ఆఖరికి నేను కూడా అరుంధతి చూసానోచ్

నాను స్వతహాగా సినిమాలు చాలా తక్కువగా చూస్తాను, క్రిందటి సంవత్సరంలో మూడంటే మూడే చూసినట్లు గుర్తు. ఈ సంవత్సరంలో అప్పుడే ఒక సినిమా చూసేసాను. మిత్రుల సహాయంతో క్రిందటి శనివారం సాయంకాల ఆటకు వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి సినిమా మొదలైంది. నాకు అంతగా ఏమీ అనిపించలేదు. కానీ నేను వెళ్ళిన తరువాత వచ్చి నాప్రక్కన కూర్చున్న వ్యక్తి వచ్చినప్పటినుంచి ఒకటే గోల, సార్ ఎంత సేపయ్యింది.. హీరో కనిపించాడా.. హీరోయిన్ ఇంతకు ముందు ఏదైనా ఫైట్ చేసిందా.. ఫ్లాష్ బాక్ లో ఎవ్వరు ఎవ్వరిని ఏమి చేసాడు.. అంటూ వేధిస్తుంటే, ఒక్కసారి వాడి వైపు ఓ భారీ లుక్కు వేసి.. నాయినా .. నేను ఇప్పుడే వచ్చాను .. అన్నాను. వెంటనే వాడు, ఏంటి సార్ మీరు కూడానా!! అన్నాడు (అంటే వీడి ఉద్దేశ్యం ఏమిటి.. నేనేమో ఆలస్యంగా రాకూడదా.. ఏమిటో అర్దం కాలేదు)

 

సరే ఇక సినిమా విషయానికి వస్తే, చెడు గానీ (లెదా.. )లోపాలు గానీ అందరూ చెబుతారు. కానీ నాకు నచ్చిన అంసాల గురించి మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇక ముఖ్యమైన విషయాలలోకి వస్తే.. ఎంచుకున్న కధలో పెద్ద వైవిధ్యం ఏమీ లేదనిపించింది. కానీ తెరకి ఎక్కించిన వైనం మాత్రం కొంచం కొత్తగా ఉంది. అన్నింటికీ మించి (పాత) అరుంధతి చిన్నప్పటి పాత్రలో కనిపించిన బాల నటిని ఎన్నుకోవడంలో చాలా మంచి పని చేసారనిపించింది. అలాగే, ఆ బాల నటి తనను ఎంచుకున్న పాత్రకు చక్కగా సరిపోయేటట్లు నటించి మెప్పు పొందింది. హావ భావాలలో చక్కటి ప్రతిభ కనబరచింది.

 

అలాగే, స్త్రీలలో ఎంతటి తెగువ ఉంటుందో.. ఎలాంటి ధైర్య సాహసాలు వీరు చెయ్యగలరో.. ఎలాంటి త్యాగాలు వీరిని అజరామర కీర్తిని తెచ్చి పెడతాయో .. నవ సమాజ యువతులలో ఎలాంటి బలహీనతా ఆలోచనలు ఉంటాయో అనేటటువంటి చాలా చాలా విషయాలను చక్కగా తెరకెక్కించారు. ఒకే పాత్రలో రెండు వైవిధ్య భరితమైన భావాలను పలికించడంలో కధానాయిక చాలా చక్కగా రాణించింది. పాపం!! ఇలా రెండు వైవిధ్యభరితమైన సన్నివేశాలను చేసేటప్పుడు, చిత్రీకరించేటప్పుడు, సూటింగ్‍లో పాల్గొన్న వాళ్ళనందరినీ ఎన్ని తిప్పలు పెట్టిందో!!!??? కెమెరా మేన్ ఈ కధానాయికను ఎన్నిసార్లు టేక్‍లు తీసుకున్నా ఆఖరికి ఏమాత్రం రాజీ పడకుండా సన్నివేశానికి తగ్గట్లుగా భావాన్ని చిత్రీకరించేంత వరకూ హీరోయిన్‍ని అరగదీసాడని మాత్రం చెప్పక తప్పదు. అన్నింటికీ మించి గ్రాఫిక్స్ పనితనం బాగుంది. సినిమా మధ్యలో నా ప్రక్క సీటులో ఉన్న వాళ్ళు ఒకటి రెండు సార్లు ఎగిరి పడేటట్లు చిత్రీకరించారంటేనే అర్దం చేసుకోవచ్చో ఈ సినిమాలో ఆడియో ఎఫేక్ట్స్ ఎలా ఉన్నాయో.. నాకు ఒళ్ళు జలదరించే అంతగా అనిపించక పోయినా.. హాలులో ఉన్న అందరూ మాత్రం తెగ భయపడ్డారనుకోండి. భయపడ్డారు అనే పదం సరిగా అనిపించలేదు, కానీ ఉలిక్కి పడ్డారు అంటే బాగుంటుందేమో!!

 

ఒక్కసారి చూడవచ్చు. స్వంతంగా డబ్బులు పెట్టుకుని వెళ్ళండి, అంతేకానీ నాలాగా స్నేహితుల డబ్బులతో టికెట్టు తెప్పించుకుని వెళ్ళకండి.

 
Clicky Web Analytics