21 – ఓ విలక్షణ చిత్రం

1245599787_21ఈ చిత్రానికి రివ్యూ వ్రాసేటప్పుడు శీర్షిక ఏమని పెడదాం అని ఎంతో ఆలోచించిన తరువాత, నిజ్జంగా ఇది ఓ విలక్షణ చిత్రం అనిపించింది. అందుకనే ఇలా మొదలైంది. లెక్కలు పెట్టడం కూడా ఓ లక్షణమే కదా.

ఈ సినిమా మొత్తం బ్లాక్ జాక్ అనే ఓ పేకాట చుట్టూ తిరుగుతుంది. కధా పరంగా ఇందులో పెద్ద విషయం ఏమీ లేక పోయినా, చిత్రించిన విధానం బాగుంది. ఇందులో హింస అనే పదానికి అవసరానికి మించి వాడలేనందున నాకు నచ్చింది. సినిమా అనేది తియ్యాలి, వద్దు అనను. కానీ మితి మీరిన హింస అవసరం లేదు. అందునా మన తెలుగు సినిమాలలో, ప్రత్యేకంగా నందమూరి వంశస్తుల సినిమాలలో మరింత భీభత్సంగా ఉంటుంది.

ఈ చిత్ర విషయాలకు వస్తే, ప్రతీ వ్యక్తిలోను ఏదో విషయం ఉండే ఉంటుంది. కాకపోతే ఆ విషయాన్ని వారు తెలుసుకోవడమే ముఖ్యం. అది వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సినిమాలో ఓ అనుహ్యమైన అలవాటు అంత్య సీన్లలో అనుకోని విధంగా పనికి వస్తుంది. ఈ సినిమా ప్రధాన వృత్తాంతమే ధనార్జన. అలాగే ఈ సినిమాలోని ప్రధాన పాత్రదారులు ధనార్జన విషయంలో సఫలీకృతులౌతారు. కానీ వీరిలోని ఒక వ్యక్తికి ఓ సాధారణమైన అలవాటు ఉంటుంది. అది మన అందరికీ చీప్ గా అనిపించ వచ్చు, కానీ అదే అలవాటు ఈ సినిమా చివ్వర్లో ఉపయోగ పడుతుంది.

ఈ సినిమాని తీసిన విధానం కన్నా, కధని నేరేట్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో భావప్రకటనకు ఎంత పెద్ద పీట వేసారంటే, కొన్ని కొన్ని భావాలు మనం అనునిత్యం అనుభవిస్తున్నా వ్యక్త పరచలేము. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారికి నిండా ఓ పాతికేళ్ళ వయసు ఉంటుందో లేదో చెప్పలేం, కానీ తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసాడు. ఈ సినిమాలో ఇతను చేసిన పాత్ర ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి చదువే లోకంగా పెరిగిన ఓ పిల్లవానిది. అలా అభం శుభం ఎరుగని పిల్లవాడు ఎంతో ఆశతో హార్వర్డ్ విశ్వవిధ్యాలయం లోని మెడికల్ కాలేజీలో సీటు సంపాదించు కోవాలన్న అభిలాషతో చిన్నతనంలో అనుభవించాల్సిన సంతోషాలన్నింటినీ త్యాగం చేసి చదువే లోకంగా పెరుగుతాడు. అలాంటి ఇతి వృత్తం ఉన్న సినిమాకి కమర్షియల్ కోణాన్ని చక్కగా అద్ది, ఆ కధ యొక్క భావాన్ని ఏ మాత్రం దెబ్బతినకుండా తీసిన విధానం స్క్రీన్ ప్లే విషయంలో చాలా శ్రద్ద వహించారని చెప్పుకోవచ్చు.

ప్రతీ కధలో చాలా ట్విస్టులు ఉంటాయి, అలాగే ఈ కధలో కూడా కొన్ని ట్విస్టులు ఈ సినిమాని ఆశాంతం మనలోని ఉత్సూకతని కోల్పోకుండా చేసాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్ల విషయానికి వస్తే..

  • హీరో గారు తన యవ్వనం అంతా చదువు పైనే కేంద్రీకరించి తన చిన్న చిన్న సంతోషాలను కోల్పోయాను అని తన స్నేహితునితో చెప్పేది మొదటిది
  • ఈ సినిమాలోని విలన్ తన వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు, సున్నితంగా తిరస్కరించిన వైనం రెండొవది
  • బొడ్డులో డబ్బులు దాచుకుని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటి వెళ్ళుతున్నప్పుడు హీరో ముఖ కవళికలను తీర్చిదిద్దిన వైనం మరొకటి
  • కంప్యూటర్లు ఎంత వచ్చినా నేను గమనించిన విషయాన్ని ఇవి గుర్తించ లేవు అని ఓ పాత్ర చెప్పే సీన్

ఇలా వ్రాసుకుంటూ పోతే చాలా వస్తాయి, క్లుప్తంగా చెప్పాలంటే, కొంచం సాహసం.. మరికొంచం తెగువ.. ఇంకొంత ధైర్యం తోడుగా తెలివితేటలుంటే, మనం ఏమి కోల్పోయినా అన్నింటినీ తిరిగి తెచ్చుకోవచ్చు అని ఈ సినిమాలో చెప్పారు.

 
Clicky Web Analytics