Showing posts with label వ్యాపారం. Show all posts
Showing posts with label వ్యాపారం. Show all posts

నేను నా రాక్షసి - రివ్యూ

Nenu-Naa-Rakshasi-Movie-Wallpaper

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, నేను సినిమాలు అంత తొందరగా చూడను అలాగే చూడాలని అనుకోను. ఒకవేళ అనుకున్నానా, అంతే, కొంప కొలాస్ సినిమా డింకీ డిలాస్. అలాంటి కోవకే చెందుతుందీ సినిమా కూడా. అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా నేను చూడాలి అని అనుకోలేదు. ఇంతకు ముందు ఇచ్చిన బిల్డప్ అంతా తూచ్, ఉత్తిత్తినే. ఈ సినిమా హీరో గారిపై నాకు పెద్ద సదాభిప్రాయం లేదు. ఎందుకంటే, ఈ సినిమా ఆడీయో రిలీజ్ సమయంలో అనుకుంటా, ఈయన గారి గురించి మఱో హీరోగారు పెద్ద ఘన కార్యం చేసినట్లు స్టేట్‍మెంట్ ఇచ్చాడు.

హీరోగా చెయ్యడమంటే ఇన్వెస్టుమెంట్ లెని వ్యాపారమంట, ఈ రానాగారి అభిప్రాయంలో. ఎంతైనా మఱో నిర్మాత కొడుకు కదా. ఒక్కొసారి ఇలా వంశ పారంపర్యంగా వస్తున్న తరాన్ని చూస్తుంటే, అసహ్యం వేస్తుంది. అది ప్రస్తుత వీరో మన రానా గారైనా లేక అల్లూ వారసుడైనా లేక నంద మూరి వంశంలోని వారెవ్వరైనా. సినిమా అనేది చాలా మందికి ఒక ఆనందాన్నిచ్చే వ్యాపకం అయితే, ఇలాంటి బడా బాబులకు అది ఒక విలాస ప్రక్రియ. అయితే ఆ ఒడ్డు లేదా ఈ ఒడ్డు. సినిమా ఆడిందనుకోండి, అదిగో మావోడు బాగా చేసాడు అని చంకలు కొట్టుకుంటారు. లేదు, డింకీ కొట్టిందనుకోండి, ఛాత్.. ఆ దర్శకునికి సినిమా తీయ్యడం చేత కాలేదు అని నిదంలేసేయ్యడం. కాకా పట్టడం అనేది నరనరాల్లో జీర్ణించుకు పోతేనే ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారనేది చేదు నిజం. అందుకు సాక్షమే మన జూ.ఎన్టీయార్.

సరే సినిమా పై రివ్యీ వ్రాసే ప్రక్రియలో అదేదో వ్రాసేస్తున్నాను. ఇక ప్రస్తుత సినిమా విషయానికి వస్తే, కధా పరంగా చాలా మంచి సినిమా అలాగే బాగా వ్యాపార విలువలు వ్యక్తపరచ కలిగిన సినిమా. నాకు తెలిసి ఖచ్చితంగా లాభాలే వచ్చుంటాయి. కానీ, నా వరకూ నాకు ఇది ఓ చెత్త సినిమా అనిపించింది. డబ్బులు సంపాదించుకోవాలంటే, చాలా మార్గాలున్నాయి. చాలా సున్నితమైన భావాలను మానవతా దృక్పధంతో చూపించి జనాల మన్నలను పొందేలా సినిమాలు తీస్తే బాగుంటుంది కానీ ఇలా మాసశిక సంక్షోబంలో కొట్టు మిట్టాడే వారిని తీసుకుని దానికి మషాలా దట్టించి, వారి మనోభావాలతో వ్యాపారం చేసే విధానం నాకు వెగటు పుట్టించింది.

