మొన్నామధ్య ఎఱక్కపోయి ఇరుక్కుపోయ్యాను. ఏంటీ .. అదేదో పాట గుర్తుకు వస్తోందా.. హు.. అచ్చం అలాగే ఎఱక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయ్యాను. ఆ రోజు కొంచం వీలు చూసుకుని శ్రీమతితో కూర్చుని ముచ్చట్లాడుతూ అడ్డంగా దొరికి పోయ్యాను. దేని గురించి అనుకుంటున్నారా.. అదేనండి శీర్షికలో చెప్పిన, మంగ తాయారు (కాప్షన్ : my name is maggi) సీరియల్ గురించి.
ఈ సీరియల్ అచ్చంగా అరగంట సేపు వస్తుంది, ఈ విషయం అందరికీ తెలిసిందే, ఒక్క నాకు తప్ప. శ్రీమతితో కలసి ఆ రోజు బయటికి వెళ్ళి సరదాగా తిరిగి ఏదైనా రెస్టారెంట్లో భోజనం చేద్దాం కదా అని మనసులొ అనుకుంటూ, TV చూస్తున్న శ్రీమతి ప్రక్కన చేరి పిచ్చాపాటి మొదలపెట్ట బోయ్యాను. తెలుగు TV ఛానల్స్ లోని ఏ సీరియల్ చూడకూడదు అనేది మా ఇంట్లో ఒక సాశనం (నాది). కారణం ఎమిటంటే, ప్రతీ సీరియల్‍లో ఏదో ఒక చెత్త. ఒక దాంట్లో ఒక అత్తా కోడళ్ళ పోట్లాటలైతె మరోదాంట్లొ అక్రమ సంబందాలు. నీతి మాలిన కార్యక్రమాలే అన్నీ. ఆనందానికో సంతోషానికో మనం ఆటవిడుపుగా TVని ఆశ్రయిస్తాం అంతే కాని కుళ్ళు కధలు కోసమో, అక్రమ సంబందాల కధలు కోసం కాదు కదా. మంచి కధలు లెక పోగా మానవతా విలువలు లోపించిన కధలే ఈ సీరియల్స్. వీటి గురించి నేను చెప్పేకన్నా ఇది వరలో చాలా మంది తెలుగు బ్లాగర్లు చాలా వివరంగా వ్రాసారు. వారి వివరణల ముందు నెను ఎంత? మచ్చుకు ఒకటి, రెండు, మూడు, ఎన్నో మరెన్నో..
ఈ సీరియల్ మొదలైన కొత్తల్లో అనుకుంటా.. నా సాశనాన్ని ధిక్కరించె విధంగా ఉంది అంటూ నా శ్రీమతీ అనే సరికి ఈ ఒక్క సీరియల్ కు సడలింపు ఇవ్వడం జరిగింది. అలాగే.. మొదట్లో.. ఈ సీరియల్ మొత్తం హాస్యాస్పదం గానే ఉండేది అని ఒకరిద్దరు చెప్పపట్టి నేను అంతగా పట్టీంచు కోలేదు. అందువల్ల ఈ సీరియల్ వచ్చే వేళ్ళల్లో నన్ను పట్టించు కోదు అన్న విషయం నాకు ఈ సంఘటన ద్వారా అర్దం అయ్యింది. సరే అడ్డంగా దొరికి పోయాకదా అని చూస్తూండగా ఓ ఆలోచన నా మదిలో తళ్ళుక్కున మెరిశింది. అది ఏమిటంటే, ఎంత సేపు సీరియల్ వేస్తాడు? ఎంత సేపు ప్రకటనలు వేస్తాడు? వాటిల్ని పక్కా లెక్కల ప్రకారం నోట్ చేద్దాం అనిపించింది. అన్నదే తడవుగా ఆ ప్రయత్నం మొదలు పెట్టాను.
౧) ఈ సీరియల్ మొదలైయ్యే ముందు అచ్చంగా మూడు నిమిషాల సేపు ప్రకటనలు (3 Min) = Total 3 Mins
౨) తరువాత పాత ఎపిసోడ్ నుంచి ఒక నిమిషం పాత పాట
౩) రెండున్నర నిమిషాల పాటు ప్రస్తుత కధ
౪) వెంటనే ప్రకటనలు. అంటే మూడున్నర నిమిషాల నిడివికి అంతరాయం (1 + 2.5 = 3.5 Min) = Total 6.5 Mins
౫) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming) = Total 7 Mins
౬) నిమిషం నిడివితో నాలుగు ప్రకటనలు. అంటే నాలుగున్నర నిమిషాల విరామం ( 1Min X 4 = 4 Mins) = Total 11 Mins
౭) మళ్ళీ ఓ ఐదు నిమిషాలసేపు కధ సాగ దీయ్యడం (5 Mins) = Total 16 Mins
౮) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming) = Total 16.5 Mins
౯) ఒక నిమిషం నిడివిలో ఒక వ్యాపార ప్రకటన (1 Min)= Total 17.5 Mins
౧౦) మూడు సెకల్న నిదివిలో రాజకీయ ప్రకటన (3 Min)= Total 20.5 Mins
౧౧) మళ్ళీ ఓ నాలుగు నిమిషాలసేపు కధ సాగ దీయ్యడం (4 Mins) = Total 24.5 Mins
౧౨) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming)= Total 25 Mins
౧౩) నిమిషం నిడివితో మూడు ప్రకటనలు. అంటే నాలుగున్నర నిమిషాల విరామం ( 1Min X 3 = 3 Mins) = Total 28 Mins
౧౪) మళ్ళీ ఓ నిమిషం సేపు కధ సాగ దీయ్యడం (1 Min) = Total 29 Mins
౧౫) ముగింపు .. పేర్లు .. ఓ నిమిషం (1 Min) = Total 30 Mins
ఆఖరుగా తేలినది ఏమిటంటే, అస్సలు కధేమో పన్నేండు నిమిషాల ముప్పై సెకల్ను (12 Min 30 Sec) నడిస్తే, ప్రకటనలు అచ్చంగా పద్నాలుగు నిమిషాలపాటు(14 Min) అత్యధికంగా పాలు పంచుకుంటే అనవసరంగా మూడున్నర నిమిషాలు(3 Min 30 Sec) వృధా చేసారు. ఈ గణాంకాలను ఒక గ్రాఫ్ గా చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది.
కానీ ముగించే ముందు ఒక్క మాట, ఈ సీరియల్ మొదట్లో హాస్యాస్పదంగా సాగినా, ప్రస్తుతం మాత్రం మరే ఇతర పనికిరాని సెంటిమెంటు సీరియల్స్ లాగానే ఇది కూడా రూపాంతరం చెందుతోందని నా అభిప్రాయం.కధ అంటూ ఏమీ లేక పోవడం వల్ల, ఎలా సాగదీయ్యాలా అని తాపత్రయ పడుతున్నట్లు నాకు అనిపిస్తోంది.ఎందుకైనా మంచిది మీరు మాత్రం దీని నుంచి దూరంగా ఉండగలరు.