, నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు, కలలు కనండి, కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ, సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.

వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట) ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు. ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.

నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు. అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు. అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.

దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి. అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే, IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే, IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.

అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత వ్యాపారం తోడైంది.

ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి (అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే బుఱ ఇకలేదు. ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి

కెలుకుడు బ్యాచ్ – ఇక మీ ఇష్టం

ఈ మధ్య కొన్ని వ్యక్తి పరమైన అలాగే వ్యాపర పరమైన ఘటనలు నలుగురిలో ఉంచి నన్ను అమర్యాద చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని ప్రయత్నం జరిగింది. ఆ పంచాయితీకి నేను దూరంగా ఉన్నందు వల్ల పంచాయితీ పెట్టిన పెద్దల ఇగో దెబ్బతింది. వారి అహం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఎంతటి నీచానికి పాల్పడుతున్నారంటే, తలచుకోవడానికే అసహ్యం వేస్తోంది. అలాంటిది వ్రాయడాని అక్షరాలు రావటం లేదు.

నేను స్వతహాగా కొందరికి దూరంగా ఉంటాను, అలాంటి వారిలో పద్దతిగా మాట్లాడటం రానివారు, గౌరవించడం తెలియని వారు, ఎంత చదువు చదువుకున్నా నోరు తెరిస్తే బూతులు తప్ప మాట్లాడని వారు.. వగైరా వగైరా. ఆ జాబితాలోకి ఈ మధ్య మఱో వ్యక్తి చేరారు. ఈ వ్యక్తి ఎలాంటి హేయమైన చర్యలు పాల్పడుతున్నారంటే, తలచుకున్నప్పుడల్లా నాలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోంది. అలా చేరుకున్న ప్రతీ సారి నాకు నేను ఏవిధంగా స్పందిస్తున్నానో అవగతం అవుతోంది. ఇది ఒక విధంగా నాకు మంచిదే అవుతోంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు, నిన్ను నీవు తెలుసుకో.. అన్న వాక్యం యొక్క అర్దం ఇలాంటి సంఘటనల వల్ల నాకు నేను ఎంత ఆవేశ పరుడినై నాకుండాల్సినటువంటి ఇంగిత ఙ్ఞానాన్ని ఎలా కోల్పోతున్నానో అవగతం అవుతోంది.

నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టలనుకునే కెలుకుడు బ్యాచ్ వారందరికో ఇదే నా ఆహ్వానం. మీరు ఎంత దిగజారి ఎంత హేయమైన ప్రవర్తన చూపించుకోవాలనుకుంటున్నారో అంత ప్రయత్నించండి. మీ శక్తి వంచన లేకుండా మీ సత్తా ఏమిటో చూపించండి. మీరు ఎంత పోటీ ఇస్తే నేను అంత గట్టివాడనౌతాను. చూద్దాం, ఈ యుద్దంలో మీరు గెలుస్తారో నేను గెలుస్తానో తేలే వరకూ నేను వెనక్కు తగ్గను.

ఇదంతా నేనే!! ఓ అవలోకనం

నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో బ్లాగడమే తెలుసు, తెలుగులో బ్లాగుతారని లోకి వచ్చిన తరువాత తెలిసింది.

మొట్ట మొదటి సారిగా 2008వ సంవత్సరంలో మార్చి నెలలో 12వ తారీఖున “ఉబుసు పోక” బ్లాగాను. అలా సాగిన నా బ్లాగు ప్రహసనం మూడేళ్ళ తరువాత ఈ పుటతో నూట యాభైయొకటవ పుటకు చేరుకుంది. అలా కొంత కాలం అయ్యిన తరువాత, ఈ ఉబుసు పోక బ్లాగడాన్ని ఉత్తి హాస్యాస్పదమైన లేదా అంతగా ఆలోచించడానికి అవసరం లేని విషయాలకు మాత్రమే పరిమితం చేసి, కొంచం ఆలోచించడానికి అవసరమైన విషయాలను భవదీయుడు అనే బ్లాగులో వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఇలా భవదీయుడు బ్లాగు మే నెల ఐదో తారీఖున మొదలైంది. భవదీయుడు బ్లాగులో ఓ వంద పోస్టులు వరకూ పడ్డాయ్యన్నమాట. నిజంగా చెప్పాలంటే భవదీయుడు బ్లాగు నూట ఒక్క పోస్టులు నోచుకున్నా, ఒక పోస్టుని పలు కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. మొదటి గణనాంకాలు

  ఉబుసు పోక భవదీయుడు
వ్రాసిన పోస్టుల సంఖ్య 150 100
మొత్తం స్పందనలు 501 580
పోస్టుకి ఎక్కువ స్పందనల 22 58
పోస్టుకి అత్యధిక హిట్స్ 1502 886
ఏ నెలలో అత్యధిక హిట్స్ 2010 అక్టోబర్ 2010 ఆగస్ట్
అత్యల్ప హిట్స్ 2011 మార్చ్ 2011 మార్చ్
ఇంతవరకూ ఎన్ని హిట్స్ 20151 18661

ఇప్పుడు విడివిడిగా ఒక్కో బ్లాగుగురించి పరిశీలిస్తే.. వివిధ దేశాలనుంచి ఎన్ని విజిట్స్ వచ్చాయి, ఒక్కో దేశాన్నించి ఎన్ని అనే లెక్కలో ప్రధమ పది దేశాలను లెక్క వేస్తే ఈ క్రింది విధంగా లెక్క తేలింది.