ఆత్మహత్య అనే మూల కధాంశంతో తనికెళ్ళ భరణి గారు, గ్రహణం అనే సినిమా తీసినట్టు నాకు గుర్తు. ఆ సినిమా వ్యాపార పరంగా వర్కౌట్ అయినట్లు లేదు. కానీ అది చాలా సున్నితమైన కధ. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు లాభాపేక్ష లేకుండా, జనాలకి ఎక్కుతుందా లేదా అని చూడకుండా, సున్నితత్వాన్ని సున్నితంగా చూపించే ప్రయత్నంలో వ్యాపార దృక్పధంగా భరణి గారు ఓడిపోయినా, సినిమా మాధ్యమాన్ని వ్యాపార పరంగా చూడకుండా ఓ మంచి విషయం వివరించే ప్రయత్నంలో వీరు మనఃసాక్షిగా వ్యవహరించి ఓ మానవత్వం కలిగి ఉన్న వ్యక్తిగా నా ఆలోచనలలో నిలచిపోయ్యారు. నాకు తెలిసి భరణిగారు పెద్ద ధన వంతులేం కారనుకుంటా, వ్యక్తిగతంగా నాకు వీరితో పరిచయం లేదు. కావున, ఏమీ వ్రాయలేను. కానీ వీరు చేసిన పాత్రల పరంగా కానీ వీరి నిరాడంబరత బట్టి గానీ వీరు పెద్దగా వెనకేసుకున్నది ఏమీ లేదని నా అభిప్రాయం. ఒక వేళ నా అభిప్రాయం తప్పవౌచ్చు. కానీ మన వీరో గారికేం వచ్చింది. వీళ్ళ నాన్న సంపాదించింది మూలుగుతోందిగా, వీరు సంపాదించి ఇంకా ఎంత వెనకేయ్యాలంట? అందునా ఇలాంటి సున్నితమైన వ్యవహారాన్ని కమర్షియల్ చేసి సంపాదించడం అనే ప్రక్రియ శెవాన్ని తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు జల్లుతారే వాటిని ఏరుకునేటట్లు ఉంది.

ఈ హీరో గారు ఇంతకు ముందు చేసిన సినిమాతో పోల్చుకుంటే, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా పరిశ్రమకి మఱో వారసుని తరంలో మంచి కాంపిటీషన్ ఇచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడెప్పుడో షట్టర్ ఐలాండి అనే సినిమా లోని హింసని ప్రేరేపించే జుగుప్సా కరమైన ఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇకపై వీరినుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. ఇంతకీ నచ్చిన మఱియు నచ్చని అంశాల విషయానికి వస్తే..

నచ్చిన అంశాలు..

  • దర్శకుని ప్రతిభ
  • స్క్రీన్ ప్లె
  • లొకేషన్స్ ప్రిఫరెన్స్ – ఎంచుకున్న విధానం
  • వెనిస్ నగరాన్ని చాలా ఎక్కువ సేపు చూపించడం
  • కటకటాల వెనకాల ఉన్న కొడుకుని విడిపించుకునే సీన్లో పోలీస్ ఆఫీసర్ ప్రవర్తన
  • ప్రతీ వ్యక్తి ఆత్మహత్య వెనకాల ఓ బలమైన కారణం ఉంటుంది అని చూపించడం
  • మన శరీరంలో ఆత్మహత్య నిరోధించే తత్వం ఉంటుంది అని తెలియ జెప్పే ప్రయత్నం

నచ్చని అంశాలు..

  • మొదటిగా, ఆత్మహత్య అనే అంశాన్ని వ్యాపారం చెయ్యడం
  • పిల్లని చంపేయ్యడం
  • ప్రతి నాయకుడు చంపే ప్రతీసారి అమ్మవారిని స్మరించడం
  • హింస పరంగా పైశాచిక ఆనందాన్ని చూపించడం
  • ముమ్మయిత్ ఖాన్ పాత్ర
  • డబ్బున్న వారు నిర్భయంగా ఎలాంటి అఘాయిత్యాలైనా చేసేయ్యండి అని ప్రేరేపించే విధానం

