తనదాకా వస్తే గానీ .. రెండవ భాగం

క్రిందటి పుట, తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ.. జరిగిన తరువాత కొద్ది రోజులకు జరిగింది.. ప్రస్తుత కధాంశం. అస్సలు కధలోకి వచ్చేటప్పుడు కొంత ఉపోధ్ఘాతం.

ఇది జరిగిన ముందు రోజు కార్యాలయం నుంచి అధికారి చేత తిట్లు తిని, ఆలస్యంగా ఇంటికి చేరుకున్నా. తెల్లవారి ఝామున వేళ్ళలో అనుకుంటా అప్పటి మా క్లైంట్ ఫోన్ చేసి మేము ఇచ్చిన ప్రాజెక్ట్ పని చెయ్యటం లేదు కాస్త చూడమనగానే, సగంలో ఉన్న నిద్రకాస్తా ఎగిరిపోయింది. కొద్దిగా కష్ట పడగానే, ప్రాజక్టు మళ్ళీ మామూలు స్తితికి వచ్చేసింది. ’ఈ మాత్రం దానికే.. మాంఛి నిద్రలో ఉన్న నాన్ను మేలుకొలపాలా .. ’ అనుకుంటూ నిద్రకు ఉపక్రమించా. నిద్రకైతే ఉపక్రమించా గానీ, ఉదయం కార్యాలయానికి వెళ్ళి ఎంత మందిని తిట్టాలా.. ఎలా అస్సలు విషయాన్ని టీంలో ఉన్నవాళ్ళకు తెలియ జేయాలా.. మనం చేసే ప్రతీ పనికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి ఎలా తెలియజేయ్యాలా అనుకుంటూ కాలక్షేపం చేసా.

ఇంతలో ఎప్పుడు తెల్ల వారిందో తెలియదు, తీరా చూద్దునుకదా ఎనిమిదిన్నర. ఇంత లేటయినా లేపనందుకు పెళ్ళాన్ని తిట్టుకుంటూ, గబా గబా కాల కృత్యాలు తీర్చుకునే దిశగా ఉపక్రమించాను. ఎంత గబా గబా చేసినా తొమ్మిది పది అయ్యింది. ఇంతలో భార్య, తన ఆఫీస్‍కు లేటవుతోందని, టిఫిన్ చేసి హాట్ పాక్ లో పెట్టానని చెప్పడం లీలగా వినిపించింది. లఘు పూజ, ఫలహారం అయ్యేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటి, రాహు కాలం అయ్యింది. ఇంతకీ ఈ రాహు కాలమేమిటనుకుంటున్నారా..

మా ఇంటి దగ్గర నుంచి 9:20 లోపుల బయలు దేరితే, ట్రాఫిక్ జామ్ ఉండదు. కొంచం దాటిందా, ఇంతే సంగతులు. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా.. పుణ్య కాలం అంటే, 9:20 లోపుల.. రాహు కాలమంటే.. 9:30 దగ్గరనుంచి అన్నమాట. ఆరోజు నా దురదృష్టవశాత్తు, నేను రాహు కాలంలో బయలు దేరవలసి వచ్చింది.

అయినా, వెయ్యి దేవుళ్ళను ప్రార్దిస్తూ బయట పడ్డా..

పైన చెప్పిన ప్రదేశం గుర్తు కొచ్చిందను కుంటా. నా ప్రయాణం పైన చెప్పిన U turn మొదటి దాకా బాగానే సాగింది. అదిగో అప్పుడు మొదలైంది నా కష్టకాలం.

నాకన్నా ముందు ఉన్న ఇద్దరు వాహన చోదకులు నాకు దారి ఇవ్వరు, వాళ్ళు వెళ్ళరు. తీరా కుడి చేతి వైపు చూడ బోతే, ట్రాఫిక్ పలచగా ఉంది. ఎదో విధంగా వీళ్ళని దాటుకుని ప్రక్క రోడ్డులోకి చేరుకుందా మనుకుంటూ ఉంటే, నాకోసమే పుట్టి నట్లుగా, వాళ్ళు కావాలని నాకు ఆడ్డం వస్తూ ముందుకు సాగి పోయ్యారు. నేను U turn, దగ్గర కి వచ్చే సరికి, నాకు ముందు ఒక ఆటో వాడు, కావలని ఇరికించెసాడు. ఒక్క నిమిషం కనక వీలు కలిగితే, దాటి పోయ్యేవాడిని. ఇంతలో అక్కడున్న రక్షక భటుడు, అందరినీ ఆపేశాడు. ఎవ్వరో మినిష్టర్ ఆ వైపుగా పోతున్నాడంట.

వాడి కోసం ముందున్న ట్రాఫిక్ అంతా కదిలించి రోడ్డు కాస్తా ఖాళీ చేయించారు. హమ్మయ్య.. పోతే.. పోయింది, కాస్త రోడ్డంతా విశాలంగా ఉంది .. ఝూయ్.. మంటూ పోవచ్చు అనుకుంటూ wait చెస్తున్నా.. ఇంతలో ఏమైందో ఎమో, ఉన్న ఫళ్ళంగా మయూరి పిలిమ్స్ ప్రక్కనుంచి జనం పలో మంటూ రావడం, అప్పటి దాకా మన మినిష్టరు గారికోసం ఎదురు చూస్తు దారి వదిలిన వాహన చోదకులు, ఉన్న జనంతో పాటుగా ఒక్కసారిగా ముందుకు దూకేసారు. ఇది అక్కడి పోలీసళ్ళకు మింగుడు పడలేదు. ఈ ఘటనని ఉపయోగించు కుంటూ నాముందున్న ఆటో వాడు, జనం మధ్యనుంచి ముందుకు దూకడానికి చేసిన ప్రయత్నంలో అడ్డుగా ఉన్న కానిష్టేబులు ని గుద్దేశాడు. ఇంకే ముంది, జనం మాకు ఆడ్డు పడ్డారు. నానా తతంగం..

