మొదటి విషయాలలో మఱొకటి

నా జీవితంలో మొదటి సారిగా నేను చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న కొన్ని పనులలో ఇది ఒకటి. గృహ ప్రవేశ ఆహ్వాన పత్రం. నా పెళ్ళికి కూడా ఆహ్వాన పత్రాలు ముద్రించినా, దానియందు నా ప్రవేశం చాలా తక్కువ. ఎందుకంటే, అక్కడ పెద్దవాళ్ళ ప్రమేయమే ఎక్కువ. ఇదిగో ఇప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఓ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కునాను. ఆ ఇంటి లోనికి గృహ ప్రవేశం చేసే ప్రక్రియలో మున్ముందుగా ఆహ్వాన పత్రాన్ని తయారు చెయ్యడం దగ్గరనుంచి ముద్రించడం వరకూ నేనే చేసుకున్నాను. ఈ ప్రయోగంలో తెలుగు సరిగ్గారాని నాకు, రాజశేఖరుని విజయ్ శర్మ గారు, ధూళిపాళ ఆర్క సోమయాజిగారు మఱియు తాడేపల్లి బాల సుబ్రహ్మణ్యం గారు సహాయం చేసారు. వీరికి నేను ఎంతో ఋణపడి ఉంటాను.

ఆహ్వాన పత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది.

Invite

ఆహ్వానితులకు పంచే పత్రాన్ని ఉంచే కవర్ పైన ఈ క్రింద విధంగా ఉంటుంది.

Cover

ఆహ్వానితుల సౌకర్యార్దం మా క్రొత్త ఇంటికి రావడానికి దారి చూపే చిత్రపటం ఈ విధంగా ఉంటుంది.

RouteMap

స్టీవ్ జాబ్స్ – ఆపిల్ సంస్థ మూలం

స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.

steve_jobs

నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ. అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా. ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే. అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం. ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని కారణాలలో మొదటిది ఏమిటంటే..

.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి, అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.

ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా, ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా, నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు, కలలు కనండి, కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ, సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.

వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట) ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు. ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.

నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు. అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు. అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.

దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి. అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే, IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే, IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.

అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత వ్యాపారం తోడైంది.

ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి (అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే బుఱ ఇకలేదు. ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి

కెలుకుడు బ్యాచ్ – ఇక మీ ఇష్టం

ఈ మధ్య కొన్ని వ్యక్తి పరమైన అలాగే వ్యాపర పరమైన ఘటనలు నలుగురిలో ఉంచి నన్ను అమర్యాద చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని ప్రయత్నం జరిగింది. ఆ పంచాయితీకి నేను దూరంగా ఉన్నందు వల్ల పంచాయితీ పెట్టిన పెద్దల ఇగో దెబ్బతింది. వారి అహం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఎంతటి నీచానికి పాల్పడుతున్నారంటే, తలచుకోవడానికే అసహ్యం వేస్తోంది. అలాంటిది వ్రాయడాని అక్షరాలు రావటం లేదు.

నేను స్వతహాగా కొందరికి దూరంగా ఉంటాను, అలాంటి వారిలో పద్దతిగా మాట్లాడటం రానివారు, గౌరవించడం తెలియని వారు, ఎంత చదువు చదువుకున్నా నోరు తెరిస్తే బూతులు తప్ప మాట్లాడని వారు.. వగైరా వగైరా. ఆ జాబితాలోకి ఈ మధ్య మఱో వ్యక్తి చేరారు. ఈ వ్యక్తి ఎలాంటి హేయమైన చర్యలు పాల్పడుతున్నారంటే, తలచుకున్నప్పుడల్లా నాలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోంది. అలా చేరుకున్న ప్రతీ సారి నాకు నేను ఏవిధంగా స్పందిస్తున్నానో అవగతం అవుతోంది. ఇది ఒక విధంగా నాకు మంచిదే అవుతోంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు, నిన్ను నీవు తెలుసుకో.. అన్న వాక్యం యొక్క అర్దం ఇలాంటి సంఘటనల వల్ల నాకు నేను ఎంత ఆవేశ పరుడినై నాకుండాల్సినటువంటి ఇంగిత ఙ్ఞానాన్ని ఎలా కోల్పోతున్నానో అవగతం అవుతోంది.

నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టలనుకునే కెలుకుడు బ్యాచ్ వారందరికో ఇదే నా ఆహ్వానం. మీరు ఎంత దిగజారి ఎంత హేయమైన ప్రవర్తన చూపించుకోవాలనుకుంటున్నారో అంత ప్రయత్నించండి. మీ శక్తి వంచన లేకుండా మీ సత్తా ఏమిటో చూపించండి. మీరు ఎంత పోటీ ఇస్తే నేను అంత గట్టివాడనౌతాను. చూద్దాం, ఈ యుద్దంలో మీరు గెలుస్తారో నేను గెలుస్తానో తేలే వరకూ నేను వెనక్కు తగ్గను.