ఇంకా మరెన్నో.. కానీ, ఈ చిట్టాని ఇక్కడితో ఆపేస్తాను. ఆఖరిగా, సున్నిత మనస్కులు ఈ సినిమాని చూడవద్దని మనవి

గాయం 2 సినిమా మాతృక

జగపతి బాబు చాలా కాలం క్రిందట చేసిన సినిమా గాయం-2 సినిమా మొదటి సినిమా యొక్క సీక్వెల్ అని అనుకున్న వాళ్ళల్లో నేనూ ఉన్నాను. కానీ నిజం ఏమిటంటే, ఇది ఓ ఆంగ్ల సినిమా కాపీ అన్న విషయం, ఇవ్వాళ నాకు తెలిసింది. A History of Violence అనే ఆంగ్ల సినిమా నుంచి చాలా భాగం మక్కీకి మక్కీగా తీయ్యటం నాకు ఎందుకో మింగుడు పడలేదు. అందునా రామ్ గోపాల్ వర్మ వంటి వ్యక్తి పేరుతో ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఓ ఆంగ్ల మాతృక అనే చేదు నిజం నాకు గొంతులో పడ్డ వెలక్కాయ అయ్యింది. ఇది నాకు కొత్త విషయం, చాలా మందికి ఇది పాత విషయం అయ్యుండవచ్చు. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కాపీలు కొడతాడని నేననుకోలేదు.

ఉచితం అవకాశం

Deekshita

Myntra.com వారు వారి వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ కూపన్ విలువ 249/- రూపాయలు. దీనిని నేను ఓ మగ్ కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాను. అలాగే మనం కొనుక్కునే మగ్ ని మనం కస్టమైజ్ చేసుకునే అవకాశం మనకి ఉంది. నేను మా అన్నయ్య పిల్లల బొమ్మని అక్కడ వేయించుకుని ఆర్డర్ చేసాను. నాకు ఇంత వరకూ ఆ కప్ రాలేదు కానీ అలా ఆర్డర్ చేసుకున్న చాలా మంది మా ఆఫీస్ లో కలీగ్స్ కి మగ్స్ వచ్చాయి.

కాకపోతే ఇక్కడ ఓ చిన్న ట్రిక్ ఉంది. కప్పు మాత్రం ఉచితం, కాని దానిని మీకు చేరవేయ్యాలంటే, ఆ కప్పుకి అయ్యే దారి ఖర్చులక్రింద ఓ యాభై రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే షిప్పింగ్ చార్జ్ అన్నమాట. యాభై రూపాయలు నాకు పెద్ద ఖర్చుగా అనిపించలేదు. ఎందుకంటే, నిజ్జంగా నాకు ఆ కప్పు కనుక వస్తే, కప్పు ఖరీదే ఓ ఇరవై రూపాయలు ఉండవచ్చు అదీకాక దానిపైన చక్కగా మా అన్నయ్య పిల్లల బొమ్మలు ఉంటాయి కదా !! అది సెంటిమెంట్.. అలా ఓ చక్కని మగ్ యాభై రూపాయల విలువని మింగేసింది. మీరు ఓ ట్రై చేసి చూడండి.

అపోలో ఆసుపత్రి – నా అనుభవం : Part 1

ఎంత ఎక్కువగా వ్రాస్తే అంత ఎక్కువగా నా వ్రాసే స్కిల్స్ మెరుగు పడతాయి అలాగే నా భావ వ్యక్తీకరణ శుద్ది అవుతుంది అని ఆలోచించి అపోలో ఆసుపత్రిలో నా అనుభావాలను ఎంత విపులంగా వీలైతే అంత విపులంగా వ్రాద్దాం అని చేసే ఈ ప్రయత్నం మీకు బోర్ అనిపించనంత వరకూ చదివి స్పందించండి.

నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వాళ్ళు ఉద్యోగులందరికీ సంవత్సరంలో ఉచితంగా ఓ సారి హెల్త్ చెకప్ చేయిస్తారు. అందులో భాగంగా నేను చేయించుకుందాం అని మా మేనేజెర్ని అడిగితే, శనివారం వద్దు చాలా మంది ఉంటారు కాబట్టి ఏ ఆది వారం నాడో లేదా రెగ్యులర్ రోజో తీసుకో అని సలహా ఇచ్చి అందుకు కావాల్సిన అన్ని అనుమతులు ఇప్పించారు. కాగితాలవి అందినాయి కదా అని ఆదివారం అయితే ఎక్కువమంది జనాలు ఉండరని సలహా ఇవ్వడం వల్ల క్రిందటి భుదవారం నాడు, అంటే 29th Sep నాడు ముందుగా అప్పాయింట్ మెంట్ తీసుకుందాం అని వారి హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి వివరాలు అడిగపోతే, వాడు రివర్సులో నా వివరాలు తీసుకుని అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేసేసాను వచ్చేయ్యండి అని అన్నాడు.

ఇంతకీ ఎలా రావాలి, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అని అడిగితే, ఏమీ అక్కర్లేదు సార్.. కాకపోతే ముందురోజు సాయంత్రం ఎనిమిది లోపుగా భోజనం చేసేస్తే బాగుంటుంది అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇక్కడ చావు కబురు అని ఎందుకు అన్నాను అంటె, ప్రతీ నాలుగు గంటలకు మనం ఏదో ఒకటి తినాలి అని నా అభిప్రాయం. నాలుగు గంటలు కాకపోయినా అధిక పక్షం ప్రతీ ఆరు గంటలకు ఏదో ఒకటి కడుపులో పడాలి అని అందరికీ చెబుతూ ఉంటాను, అలాంటిది నేను పన్నిండు గంటలపాటు ఏమీ తినకుండా ఉండటమా.. అన్న సంగ్దిధంలో, ఆరోగ్యానికి సంబందించినది కదా అని సరే అన్నాను. అలాగే నిన్న రాత్రి ఎనిమిది కల్లా నూడిల్స్ తినేసి ఇవ్వాల్టి ఉదయానికై ఎదురు చూస్తూ ఎప్పుడు నిద్రపోయ్యానో నాకే తెలియదు.

ఆఖరికి ఈ రోజు రానే వచ్చింది. ఉదయం ఆరుగంటలకల్లా నిద్ర లేచి, పేపర్ వాడు రాకపోయినందున చేతికి చిక్కిన పుస్తకం పట్టుకుని కాలకృత్యాలు కానిచ్చాను. వెంటనే బయటకు వెళ్ళి భార్యకు బ్రేక్ ఫాస్ట్ తెచ్చి పెట్టి ఏడున్నరకల్లా ఇంటినుంచి బయట పడ్డాను. చెవిలో ఐపాడ్ పాతపాటలను శ్రావ్యంగా వినిపిస్తూ ఉండగా ఉదయభానుడు లేలేత కిరణాలను మబ్బుల మధ్యనుంచి ప్రసరిస్తూ ఉంటే, ఆ చల్లగాలిని నులివెచ్చని ఎండని పాత పాటలను ఆస్వాదిస్తూ జూబ్లీహిల్స్ మీదుగా పోతూ ఉంటే అక్కడ నాకు కొన్ని దృశ్యాలు నాలో ఓ భావనను వాక్యరూపాన్నించ్చింది. అదేంటంటె, ఉదయం ఏడుగంటలకు మునుపే ప్రపంచంలో చాలా మంది వారి వారి పనులను ముగించుకుని మరో పనికై వెళ్ళుతుంటే, నేను మాత్రం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏమి పట్టనట్టు కాలకృత్యాలు పూజాది కార్యక్రమాలతో గడిపేస్తున్నానే, ఇదేనా నా కర్తవ్యం అనే ప్రశ్న ఉదయించింది. అలా ఆలోచనలో డ్రైవ్ చేసున్న నాకు మార్నింగ్ వాక్ చేయ్యడం కోసం ఎక్కడి నుంచో చాలామంది ధనిక వర్గం కార్లలో జూబ్లిహిల్స్ లోని వాకింగ్ పార్కలకు రావటం కనబడింది. అక్కడ అలా వాకింగ్ కోసం వచ్చే వారికోసం ప్రకృతి పరమైన జ్యూస్ అంటూ పొట్టపోసుకునే వాళ్ళు.. వాళ్ళని అదిలిస్తూ పోలీసు వాళ్ళు.. వాళ్ళకు ప్రక్కగా ప్రేమికులు, స్నేహితులు, ముస్సలాళ్ళు, స్టైల్ గా తయ్యారైన ఆడంగులు, హోదాని చూపించుకునే ధనికులు.. చాలా మంది నా కంట పడ్డారు. అదంతా ఓ ప్రపంచం అనిపించింది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అచ్చంగా పది నిమిషాలలో అపోలో చేరుకున్నాను. ఇదిగో ఇక్కడ మొదలైంది నా కష్టాల ప్రయాణం.

మొదటి అవరోధం: పార్కింగ్.. టూ వీలర్ పార్కింగ్ ఆస్పటల్ ప్రాంగణానికి కొద్దిగా దూరంలో కట్టారు. మంచి పనే, కాకపోతే నాకు ఇబ్బంది అయ్యింది. అయినా ఫరవాలేదులే, కాస్తంత నడిస్తే నేనేమి కరిగి పోను కదా అని సమర్దించుకుని పార్కింగ్ చేసి వద్దాం అనుకునేంతలో పార్కింగ్ వద్ద ఉన్న వాచ్ మెన్ మరో బాంబ్ వేసాడు. సారు బిల్లు ఇచ్చే మనిషి ఇప్పుడే రాడు, చాలా సేపు అవుతుంది అప్పటిదాకా బయట పెట్టుకోండి అని. పదినిమిషాల పాటు ఏదో బ్రతిమిలాడి వాడిచేత అవును అనిపించేసరికి నాలోని ఉత్సాహం నీరు గారిపోయింది.

రెండవ అవరోధం: స్వతహాగా పెద్ద ఆసుపత్రి అవటం వల్ల అందులోను ఉదయం వేళ అవటం వల్ల, ఎక్కడికి వెళాలో తెలియని నాలాంటి వారికి సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. మరో పది నిమిషాలలో ఎలాగో ఒకలా అడపా దడపా కనబడే ఉద్యోగులను అడిగి మాస్టర్ చెకప్ చేసే చోటికి చేరుకున్నాను. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరే.. ఉన్నదల్లా అక్కడ ఫ్లోర్ తుడిచే పని మనుష్యులు తప్ప. అప్పటికి సమయం ఎనిమిది అయ్యింది. వస్తూ వస్తూ చంద్రలత గారి పుస్తకాన్ని నాతో తెచ్చుకున్నాను.  చెవిలో పాటలు మృదు మాధుర్యంగా వినబడుతూ ఉండగా ఆసుపత్రి సిబ్బందికై ఎదురు చూస్తూ ని తీసాను.

