అర్దం, పరమార్దం - అపార్దం

కొత్తపాళీగారు ఈమద్య, మీ జీవిత పరమార్దమేమిటని సూటిగా ముక్కు పగిలేటట్టు ఒక్కటిచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయాల్ని పొందుపరిచే ముందుగా, ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

  • రాకేశ్వరరావుగారెమో.. బ్రతుకు పోరాటంలో గెలిచి, వంశాభివృద్ది చేసుకోవడమన్నారు
  • రమణిగారేమో.. మనసులోనిమాటని చల్లగా, మెల్లగా.. బ్రతికినంతకాలం ఆనందంగా జీవించేయగలగడం అన్నారు
  • నెటిజన్‍గారెమో.. తన అర్దభాగం దురమయినప్పుడు అంటూ ఎదో చెప్పారు.. నేనేమో తెలుగు వాడినాయే.. మనదా అంత అంత మాత్రం ఆంగ్ల పరిఙ్ఞానమాయే.. ఎదో అర్దం అయ్యి అవ్వనట్లుంటే.. ఎందుకయినా మంచిదని తలకెక్కించుకోలేదు.
  • దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారేమో విశాఖతీరాన కూర్చుని, ఏమి తెలియదంటూ తెలుకోవాలన్నారు. అంతేగాక, తనను తాను తగ్గించుకుంటూ, ఎదుటివారిలో మనల్ని చూసుకోవడమేకాక, కొంచం .. మరికొంచం.. ఇంకొంచం.. అనుకుంటూ మంచితనాన్ని పెంచుకోవడమే మన అందరి పరమావిధి అంటూ ముగించారు.
  • చావా కిరణ్ గారెమో.. ఇప్పుడంత అవసరమా అంటూ చురకేసారు
  • అప్పిచ్చువాడు.. అదేనండీ.. వైద్యుడు .. డా:రాములుంగారు.. (అయ్యా!! అన్యధా భావించకండి) ఇచ్చిపుచ్చుకోవడంలోనే అంతా ఉందన్నారు
  • సాలభజింకలు పేరుతో బ్లాగ్ చేసే పప్పు నాగరాజుగారేమో.. జీవితమంతా ఒక అనంతమయిన కార్పెట్ (తెలుగులో ఏమంటారో తెలియ లేదు..) లాంటిది, అది విప్పుతూ పోవడం అనేది ఒక వ్యర్ద ప్రయాస అనడమేకాక.. జీవిత పరమార్దం తెలియజేయడమంటే.. అసాద్యాయానికి కొంచం అటూ.. ఇటూ.. గా అంతేనన్నారు.
  • నాగ మురళిగారేమో.. తన గత స్మృతులు తలచుకుంటూ.. జీవితం అంటే ఒక గొప్ప అద్బుతం అంటూ.. దాని పరమార్దమేమిటో దాటవేశేశారు.
  • గార్లపాటి ప్రవీణ్‍గారు, దాదాపు సంవత్సరం క్రిందట తనకూ ఇట్లాంటి ఆలోచన వచ్చిందనీ.. ఆకాలంలో తాను ప్రచురించిన పుటనే, తన ఆత్మ శోధించే ప్రశ్నగా పేర్కొన్నారు. దానికి ఎందరో మహానుభావులు తదనుగుణంగా స్పందించారు. ఆ పుట ఆధారంగా.. ఆనాటికి, ప్రవీణ్‍గారి చిట్టాలో వారి పెండ్లి (ఆలోచన, క్షమించాలి..) లక్ష్యం లేదన్నట్లు తెలియజేసారు.. ప్రస్తుతానికి ఓ ఇంటివాడై అంతేకాకుండా సతీసమేతంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం
  • బ్లాగాడించేస్తా నంటున్న రవిగారేమో.. ఇలాంటి ఆలోచనలు తనకెప్పుడొచ్చినా, జిడ్డుకృష్ణ మూర్తిగారి రచనలు చదివేస్తానంటూ.. ఏది ఏమైనా సాధారణంగా గడపడమే ఉత్తమం అన్నారు.
  • వికటకవిగా ప్రచురించే శ్రీనివాసు గారేమో తనకూ అప్పుడప్పుడు ఇలాంటి స్థితే వస్తుందనీ.. అందులో పెద్దగా పట్టించుకోవడానికి ఏమిలేదంటూనే.. ఎవ్వరో మహానుభావుడన్నట్లు.. పరోపకార్ధం మిదం శరీరం అని స్పందించారు.
  • ఓనమాలుగా ప్రచురించే లలితగారు.. జీవిత పరమార్దం జీవించడమే తప్ప మరొకటి కాదన్నారు.
  • చెరశాల రేణుకా ప్రసాద్ గారేమో మొదటగా స్పందించిన రాకేశ్వరవుగారితో ఏకీభవిస్తూనే.. తన అంతరంగంలోని మాటని, నలుగురన్నట్లుగా.., నిస్వార్ధ ప్రేమ + సుఖాన్ని (మాత్రమే) పంచుకోవడం + వగైరా.. వగైరాగా తెలియజేసారు.
  • రె లైటనింగ్ గా ప్రచురిస్తున్న కిరణ్‍కి.. అస్సలు జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయితే.. దాని పరమార్దం మరో చిక్కు వీడని.. లేదా చిక్కు తియ్యలేని మరో ప్రశ్న కాబట్టి.. వేటి గురించి ఆలోచించుకుండా.. జీవితమే ఒక ఆట అనుకుంటూ ఆడేయ్యంటున్నారు.
  • గిరీష్ గారేమో కొంచం వేదాంతంగా.. ఎటువంటి ఆశలు / కోరికలు లేకుండా జీవించేయ్యడమే ఈ జీవిత పరమార్థం మంటూ .. నదులను జలాసాయాలను ఉదహరిస్తూ ఒక పుటని ప్రచురించారు
  • శ్రీనివాస్ గారికేమో జీవితాశయానికి మరియు జీవిత పరమార్థానికి తేడా అంతగా లేదంటూనే, మన ప్రమేయం లేనిది అంతేకాక తప్పకుండా ఉండి తీరాల్సినదే జీవిత పరమార్ధమని స్పందిచారు
  • గార్ల నవీన్ గారికి అనుకోకుండా గత శ్మృతులు గుర్తుకొచ్చి, ఆనాటి నుంచి తానూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరితపిస్తున్నానంటూ.. అందరిలోనూ మంచే చూస్తూ జీవించేస్తే అంతా ఆనందమయమవుతుందంటున్నారు.
  • దైవానిక గారేమో సంతృప్తిగాఅ జీవించడమే జీవితపరమార్ధం అంటున్నారు
  • సుజాతగారేమో తన మనసులోని మాటను సున్నితంగా, పరోక్షంగా... పరోపకారానికే ఓటేశెసారు

