అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమాలో హీరోయిన్ చేసింది అని విన్నాను ఇదిగో ఇవ్వాళ్ళ అనుభవిస్తున్నాను. పైన శీర్షికకి ఇక్కడ వ్రాసిన మొదటి వాక్యానికి పొంతన లేదనుకుంటున్నారా? పైన చిత్రంలో కనబడుతున్నవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
చదివే వారికి ఓ క్లూ కూడా ఇచ్చేసాను. వెంకటేష్ చేసిన సినిమాలలో స్నేహం అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమాలోని హీరోయిన్ చద్దన్నం పారేయ్యకుండా పిండి ఒడియాలు చేస్తుంది. అదిగో అలాగునే మా అమ్మ ఇవ్వాళ్ళ మధ్యాహ్నం వేళకి ఓ ఫలహారం చేసింది. ఏమిటో అనుకుంటే, ఇదిగో ఇలా పకోడీలు వచ్చాయి. పకోడీలు శనగపిండితో చేస్తారు కదా వద్దులే నేను తినను కాలికి చీము పడుతుందేమో అని దాటేయ్యబోతే, ఒరేయ్ భడవాయ్ ఇవి శనగపిండి పకోడీలు కాదు, ఇందాక మనం తిన్న తరువాత మిగిలిన అన్నాని ముద్ద చేసి ఇలా వేయించాను అని నెత్తిమీద ఓ మొట్టికాయ్ వేసింది.
నిజం చెప్పొలంటే, మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ వంట మాత్రం బాగానే చేస్తుంది. క్రొత్తగా ఏదైనా చేసే విషయాన్ని సృజనాత్మకత అని అంటే, మా అమ్మ లాంటి వారిని చూచిన తరువాత సృజనాత్మకత ఎక్కడ లేదు అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలి అన్న ఆలోచన రావడమే ముఖ్యం.