ఓ అరగంట అయ్యిన తరువాత ఓ అందమైన రిసెప్సనిస్టు చేరుకుంది. చూడబోతే అమాయకంగా లేతప్రాయంలో ఉన్నటువంటి ముగ్దమనోహరమైనటువంటి వదనం. అప్పటిదాకా నాతో బాటు అసహనంగా అక్కడ ఎదురు చూస్తూ  కూర్చున్న వారంతా ఒక్కసారి ఆ అమ్మాయిని చుట్టు ముట్టారు. అక్కడ పరిస్తితి ఎలా ఉందంటే, బెల్లం చుట్టూ ఈగల్లా.. చూడబోతే చిన్నపిల్లలా ఉంది ఇంత మందిని ఎలా హాండిల్ చేస్తుందో అని ఒక్కసారి భయపడి, అందరూ అయ్యిన తరువాత మెల్లిగా అడుగుదాం అని నేను వెనుకంజ వేసి ఆ అమ్మాయిని గమనించడం ప్రారంభించాను. ఓ ప్రక్క తన పనికి అవసరమైయ్యే సామాగ్రిని సద్దుకుంటూ ఆ అమ్మాయి నలుగురికి సమాధానాలు ఇస్తూ ఉంటే, రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి. ఒకటి అభిమన్యుడు. లేలేత ప్రాయంలో యుధభూమిలోకి వెళ్ళి శతృసైన్యాన్ని చీల్చిచెండాడిన వైనం మొదటిదైతే, రెండవది ఆ అమ్మాయి టైమ్లీ సెన్స్ మరియు పీపుల్ మేనేజింగ్ టెక్నీక్స్ నాకు చాణుక్యుని గుర్తుకు తెచ్చాయి. అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం ఇస్తూ అందర్నీ కవర్ చేసి రెగ్యులర్ గా చేసే పనులలో పడింది. హమ్మయ్య ఇక నా వంతు అని వెళ్ళి నా విషయం తెలియజేసాను. మీకు అప్పాయింట్ మెంట్ ఉందా అన్న ప్రశ్నకు అవును నాపేరు చక్రవర్తి అంటున్నంతలో కంటి చివర్నుంచి దగ్గర్లో ఉన్న పుస్తకంలో నాపేరుకై చూసి, సారీ సార్ మీ పేరు మా అప్పాయింట్ రిజిస్టర్ లో లేదు అందుకని మీరు వెయిట్ చేయ్యాలి. చాలా సేపు అవుతుంది అని మరో బాంబు పేల్చింది. ఇక్కడ ఆ అమ్మాయి చాలా అనేపదాన్ని పలికిన వైనం గమనించతగ్గది. చాలా అని పలుకుతున్నప్పుడు ఆ పదంలోనే తెలిపింది ఇదేదో కొంపముంచే లాగుందని నన్ను నేను సముదాయించుకున్నాను. అదిగో అప్పటికి సమయం తొమ్మిది. అప్పటికి నేను భోంచేసి పదమూడు గంటలైంది..

మరో పుటతో మీ ముందుకు మరోసారి.. అప్పటి దాకా నా ఈ ప్రయత్నంపై మీ అభిప్రాయాన్ని తెలియ జేయ మనవి. మీ స్పందనలు నా  రచనా శైలిపై అవ్వవచ్చు, అలోచనా విధానం పై అయినా అవ్వవచ్చు, లేదా నా ఆలోచనకు వ్రాతరూపకంలో చేర్చే క్రమంలో ఎంచుకునే పద ప్రయోగాలపైనా అవ్వవచ్చు, లేదా తెలుగు భాషపై నాకు ఉన్న పట్టుపై అయినా అవ్వవచ్చు. అవి ఇవి కాక మరింకేమైనా అవ్వవచ్చు. ఏదైనా స్వాగిస్తున్నాను. మీరు మాత్రం వెనకాడవద్దని మనవి..

వ్యాపార సలహా : NHPC పడిపోతోంది

 

ఈ మధ్యనే వచ్చిన కొన్ని IPOలలో చాలా తక్కువకు లిస్ట్ అయిన స్క్రిప్ట్ ఇది. పబ్లిక్ ఆఫర్ క్రింద ఈ స్క్రిప్ట్ విలువను 36/- రూపాయలుగా నిర్ణయించి ఇష్యూ చేసారు. ఆ తరువాత దీని విలువ 39/- రూపాయలు దాకా వెళి ఆ తరువాత క్షీణించ సాగింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మఱో ఉత్తర్వుని కూడా జారీ చేసింది. ఏమిటంటారా.. ఈ షేర్ నందు పెట్టుబడి పెట్టే వంతు శాతంలో పబ్లిక్ వాటాని మఱో పది శాతం పెంచుకునే హక్కుని ఈ యాజమాన్యానికి ఇచ్చింది. ఇదిగో అప్పుడు మొదలైంది అస్సలైన కధ.