సీను కట్ చేస్తే.. పది గంటల పది నిమిషాలు.. సిచ్యుయేషన్ సేమ్.. అదే స్తలం, అదే ట్రాఫిక్, చిన్న తేడా.. నేను బండి మీద.

ఒక వైపు లేటవుతోందన్న చికాకు.. మరోవైపు చెయ్యని తప్పుకు జనాల చేత మాటలు పడ్డ భాధ.. వీటన్నింటికీ మించి చిందర వందరగా ట్రాఫిక్. క్రిందటి పుటలో చెప్పినట్లు, ఫుట్ పాత్‍లు ఎక్కి పోయే వాహన ఛోదకులు.. అంతా కలసి గజిబిజి గందర గోళంగా తయారయ్యాయి. వీటన్నింటినీ మించి, క్రిందటి పుటలో నేను వహించిన పాత్ర ఒక ముసలాయన వహిస్తున్నారు.

వయస్సులో ఉన్న వాళ్ళంతా ఆయనను గేలి చేస్తూ, సాగి పోతున్నారు. ఎంత ఎక్క వద్దనుకున్నా, ప్రక్కనున్న వాళ్ళు నన్ను కూడా అటు వైపు పొమ్మంటూ వొత్తిడి చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు, నన్ను తిట్టడం కూడా జరిగి పోయింది..

’బండి తోలడం చేతగాక పోతే ఎలా.. అటు చూడు, ఎంత మంది పోతున్నారో.. జర ప్రక్కకి తప్పుకో రాదే.. నేను గూడా పోతా..’

సరే కదా అని, అతనికి చోటిచ్చా.. అంతే సంగతులు, చీమ తలకాయ దూర్చేంత చోట్టిచ్చామంటే, ఏనుగునే దూర్చేసే రకం మన ద్విచక్ర వాహకులు. ఇరికించు కుంటూ మరో పది మంది దూరేశారు. వీళ్ళలో ఒకడు దాదాపు ముందు చెప్పిన ముశలాయనను గుద్దేంత పని చేశాడు. ఆ పెద్దాయన, ఈ కుర్రాడితో తగువుకు దిగాడు.

కుర్రాడు: ఏం.. అలా అడ్డంగా నిలబడక పోతే.. కొంచం జరగరాదే..

పెద్దాయన: కళ్ళు కనబడటంలే.. ఇది ఫుట్ పాత్ అనుకున్నావా.. లేక రోడ్డనుకున్నావా..

కుర్రాడు: కళ్ళు కనబడ పట్టే, బ్రేకు వేసా.. లేకుంటే.. ఈ పాటికి ఎగ్గిరి అక్కడ పడేవాడివి..

పెద్దాయన: గుద్దుతావురా.. బొత్తిగా క్రమశిషణ లేకుండా పెరిగితే.. ఇలాగే తయారవుతారు..

కుర్రాడు: ఏంది వయ్యా .. ఎదో ఎదో వాగుతున్నావ్..

ఇంక చూడడం నావల్ల కాలేదు. కొంచం ప్రక్కగా చేరి, బండి మీద ఉన్న కుర్రాడితో... ఎదో చెప్ప జూసా.. ఇంతలో వెనకనుంచి ఎవ్వడో మరో డ్రైవర్ మెల్లగా వచ్చి నా బండిని గుద్దాడు..

మీరెందుకు సారు ఆగుతారు.. వాళ్ళ భాధ వాళ్ళేదో పడతారుగా.. మీరు కానీయ్యండి

ఇక చేసేది ఏమీ లేక, నాకు అప్పటికే ఆలస్యం అయ్యేటప్పటికి, స్వకార్యం .. స్వామి కార్యం (పెద్దాయనని రక్షించే పని) గా పనికొస్తుందని, ఫుట్ పాత్ ఎక్కించి, ముందున్న కుర్రాడి బండికి ఒక చిన్న డాష్ ఇచ్చా.. వాడికన్నా నేను పెద్దగా కనబడ్డానేమో.. గుర్రుగా చూస్తూ ఒక లుక్కేసాడు..

నేను: కానీ .. పద.. పద..

కుర్రాడు: ఏంది సార్.. ఈయన చూడండీ..

నేను: ఏందయ్యా చూసేది.. పెద్దాయన్ని పట్టుకుని..

కుర్రాడు: పెద్దాయన..!!! (ఎదో ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్లు..) అలా మాట్లాడు తున్నాడా..

నేను: ఆయన విషయం ప్రక్కన పెట్టు.. నువ్వు మాకు అడ్డంగా తయారయావు.. నీ సంగతి చూసుకో.. లేదా.. ప్రక్కకి తప్పుకో.. అంటూ ఒక్కసారి నా బండి ఎక్సలరేటర్ రైజ్ చేసా..

ఏమనుకున్నాడో ఏమో.. వెంటనే, ముందుకు లాగించేసాడు.. ప్రక్కనున్న పెద్దాయన ఇవేమీ గమనించనట్లు నన్ను కూడా ఓ రెండు తిట్టి ’క్రిందకి ఫో..’ అన్నట్లు ఓ లుక్కేశారు. అలా ఫుట్ పాతు ఎక్కిన నేను, ఆరోజు అనుకున్నా, మనం ఎంత వద్దనుకున్నా ..

ఈట్రాఫిక్ మనచేత తప్పుడు పనులు చెయ్యాలనుకోకుండానే చేయిస్తుందని

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics