అపోలో ఆసుపత్రి – నా అనుభవం : Part 1

ఎంత ఎక్కువగా వ్రాస్తే అంత ఎక్కువగా నా వ్రాసే స్కిల్స్ మెరుగు పడతాయి అలాగే నా భావ వ్యక్తీకరణ శుద్ది అవుతుంది అని ఆలోచించి అపోలో ఆసుపత్రిలో నా అనుభావాలను ఎంత విపులంగా వీలైతే అంత విపులంగా వ్రాద్దాం అని చేసే ఈ ప్రయత్నం మీకు బోర్ అనిపించనంత వరకూ చదివి స్పందించండి.

నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వాళ్ళు ఉద్యోగులందరికీ సంవత్సరంలో ఉచితంగా ఓ సారి హెల్త్ చెకప్ చేయిస్తారు. అందులో భాగంగా నేను చేయించుకుందాం అని మా మేనేజెర్ని అడిగితే, శనివారం వద్దు చాలా మంది ఉంటారు కాబట్టి ఏ ఆది వారం నాడో లేదా రెగ్యులర్ రోజో తీసుకో అని సలహా ఇచ్చి అందుకు కావాల్సిన అన్ని అనుమతులు ఇప్పించారు. కాగితాలవి అందినాయి కదా అని ఆదివారం అయితే ఎక్కువమంది జనాలు ఉండరని సలహా ఇవ్వడం వల్ల క్రిందటి భుదవారం నాడు, అంటే 29th Sep నాడు ముందుగా అప్పాయింట్ మెంట్ తీసుకుందాం అని వారి హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి వివరాలు అడిగపోతే, వాడు రివర్సులో నా వివరాలు తీసుకుని అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేసేసాను వచ్చేయ్యండి అని అన్నాడు.

ఇంతకీ ఎలా రావాలి, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అని అడిగితే, ఏమీ అక్కర్లేదు సార్.. కాకపోతే ముందురోజు సాయంత్రం ఎనిమిది లోపుగా భోజనం చేసేస్తే బాగుంటుంది అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇక్కడ చావు కబురు అని ఎందుకు అన్నాను అంటె, ప్రతీ నాలుగు గంటలకు మనం ఏదో ఒకటి తినాలి అని నా అభిప్రాయం. నాలుగు గంటలు కాకపోయినా అధిక పక్షం ప్రతీ ఆరు గంటలకు ఏదో ఒకటి కడుపులో పడాలి అని అందరికీ చెబుతూ ఉంటాను, అలాంటిది నేను పన్నిండు గంటలపాటు ఏమీ తినకుండా ఉండటమా.. అన్న సంగ్దిధంలో, ఆరోగ్యానికి సంబందించినది కదా అని సరే అన్నాను. అలాగే నిన్న రాత్రి ఎనిమిది కల్లా నూడిల్స్ తినేసి ఇవ్వాల్టి ఉదయానికై ఎదురు చూస్తూ ఎప్పుడు నిద్రపోయ్యానో నాకే తెలియదు.