ఎప్పుడైతే కొనుగోలు మొదలైందో అమ్మకాలు జోరుగా సాగడం, ఆ తరువాత హెచ్చు తగ్గులౌతూ ఇప్పుడు అతి తక్కువలో వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. ఈ పుట వ్రాసే నాటికి ఈ షేర్ ధర 30.10/- వద్ద ట్రేడ్ అవుతోంది. ఎందుకని నేను ఈ షేరుని రికమెండ్ చేస్తున్నానంటే, ముఖ్యంగా ఇది గవర్నమెంట్ యాజమాన్యం సహాయ సహకారాలతో నడుస్తున్న సంస్థ. రెండొవది, వీరు ఎన్నుకున్న ప్రోజక్టుల లొకేషన్స్. ఈ లొకేషన్స్ లలో నీరు చాలా బాగా ప్రవహిస్తోంది. ఈ షేర్ ఎక్కటికైనా సేఫే. కానీ ఇది దీర్ఘ కాలిక పెట్టుబడిగా మాత్రమే తలచుకోవాలి. ఏదో కొద్దిపాటి లాభాలకోసం అయితే మాత్రం ఓ ఆరు నెలలు ఆగితే సరిపోతుంది. దీర్ఘ కాలం ఉంచగలిగిన వాళ్ళకు ఇది కల్ప వృక్షమే. నేనైతే ఈ సంవత్సరానికి ఎంత సొమ్మైతే ఫిక్స్ ‍డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ సొమ్మునంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాను. కాబట్టి నేను దీర్ఘకాలిక లాభాలవాడిని అని అనుకోండి. వాళ్ళు క్రొత్తగా మఱో ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసారు. NHPC వివరాలు క్రొత్తగా ఈ లంకెలో చూడండి.

ఏది ఏమైనా.. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

వ్యాపార సలహా - ఇది ఒక సలహా మాత్రమే

 

ఈ మధ్య కొంత కాలంగా మొబైల్ ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ కనబడుతోంది. అలాంటి కాంపిటీషన్ వ్యాపార పరంగా మంచిదే. కొన్ని విలీనాలు, మరికొన్ని కొత్త బ్రాండ్స్ మార్కెట్ లో విరివిగా కనబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో నేను క్రితంలో లాభమార్జించిన ఓ షేర్ ఇప్పుడు చాలా నష్టాలలో ఉంది. ఇలాంటి సమయంలో మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

అది 2007వ సంవత్సరం జూన్ 21వ తారీఖు. అప్పట్లో మన షేర్ మార్కెట్ శర వేగంతో పరిగెడుతోంది. అలాంటి రోజున నేను HFCL Infotel Ltd., అనే కంపెని యొక్క షేర్లు ఓ రెండొందలు కొన్నాను. ఎంతకి అంటారా.. Rs.15.75/- ఆ తరువాత దానిని ఓ ఆరు నెలల తరువాత Rs.46.40/- వద్ద అమ్మేశాను. దీని వల్ల నాకు కలిగిన లాభం, Rs.6130/-. ఈ షేరు ఇప్పుడు చాలా తక్కువలో కాక పోయినా తక్కువలోనే అమ్ముడవుతోంది. BSE లో ఈ షేరుని కొనాలంటే ఈ లంకె ని చూడండి

ప్రస్తుతం ఈ షేరు 6 రూపాయిల 36పైసలు దగ్గర వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. కావున వీలైనన్ని కొని, లాంగ్ టరమ్ కోసం దాచుకున్నారనుకోండి, బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువే లాభం పొందే అవకాసం ఉంది. ఇక్కడ నా ఉద్దేశ్యంలో లాంగ్ టరమ్ అంటే దాదాపు ఓ ఆరు నెలలు అన్నమాట. అందువల్లన ఓ ఆరు నెలలు డబ్బులు మనవి కాదు అనుకున్నట్లైతే ఈ షేర్ యందు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

