తకిట తకిట

takita 

ఓ మంచి సినిమా. చాలా కాలం తరువాత మరో కుటుంబ సమేత సినిమా చూసాను అనిపిస్తోంది. సినిమాకి తగ్గట్టుగా భూమిక ఓ మంచి పాత్ర పోషించింది. సున్నితమైనటువంటి కధాంశంతో మృదువైన స్టోరీలైన్ కలిగిన సినిమా. పిల్లలలో ఇంత సత్ హృదయం నింపాలంటే, పెద్దలలో ఎంత ఓర్పు ఉండాలో, ఎంత సహనం ఉండాలో కదా. ఈ సినిమాని ఎవ్వరు దర్శకత్వం వహించారో గాని చాలా బాగా చేసారు. కధా రచయత బాగా వ్రాసారు. ప్రతీ సీన్ కు తగ్గట్టుగా మాటలు వ్రాసారు. నాకు పూరి జగన్నాద్ తీసిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా గుర్తుకు వచ్చింది. ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, పూరి మనస్తత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనుష్యులంతా మంచి వాళ్ళు అని అనుకుంటాడు. అలాగే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు సున్నిత మనస్కులై వైలెన్స్ గురించి ఆలోచించరు అని నా అభిప్రాయం.

ప్రతీ కధలో ఓ విషాదం ఉన్నట్టు, ఈ కధలో కూడా ఓ విషాదం పెట్టి కొంచం రక్తి కట్టించారు అని అనలేను కానీ సుహాసిని స్వరూప్ ల ఆత్మహత్య నాకు నచ్చలేదు. వారి కధకి కూడా ఓ మంచి ముగింపు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఈ ప్రియులు వ్రాసిన ఆఖరి లేఖలో కొన్ని డైలాగులు చాలా భాధాకరంగా ఉన్నా, చొంగ కార్చుకునే యదవలు అవకాశం కోసం ఎదురు చూస్తునే ఉంటారు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి కాని అవకాశం దొరికింది కదా అని చేతులేసి అసహ్యంగా ప్రవర్తించడం ఎంత భాధాకరమో ఆ మాటల్లో తెలిసింది. నిజంగా చెప్పాలంటే, ఈ మాటలే చాలా భాధాకరంగా ఉన్నాయి. అలాంటిది అనుభవించాల్సి వస్తే.. తలచుకోవాలంటే భయంగా ఉంది. ఈ మాటల్లో చెప్పదలచుకున్నది ఎంతవరకూ నిజ సమజంలో ఉన్నదో అని చెప్పలేకపోయినా, ఎంతో కొంత మాత్రం రాక్షసులు మాత్రం ఉన్నారని నా అభిప్రాయం. ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ వ్రాస్తే నాకు మంచి మాటలు రావు.. పాయింట్ దెబ్బతింటుంది.

హీరో పాత్రని పూర్తిగా వైలెన్స్ లేకుండా తీర్చిదుద్దడం బాగుంది. అలాగే కన్న కూతుర్ని కాకుండా ఊరూ పేరూ లేని వెంగళప్పాయిని నమ్మే తల్లి తండ్రులకు చురక పెట్టిన సీన్ అదిరింది. నాన్నా నన్ను నమ్మండి, అంటూ ఏడుస్తూ పలికిన అమ్మాయిని, అలాగే ఆ తండ్రిని చూస్తుంటే, ఆ అమ్మాయిలోని అమాయకత్వం ఆ తండ్రిలోని భధ్యత ప్రస్పుటంగా కనిపించాయి. ఆడపిల్లలున్న ప్రతీ తండ్రీ పిల్లల్ని ఏవిధంగా పెంచాలో కొన్ని కొన్ని భాధ్యతాయుతమైన పాయింట్స్ చూపించారు. అన్నింటికీ మించి యాసిడ్ పోద్దాం అన్న ఆలోచనతో లాబ్ నుంచి యాసిడ్ తీసుకు వస్తున్న సమయంలో భూమిక పైన తీసిన సన్నివేశం నాకు తెగ నచ్చింది. అబ్బాయిని రెండు లెంపకాయలిచ్చి, కోపంగా ఉందా.. అయితే నామీద కూడా పోయ్ రా .. అని ప్రశ్నించడం చాలా సబబుగా సన్నివేశానికి తగ్గట్టుగా ఉంది. ఆ తరువాత డైలాగులైతే అద్దిరాయ్.. నీ చెంపపై నేను కొట్టినప్పుడున్న నొప్పి ఇప్పుడు లేన్నట్టుగా నువ్వు యాసిడ్ పోసిన శరీరం పైన అయిన గాయం కాలానుగుణంగా మానిపోతుంది, కాని మనసుపై చేసిన గాయాన్ని మాన్పలేవు .. అన్న పోలిక సందర్బానుచితంగా ఉంది.

అన్నింటికీ మించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది అనేది  సరి అయినది. మీరు చూడండి.

 
Clicky Web Analytics