ఆఖరికి ఈ రోజు రానే వచ్చింది. ఉదయం ఆరుగంటలకల్లా నిద్ర లేచి, పేపర్ వాడు రాకపోయినందున చేతికి చిక్కిన పుస్తకం పట్టుకుని కాలకృత్యాలు కానిచ్చాను. వెంటనే బయటకు వెళ్ళి భార్యకు బ్రేక్ ఫాస్ట్ తెచ్చి పెట్టి ఏడున్నరకల్లా ఇంటినుంచి బయట పడ్డాను. చెవిలో ఐపాడ్ పాతపాటలను శ్రావ్యంగా వినిపిస్తూ ఉండగా ఉదయభానుడు లేలేత కిరణాలను మబ్బుల మధ్యనుంచి ప్రసరిస్తూ ఉంటే, ఆ చల్లగాలిని నులివెచ్చని ఎండని పాత పాటలను ఆస్వాదిస్తూ జూబ్లీహిల్స్ మీదుగా పోతూ ఉంటే అక్కడ నాకు కొన్ని దృశ్యాలు నాలో ఓ భావనను వాక్యరూపాన్నించ్చింది. అదేంటంటె, ఉదయం ఏడుగంటలకు మునుపే ప్రపంచంలో చాలా మంది వారి వారి పనులను ముగించుకుని మరో పనికై వెళ్ళుతుంటే, నేను మాత్రం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏమి పట్టనట్టు కాలకృత్యాలు పూజాది కార్యక్రమాలతో గడిపేస్తున్నానే, ఇదేనా నా కర్తవ్యం అనే ప్రశ్న ఉదయించింది. అలా ఆలోచనలో డ్రైవ్ చేసున్న నాకు మార్నింగ్ వాక్ చేయ్యడం కోసం ఎక్కడి నుంచో చాలామంది ధనిక వర్గం కార్లలో జూబ్లిహిల్స్ లోని వాకింగ్ పార్కలకు రావటం కనబడింది. అక్కడ అలా వాకింగ్ కోసం వచ్చే వారికోసం ప్రకృతి పరమైన జ్యూస్ అంటూ పొట్టపోసుకునే వాళ్ళు.. వాళ్ళని అదిలిస్తూ పోలీసు వాళ్ళు.. వాళ్ళకు ప్రక్కగా ప్రేమికులు, స్నేహితులు, ముస్సలాళ్ళు, స్టైల్ గా తయ్యారైన ఆడంగులు, హోదాని చూపించుకునే ధనికులు.. చాలా మంది నా కంట పడ్డారు. అదంతా ఓ ప్రపంచం అనిపించింది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అచ్చంగా పది నిమిషాలలో అపోలో చేరుకున్నాను. ఇదిగో ఇక్కడ మొదలైంది నా కష్టాల ప్రయాణం.

మొదటి అవరోధం: పార్కింగ్.. టూ వీలర్ పార్కింగ్ ఆస్పటల్ ప్రాంగణానికి కొద్దిగా దూరంలో కట్టారు. మంచి పనే, కాకపోతే నాకు ఇబ్బంది అయ్యింది. అయినా ఫరవాలేదులే, కాస్తంత నడిస్తే నేనేమి కరిగి పోను కదా అని సమర్దించుకుని పార్కింగ్ చేసి వద్దాం అనుకునేంతలో పార్కింగ్ వద్ద ఉన్న వాచ్ మెన్ మరో బాంబ్ వేసాడు. సారు బిల్లు ఇచ్చే మనిషి ఇప్పుడే రాడు, చాలా సేపు అవుతుంది అప్పటిదాకా బయట పెట్టుకోండి అని. పదినిమిషాల పాటు ఏదో బ్రతిమిలాడి వాడిచేత అవును అనిపించేసరికి నాలోని ఉత్సాహం నీరు గారిపోయింది.

రెండవ అవరోధం: స్వతహాగా పెద్ద ఆసుపత్రి అవటం వల్ల అందులోను ఉదయం వేళ అవటం వల్ల, ఎక్కడికి వెళాలో తెలియని నాలాంటి వారికి సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. మరో పది నిమిషాలలో ఎలాగో ఒకలా అడపా దడపా కనబడే ఉద్యోగులను అడిగి మాస్టర్ చెకప్ చేసే చోటికి చేరుకున్నాను. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరే.. ఉన్నదల్లా అక్కడ ఫ్లోర్ తుడిచే పని మనుష్యులు తప్ప. అప్పటికి సమయం ఎనిమిది అయ్యింది. వస్తూ వస్తూ చంద్రలత గారి పుస్తకాన్ని నాతో తెచ్చుకున్నాను.  చెవిలో పాటలు మృదు మాధుర్యంగా వినబడుతూ ఉండగా ఆసుపత్రి సిబ్బందికై ఎదురు చూస్తూ ని తీసాను.