ఇదంతా నేనే!! ఓ అవలోకనం

నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో బ్లాగడమే తెలుసు, తెలుగులో బ్లాగుతారని లోకి వచ్చిన తరువాత తెలిసింది.

మొట్ట మొదటి సారిగా 2008వ సంవత్సరంలో మార్చి నెలలో 12వ తారీఖున “ఉబుసు పోక” బ్లాగాను. అలా సాగిన నా బ్లాగు ప్రహసనం మూడేళ్ళ తరువాత ఈ పుటతో నూట యాభైయొకటవ పుటకు చేరుకుంది. అలా కొంత కాలం అయ్యిన తరువాత, ఈ ఉబుసు పోక బ్లాగడాన్ని ఉత్తి హాస్యాస్పదమైన లేదా అంతగా ఆలోచించడానికి అవసరం లేని విషయాలకు మాత్రమే పరిమితం చేసి, కొంచం ఆలోచించడానికి అవసరమైన విషయాలను భవదీయుడు అనే బ్లాగులో వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఇలా భవదీయుడు బ్లాగు మే నెల ఐదో తారీఖున మొదలైంది. భవదీయుడు బ్లాగులో ఓ వంద పోస్టులు వరకూ పడ్డాయ్యన్నమాట. నిజంగా చెప్పాలంటే భవదీయుడు బ్లాగు నూట ఒక్క పోస్టులు నోచుకున్నా, ఒక పోస్టుని పలు కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. మొదటి గణనాంకాలు

  ఉబుసు పోక భవదీయుడు
వ్రాసిన పోస్టుల సంఖ్య 150 100
మొత్తం స్పందనలు 501 580
పోస్టుకి ఎక్కువ స్పందనల 22 58
పోస్టుకి అత్యధిక హిట్స్ 1502 886
ఏ నెలలో అత్యధిక హిట్స్ 2010 అక్టోబర్ 2010 ఆగస్ట్
అత్యల్ప హిట్స్ 2011 మార్చ్ 2011 మార్చ్
ఇంతవరకూ ఎన్ని హిట్స్ 20151 18661

ఇప్పుడు విడివిడిగా ఒక్కో బ్లాగుగురించి పరిశీలిస్తే.. వివిధ దేశాలనుంచి ఎన్ని విజిట్స్ వచ్చాయి, ఒక్కో దేశాన్నించి ఎన్ని అనే లెక్కలో ప్రధమ పది దేశాలను లెక్క వేస్తే ఈ క్రింది విధంగా లెక్క తేలింది.

దేశాల వారిగా పుటల సందర్శన ఉబుసు పోక భవదీయుడు
భారతదేశం 12556 8031
అమెరికా 4607 7287
సింగపూర్ 483 561
యునైటెడ్ కింగుడం 425 478
యునైటెడ్ ఎమిరేట్స్ 222 137
కెనడా 63 171
చెక్ రిపబ్లిక్   148
ఫ్రాన్స్   134
అస్ట్రేలియా 70 105
నెదర్లాండ్స్   105
జపాన్ 62  
ఓమన్ 56  

ఇప్పుడు ప్రస్తావించ బోయే గణనాంకాలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే, ఎక్కువమంది ఏ ఏ విహారిణులు వాడారు అన్న ఆలోచన వచ్చిన తరువాత గణనాంకాలు చూస్తే, నాకు ఎంతో ప్రీతి ప్రాయమైన మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత స్థానం మొజిల్లా వారి ఫైర్ ఫాక్స్. అంతే కాకుండా దాదాపుగా నేను ఎన్నడూ వినని విహారిణుల గురించి కూడా నాకు తెలిసింది.

విహరణి గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8546 7528
ఫైర్ ఫాక్స్ 7053 7387
క్రోం 3774 2871
సఫారి 273 410
ఒపెరా 156 92
క్రోం ఫ్రేం 93 71
ఒన్ రొయిట్ (OneRiot) 30 54
సింపుల్ పై (SimplePie) 18 19
pythumbnail.py 12  
PBSTB 11  
జావా   18
సెర్చ్ టూల్ బార్   17

విచ్చేసిన అతిధులు వాడిన ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఒక్కసారి అవలోకిస్తే ఎక్కువ శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారని తెలియడం ఆశ్చర్యం కాదు కానీ, విచ్చేసే వారు వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టంస్ వాడటమే కాకుండా, అధునాతన మైన సాధనాలైన మొబైల్ ఉపకరణాల ద్వారా కూడా విచ్చేస్తున్నారన్న విషయం నమ్మబుద్ది కాలేదు.

ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
విండోస్ 19216 16502
మాకింతోష్ 305 1141
మిగతా యునిక్స్ 367 386
లినిక్స్ 136 324
ఐఫోన్ 62 120
ఐపాడ్ 55 39
ఇపోడ్   10
విండోస్ NT 6.1   3
నోకియా 6 1
సామ్ సంగ్   1
LG 11  
FreeBSD 2  

నా ఈ బ్లాగులు ఏ ఏ అగ్రిగేటర్ల ద్వారా వీక్షించ బడుతున్నాయి అన్న ఆలోచనలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భవదీయుడు బ్లాగుని తెలుగు బ్లాగర్స్ లోను అలాగే ఒన్ ఇండియా వారి బ్లాగ్స్ యందు కలపలేదని. వీలు చూసుకుని వాటికు కూడా కలుపుతాను.

