మంచి - చెడు.. ఎలా అర్దం చేసుకోవాలి?

ఈ మధ్య నాలో రేగుతున్న కొన్ని మానసిక అలజడులలో ఒకటి, పైన చెప్పిన అంశం. అస్సలు మంచి అంటే ఏమిటి? దేన్ని చెడుగా తలుచుకోవాలి? ఎవ్వరు చేసిన పనులు మంచి పనులు? ఎవ్వరు చేసేవి చెడువి? అస్సలు .. మంచి చెడు అనేటటువంటివి ఎవ్వరైనా ఒక వ్యక్తికి సంభందించినవా లేక వాటికంటూ కొన్ని గుణ గణాలున్నాయా?

ఎవ్వరిని చూసి మనం మంచి వాళ్ళు అని చెప్పచ్చు? ఎవ్వరిని చెడ్డవాళ్ళనవచ్చు? వలబోజు జ్యోతిగారు ఉదహరించినట్లు, రాముడిని ఏవిధంగా మంచి వాడిగా అనుకోవాలీ? జ్యోతిగారి ప్రచురణకు స్పందించిన తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు తెలియజేసినట్లు, ఎకాలంలో వాళ్ళని ఆ యా కాలాలనుగుణంగా మాత్రమే మనం చర్చించు కోవాలి కానీ, వివిధ కాలాలలో చర్చించ కూడదన్నట్లు, మంచి చెడులు కాలాను గుణాలా?

జ్యోతిగారు ప్రచురించిన, ’పురాణాలు ఏం చెబుతున్నాయి’ పుట ఏప్రియల్ 25వ తారీఖునైతే.. నేను ఏప్రియల్ 10వ తారీఖున, ’ఎల్ వీ ప్రసాదు గారి పై నా అభిప్రాయా’న్ని ప్రచురించాను. ఇది చదివిన తరువాత, మా అమ్మకీ నాకు జరిగిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు కూడా నన్ను కలవర పెట్టాయి. అమ్మ వాదనకి నేను మూగ వాడినై పోయా. రామాయణం లోని కొన్ని ఘటనలను జ్యోతిగారు ఉదాహరణగా తీసుకుంటే, అదే రామాయణం లోని మరికొన్ని విషయాలను అమ్మ ఉదహరించింది.

మొదటగా: కుశ లవులు రామనామ జపం చేసుకుంటూ అయోధ్య చేరుకుంటే, దాని వెనుక ఆంతర్యమేమిటి? దీనికి నాదగ్గరున్న సమాధానమేమిటంటే.. (నాదగ్గరే కాకుండా ఎంతో మంది లవకుశ సినిమా చూసే ఉంటారు) పిల్లలిద్దరికీ ఇక తండ్రి అవసరం ఆసన్నమైంది. ఇంక సీతా అమ్మవారి పాత్ర ఇక్కడితో ముగించేయ్యాలి కాబట్టి. మా అమ్మ వేసిన ఒకే ఒక ప్రశ్నేమిటంటే.. పసి పిల్లలను ఒంటరిగా వదిలేసి తాను మాత్రం తన తల్లి దగ్గరకు పోవచ్చా.. ఈ పిల్లలకు మాత్రం తల్లి అక్కరలేదా.. తల్లికొక న్యాయం .. పిల్లల కొక న్యాయం.. ఎంత విచిత్రం.. ఇది ఏవిధంగా న్యాయం. ఇట్టి విషయాన్ని మనం మంచి విషయంగా తలంచుకోవాలా.. లేక తల్లులకొక న్యాయం, పిల్లలకొక న్యాయంగా వ్యవహరించడాన్ని ఆయుగ మంచి, ఈ యుగ చెడుగా తలంచుకోవాలా??

రెండవది: మగవాళ్ళెప్పుడూ శాసించడమేనా.. అర్దం చేసుకునే పని లేదా? నువ్వు నిప్పుల్లోకి దూకు అనగానే సీతా అమ్మవారు, దూకేయ్యాలా!!!! ఎంతటి నిరంకుశత్వం. ఏం నేనెందుకు దూకాలీ, ఉరూ పేరూ లేని ఒక అనామకుడు నిందవేయ్యగానే భార్య శీలాన్ని శంకించాలా? అదే సీతా అమ్మ వారు, నీ శీలం సంగతేమిటని ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేది. ఇది జరగలేదు, సరే.. అస్సలు ఎదైనా చెప్పే ముందు మనం పాటించాలి అని అంటారు కదా. మరి శ్రీరాములు వారు ఎందుకు అగ్ని ప్రవేశం చెయ్యలేదు? తాను పాటించి నిరూపించుకున్న తరువాత అడిగి ఉంటే బాగుండును కదా?

ఇలా .. ఎన్నో.. మరెన్నో.. ఎమో!! ఇలాంటి వాటిని అర్దం చేసుకునేంత బుర్ర నాకు ఆ దేవుడు ప్రసాదించ లేదు. వీటన్నింటినీ ఆలోచించిన తరువాత, నాకు ఒక్క ముక్క అర్దం మయ్యింది.

మంచి చెడు అనేటటువంటివి, ప్రతీ వ్యక్తి ఇష్టాయిష్టాలే తప్ప మరొకటి కాదని. మనకి ఇష్ట మయితే అది మంచిది, మనకు కష్టమయ్యి అయిష్టమయితే అది చెడ్డది. That's it, very simple.

Good and Bad are nothing but Like and Dislike

 
Clicky Web Analytics