ఓ అరగంట అయ్యిన తరువాత ఓ అందమైన రిసెప్సనిస్టు చేరుకుంది. చూడబోతే అమాయకంగా లేతప్రాయంలో ఉన్నటువంటి ముగ్దమనోహరమైనటువంటి వదనం. అప్పటిదాకా నాతో బాటు అసహనంగా అక్కడ ఎదురు చూస్తూ  కూర్చున్న వారంతా ఒక్కసారి ఆ అమ్మాయిని చుట్టు ముట్టారు. అక్కడ పరిస్తితి ఎలా ఉందంటే, బెల్లం చుట్టూ ఈగల్లా.. చూడబోతే చిన్నపిల్లలా ఉంది ఇంత మందిని ఎలా హాండిల్ చేస్తుందో అని ఒక్కసారి భయపడి, అందరూ అయ్యిన తరువాత మెల్లిగా అడుగుదాం అని నేను వెనుకంజ వేసి ఆ అమ్మాయిని గమనించడం ప్రారంభించాను. ఓ ప్రక్క తన పనికి అవసరమైయ్యే సామాగ్రిని సద్దుకుంటూ ఆ అమ్మాయి నలుగురికి సమాధానాలు ఇస్తూ ఉంటే, రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి. ఒకటి అభిమన్యుడు. లేలేత ప్రాయంలో యుధభూమిలోకి వెళ్ళి శతృసైన్యాన్ని చీల్చిచెండాడిన వైనం మొదటిదైతే, రెండవది ఆ అమ్మాయి టైమ్లీ సెన్స్ మరియు పీపుల్ మేనేజింగ్ టెక్నీక్స్ నాకు చాణుక్యుని గుర్తుకు తెచ్చాయి. అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం ఇస్తూ అందర్నీ కవర్ చేసి రెగ్యులర్ గా చేసే పనులలో పడింది. హమ్మయ్య ఇక నా వంతు అని వెళ్ళి నా విషయం తెలియజేసాను. మీకు అప్పాయింట్ మెంట్ ఉందా అన్న ప్రశ్నకు అవును నాపేరు చక్రవర్తి అంటున్నంతలో కంటి చివర్నుంచి దగ్గర్లో ఉన్న పుస్తకంలో నాపేరుకై చూసి, సారీ సార్ మీ పేరు మా అప్పాయింట్ రిజిస్టర్ లో లేదు అందుకని మీరు వెయిట్ చేయ్యాలి. చాలా సేపు అవుతుంది అని మరో బాంబు పేల్చింది. ఇక్కడ ఆ అమ్మాయి చాలా అనేపదాన్ని పలికిన వైనం గమనించతగ్గది. చాలా అని పలుకుతున్నప్పుడు ఆ పదంలోనే తెలిపింది ఇదేదో కొంపముంచే లాగుందని నన్ను నేను సముదాయించుకున్నాను. అదిగో అప్పటికి సమయం తొమ్మిది. అప్పటికి నేను భోంచేసి పదమూడు గంటలైంది..

మరో పుటతో మీ ముందుకు మరోసారి.. అప్పటి దాకా నా ఈ ప్రయత్నంపై మీ అభిప్రాయాన్ని తెలియ జేయ మనవి. మీ స్పందనలు నా  రచనా శైలిపై అవ్వవచ్చు, అలోచనా విధానం పై అయినా అవ్వవచ్చు, లేదా నా ఆలోచనకు వ్రాతరూపకంలో చేర్చే క్రమంలో ఎంచుకునే పద ప్రయోగాలపైనా అవ్వవచ్చు, లేదా తెలుగు భాషపై నాకు ఉన్న పట్టుపై అయినా అవ్వవచ్చు. అవి ఇవి కాక మరింకేమైనా అవ్వవచ్చు. ఏదైనా స్వాగిస్తున్నాను. మీరు మాత్రం వెనకాడవద్దని మనవి..

 
Clicky Web Analytics