దారి చూపిన URLs స్థానం ఉబుసు పోక భవదీయుడు
కూడలి 1 1
మాలిక 2 2
గూగుల్ పోల్స్   3
హారం 4 4
జల్లెడ 3 5
తెలుగు బ్లాగర్స్ 5  
ఒన్ ఇండియా / దట్స్ తెలుగు 6  

ఈ మూడేళ్ళను సంవత్సరం ప్రకారం చూస్తే నాలుగు సంవత్సరాలను లెక్కలోకి తీసుకుని ఎన్నెన్ని పోస్టులు వ్రాసాను అని ఆలోచిస్తే కొంచం వైవిధ్యం కనబడుతోంది.

సంవత్సరం ఉబుసు పోక భవదీయుడు
2008 64 19
2009 30 33
2010 36 30
2011 19 18

ముగించే ముందు ఓ విషయం నాకు ఆశ్చర్య పఱచింది. భవదీయుడు బ్లాగులో అమెరికాపై వ్రాసిన మూడు పోస్టులు టాప్ పదింటిలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకుంటే, ఉబుసు పోని బ్లాగులో సినిమా పాటల రివ్యూలు మొదటి స్థానాలు ఆక్రమించుకున్నాయి. ఇంకా విశ్లేషించ వచ్చు కానీ కొంచం ఎక్కువ విశ్లేషించుకుంటున్నానేమో అనిపిస్తూ విరమించుకుంటున్నాను. నేనె ఇంతగా డప్పు కొట్టుకుంటే నాకన్నా ఎక్కువగా వ్రాసేవారు ఎంత కొట్టుకోవాలో అన్న విషయం బుర్రలో దూరి బండ బూతులు తిడుతోంది.

యెడ్యూరప్ప నాకు నచ్చలేదు

నిన్నగాక మొన్న ఏదో చిత్రం జరుగుతోంది కదా అంటూ ఓ పుట వ్రాసుకుంటే, ఇంతలో ఆ కధలోని నాయకుడు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ధైర్యంగా ఈయన ఎవ్వరి మాట వినడు, వీడు సీతయకి తాతయ్య అని నేను చెప్పుకుంటుంటే, మధ్యలో ఈ పితలాటకం ఏంటంట? దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనిపై సిబిఐ ఇంక్వైరీ వెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని యడ్యూరప్పగారికి రాసి ఇచ్చేయ్యాలని వచ్చే ఎన్నికలలో ఎవ్వరూ పోటీ చెయ్యకూడదని నేను బాహాటంగా పిలుపు నిస్తున్నాను. కాబట్టి యడ్యూరప్ప విధేయులారా, అందరూ రండి. సమిష్టిగా ముందుకు అడుగేద్దాం. తిరిగి ముఖ్యమంత్రి పదవిని మన యడ్యూరప్పగారికి అప్పగిద్దాం. ఇలా ముందుకు వచ్చిన అందరికీ ఓక్కో ఖనిజ గనిని ఓ పదేళ్ళ పాటు తవ్వుకోవడానికి అనుమతి ఇప్పిస్తాం.

ఖనిజ గని తవ్వితే రాళ్ళొస్తే మాకు మణులు మాణిఖ్యాలు వస్తే మీకు. దీనిపై ఎవ్వరైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తే వాళ్ళు రోడ్డుపై ఎలా తిరుగుతారో చూస్తా. వాళ్ళనే కాదు వాళ్ళకు తోడుగా నిలచిన వారందరినీ తుత్తునీయులుగా బాది తలా దిక్కుకి వేసేస్తా.

అలాగే దీనికి తోడుగా, లేదు కాదు యడ్యూరప్పకు వెన్నుపోటు పొడవాల్సిందే అని ప్రపంచం అంతా ఒక్కటైతే, వచ్చే ముఖ్యమంత్రి ఎవ్వరో మనమే చెప్పాలి. అలా కాని పక్షంలో మనం ఊరుకోం అన్నమాట. కాదు కూడదంటే, మఱోసారి అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టమనండి. ఎవ్వరొద్దన్నారు. ఇలాంటి అవిశ్వాసాన్ని నెలకొకసారి పెట్టమనండి. మేమేదన్నా అభ్యంతరం పెడితే అప్పుడు చెప్పండి. మొన్న ఆ రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించుకుంటే, లాలూచీ పడి ఆయననే ఉపసంహరించేటట్టు చేసిన ఘనత మా ఒక్క రాష్ట్రానికే చెందుతుంది. కాబట్టి అన్నివిధాలుగా యడ్యూరప్పనే పునః ప్రవేశం చేయించాలి.

అలా చేసేంత వరకూ, నా ఉద్దేశ్యం ఏమిటంటే, అలా చేయించేత వరకూ యెడ్యూరప్పగారు నాకు నచ్చరు.

 
Clicky Web Analytics