ఆఖరుగా .. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను

వ్యాపార సలహా - జై కార్పొరేషన్ లిమిటెడ్

ఇవ్వాళ మరో కంపెనీ చాలా తక్కువ వెలకి వ్యాపారం చెయ్యబడింది. అదే జై కార్పరోషన్ లిమిటడ్. దీని ప్రాధమిక షేర్ విలివ ఒక రూపాయి మాత్రమే. కానీ ఈ షేర్ విలువ 64.35 దగ్గర చేతులు మారుతోంది. గత సంవత్సర కాలంలో ఈ షేర్ ఇంత కంటే తక్కువ ఖరిదులో ఎప్పుడూ అమ్మకం జరగ లేదు. అధికంగా 1259/- అమ్ముడు పోయిందంటే నమ్ముతారా!!! కానీ ఇది నిజం.

మరి నా సలహాకి వస్తే, వచ్చే వారంలో ఈ షేర్ ధర మరింత తగ్గే సూచన కనబడుతోంది. కాబట్టి కొంచం తెలివిగా ఉండి 40/- రూపాయిలకి దగ్గరగా దొరికితే.. ఓ వంద కొని ఉంచు కోండి. స్వల్ప వ్యవధి కన్నా దీర్ఘ కాలంలో మీకు తప్పని సరిగా లాబాలని చేకూర్చే అవకాశాలు ఈ షేర్‍కి ఉంది.

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

వ్యాపార సలహా - రోల్టా ఇండియా

ఇవ్వాళ మొదటి సారిగా నేను నా పని మానుకుని మరీ ఈ షేరుకై ఎదురు చూసాను. ఈ రోజు మద్య్హాన్నం దాదాఔ ఒంటి గంట దరి దాపులలో ఈ షేరు నలభై నాలుగు(44/-) రూపాయల దగ్గర వ్యాపారం జరిగింది. స్వతహాగా ఈ షేరు అంత తక్కువకు దొరకదు. నిన్న నూట ఆరు(106/-) రూపాయల దగ్గర ముగించిన వ్యాపారం ఈ రోజు ఉదయాన కొంచం ఊపందుకుంది. తరువాత కొంచం మంద కొడిగా జారుతూ వచ్చి ఒక్క సారిగా ఒంటి గంటా ప్రాంతంలో నలభై నాలుగు రూపాయలకు పడిపోయింది. అనంతరం ఒక్క గంటలోనే తేరుకొని తొంభై రెండు(92/-) రూపాయలకు చేరుకుంది. ఇదిగో ఈ మధ్యలో నా పని అంతా చెడిందనుకోవాలి. ఆ తరువాత వ్యాపార ముగింపు దశలో కొంత నష్టపోయి ఎనభై ఏడు (87/-)రూపాయలకు దగ్గర ముగిసింది.

 

ఏది ఏమైనా, ఈ షేర్ మీద మార్కెట్‍లో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. మీరు కనుక నా సలహా తీసుకోవాలంటే, రేపు లేదా మరునాడు వీటి మీద ఓ కన్నేసి ఉంచండి. ఈ రోజు ముగింపుని గత వారంలో జరిగిన పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే.. వచ్చే వారంలో మరింత దిగువకు చేరే అవకాశం మెండుగా కనబడుతోంది. ఈ షేర్ గత సంవత్సరంలో ఇంత కంటే తక్కువగా ఎప్పుడూ అమ్ముడు పోలేదు. కాబట్టి వీలైతే, కుదిరితే ఓ వంద షేర్లు నలభై ఐదు(45/-) నుంచి యాభై ఐదు(55/-) రూపాయల మధ్య దొరికితే కొనేయ్యండి. ఒక నెల రెండు నెలల కాలంలో ఈ షేర్ తిరిగి నూట ఇరవై రూపాలకు(120/-) చేరుకునే అవకాశం ఉంది.

 

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

 
Clicky Web Analytics