దేశాల వారిగా పుటల సందర్శన ఉబుసు పోక భవదీయుడు
భారతదేశం 12556 8031
అమెరికా 4607 7287
సింగపూర్ 483 561
యునైటెడ్ కింగుడం 425 478
యునైటెడ్ ఎమిరేట్స్ 222 137
కెనడా 63 171
చెక్ రిపబ్లిక్   148
ఫ్రాన్స్   134
అస్ట్రేలియా 70 105
నెదర్లాండ్స్   105
జపాన్ 62  
ఓమన్ 56  

ఇప్పుడు ప్రస్తావించ బోయే గణనాంకాలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే, ఎక్కువమంది ఏ ఏ విహారిణులు వాడారు అన్న ఆలోచన వచ్చిన తరువాత గణనాంకాలు చూస్తే, నాకు ఎంతో ప్రీతి ప్రాయమైన మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత స్థానం మొజిల్లా వారి ఫైర్ ఫాక్స్. అంతే కాకుండా దాదాపుగా నేను ఎన్నడూ వినని విహారిణుల గురించి కూడా నాకు తెలిసింది.

విహరణి గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8546 7528
ఫైర్ ఫాక్స్ 7053 7387
క్రోం 3774 2871
సఫారి 273 410
ఒపెరా 156 92
క్రోం ఫ్రేం 93 71
ఒన్ రొయిట్ (OneRiot) 30 54
సింపుల్ పై (SimplePie) 18 19
pythumbnail.py 12  
PBSTB 11  
జావా   18
సెర్చ్ టూల్ బార్   17

విచ్చేసిన అతిధులు వాడిన ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఒక్కసారి అవలోకిస్తే ఎక్కువ శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారని తెలియడం ఆశ్చర్యం కాదు కానీ, విచ్చేసే వారు వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టంస్ వాడటమే కాకుండా, అధునాతన మైన సాధనాలైన మొబైల్ ఉపకరణాల ద్వారా కూడా విచ్చేస్తున్నారన్న విషయం నమ్మబుద్ది కాలేదు.

ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
విండోస్ 19216 16502
మాకింతోష్ 305 1141
మిగతా యునిక్స్ 367 386
లినిక్స్ 136 324
ఐఫోన్ 62 120
ఐపాడ్ 55 39
ఇపోడ్   10
విండోస్ NT 6.1   3
నోకియా 6 1
సామ్ సంగ్   1
LG 11  
FreeBSD 2  

నా ఈ బ్లాగులు ఏ ఏ అగ్రిగేటర్ల ద్వారా వీక్షించ బడుతున్నాయి అన్న ఆలోచనలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భవదీయుడు బ్లాగుని తెలుగు బ్లాగర్స్ లోను అలాగే ఒన్ ఇండియా వారి బ్లాగ్స్ యందు కలపలేదని. వీలు చూసుకుని వాటికు కూడా కలుపుతాను.

దారి చూపిన URLs స్థానం ఉబుసు పోక భవదీయుడు
కూడలి 1 1
మాలిక 2 2
గూగుల్ పోల్స్   3
హారం 4 4
జల్లెడ 3 5
తెలుగు బ్లాగర్స్ 5  
ఒన్ ఇండియా / దట్స్ తెలుగు 6  

ఈ మూడేళ్ళను సంవత్సరం ప్రకారం చూస్తే నాలుగు సంవత్సరాలను లెక్కలోకి తీసుకుని ఎన్నెన్ని పోస్టులు వ్రాసాను అని ఆలోచిస్తే కొంచం వైవిధ్యం కనబడుతోంది.

సంవత్సరం ఉబుసు పోక భవదీయుడు
2008 64 19
2009 30 33
2010 36 30
2011 19 18

ముగించే ముందు ఓ విషయం నాకు ఆశ్చర్య పఱచింది. భవదీయుడు బ్లాగులో అమెరికాపై వ్రాసిన మూడు పోస్టులు టాప్ పదింటిలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకుంటే, ఉబుసు పోని బ్లాగులో సినిమా పాటల రివ్యూలు మొదటి స్థానాలు ఆక్రమించుకున్నాయి. ఇంకా విశ్లేషించ వచ్చు కానీ కొంచం ఎక్కువ విశ్లేషించుకుంటున్నానేమో అనిపిస్తూ విరమించుకుంటున్నాను. నేనె ఇంతగా డప్పు కొట్టుకుంటే నాకన్నా ఎక్కువగా వ్రాసేవారు ఎంత కొట్టుకోవాలో అన్న విషయం బుర్రలో దూరి బండ బూతులు తిడుతోంది.

 
Clicky Web Analytics