హమ్మయ్య..!! ఇప్పటికి రెండు రోజులుగా చేసిన ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఇక ఇప్పుడు నా వంతు.

ఒక రకంగా నేను చావా కిరణ్ గారితో ఏకీభవిస్తాను. మనకిప్పుడు ఈ విషయం అవసరమా..?!!#$%^&*.. ఎదో కడుపు నిండుగా.. ఇంటి పట్టున తిన్నగా.. ఉధ్యోగ వేళలలో చల్లగా బ్రతికేస్తున్న మనకు ఈ ఆలోచన అవసరమా??? ఈ విషయానికి సమాధానం వెతికేముందు, అస్సలు ఈ ప్రశ్న మొలకెత్తడానికు గల కారణాలు సోధిద్దాం

మొదటిది : ఇట్లాంటి ఆలోచనలు, పని లేని వేళలలో మొలకెత్తుతాయి.. ఆంగ్లంలో చెప్పినట్లు.. Idle man's brain is devil's workshop. ఎదో పనిలో పడ్డామనుకోండి, ఇలాంటి విషయాల వైపు అస్సలు దృష్టి సారించము.

రెండవది : పొట్ట కూటి కోసం రోజంతా కష్ట పడే కూలీలు ఇలాంటివి ఆలోచించరు, ఎందుకంటే.. పగలంతా పనిచేసిన మీదట, రెండు సారా చుక్కలు గొంతులోకి దిగిన తరువాత ఒళ్ళు నెప్పులు కాస్తా మత్తులో లెక్కచెయ్యరు. తదుపరి, కడుపు నిండా కలో.. గంజో.. కంటి నిండా నిద్ర.. ఇలా పనిచేసుకుంటూ, బ్రతకడానికే సమయం లేనివాడు ఇలాంటి ఆలోచనలు చెయ్యడు. ఇలాంటి ఆలోచనలు... "నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. " అంటూ పాడుకునే మధ్య తరగతి వాళ్ళకు తప్ప మరింకెవరికీ రావని మనం గుర్తించాలి.

మూడవది : ఆత్మావలోకనం చేసుకునే చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని అనిపిస్తుందనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.. ఇలాంటి వారు పేద, మధ్య , ధనికులే కానక్కరలేదు. స్వయం ప్రత్తిపత్తి కలిగి, కరిగి పోయే కాలాన్ని ఏవిధంగా వినియోగించు కోవాలనే తాపత్రయం కలిగిన వాళందరూ ఈ వ్యాధిఘ్రస్తులే..

ఈ ప్రశ్న సమాధానికోస్తే.. ఏనాడో, ఒక మహానుభావుడన్నట్లు.. మానవసేవయే మాధవ సేవగా భావించుకుంటూ.. పరోపకారం మిదం శరీరం అని భావించడమే కాకుండా, ఉన్నంతలో (వీలు) కలిగి నంత పంచుకుంటూ పోవడమే అని తెలుసు కోగలరు. ఇక్కడ మరొక విషయం తనకు మాలినది ధర్మం పనికిరాదని కూడా మర్చిపోరాదు.

ఇంతే సంగతులు..

 
Clicky Web Analytics