మహిళా ప్లస్సర్ల సమావేశం .. భాగ్యనగరంలో..

నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక.

ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి?

ఆ!!! మహిళలను రాజకీయ నాయకులతో పోల్చడమా !!!

రాజకీయ నాయకులకు దోచుకోవడానికి ఏ పధకం పేరైతేనేమిటి? వాళ్ళకు కావలసినది దోచుకోవడమే, నాకెంత? నీకెంత? అనే కదా అనుకునేది. అదే విధంగా మహిళలకు వారి సమావేశాలకు పేర్లతో పని ఉందా?? ఏ పేరైతే నేమిటి, తలా ఒక వంటకం చేసి తీసుకొచ్చి ఓ చోట పేర్చుకుని కూర్చుని, అప్పట్లో నేనేమి చేసానో తెలుసా.. నువ్వేంమి చేసావు .. అంటూ బాతాకానీ కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి కదా!!

ఈ తతంగం అంతా నాలాంటి ఒంటి కాయ సొంటి కొమ్ము లాంటి వాడు ఖండిస్తున్నాడు. చరిత్ర పునరావృత్తం అవుతుంది అంటే ఏమిటో అనుకున్నా, ఇవ్వాళ కూడా మా ఇంట్లో బెండకాయ కూరే!! Sad smile  అక్కడ వాళ్ళేమో రకరకాల వంటలతో భోజనమా!! నాకేమో బెండకాయ కూర, నీళ్ల చారా.. తూచ్ .. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను..

నిజం వ్రాయాలంటే, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నాకు భలే సంతోషం వేస్తుంది. ఏదో విధంగా మహిళా లోకం అంతా కాకపోయినా, కొందరైనా వీలు చేసుకుని మరీ కలుస్తున్నారు. పాతరోజుల్లో వనభోజనాలు జరిగేవి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా నేను వనభోజనాలలో పాల్గొన్నట్లు ఙ్ఞప్తి లేదు. కారణాలు లేకుండా, మరొకరి హితవు కోరుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చుట్టం చూపుగానైనా వీరందరూ కలుస్తుంటే, ఎంతో ఆనందం కలుగుతుంది. చుట్టాలతో కొన్ని సార్లు ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ, వారింటికి మనల్ని ఆహ్వానించినా, లేక, మన ఇంటికి వారిని ఆహ్వానించిన సమయాన ఈ క్రింది డైలాగ్ సాధారణంగా వినబడుతుంది..

“ .. .. మీ ఇంట్లొ ఏదైనా ఫంక్షన్ పెట్టుకోండి, ఆ వంకనైనా మనం కలుద్దాం .. .. ”

కానీ ఈ మహిళలు కలవడానికి ఓ సాకుని ఎన్నుకుని కలుస్తున్నారే, అది హర్షించదగ్గ విషయం. మనకు ఎలాంటి చుట్టరికం లేని మఱో మహిళను మన ఇంటికి ఆహ్వానించడం లేదా వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారింటికి వెళ్ళడాని ఎదుటి వారితో మనకి ఎంతో సాన్నిహిత్యం ఉండాలి. అలాంటి భావన ఇలాంటి ఘటనల ద్వారా ఈ మహిళలు వ్యక్తపరుస్తున్నారు. కావున ఇలాంటివి మరింత తక్కువ సమయంలో మరిన్ని ఎక్కువసార్లు కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళా ప్లస్సర్లూ!! వింటున్నారా!! సారి, చదువుతున్నారా నా మనోభిష్టాన్ని?

 

[[ష్ .. ష్ .. గప్ చిప్.. గూఢాచారిగా నా భార్య వెళుతోంది, అక్కడ ఏమి జరిగింది, ఎవ్వరెవ్వరు ఏమేమి తెచ్చారు, ఎవ్వరెవ్వరు ఏమేమి మాట్లాడుకున్నారు, వగైరా .. వగైరా.. వంటి మరిన్ని వివరాలు త్వరలో..]]

 
Clicky Web Analytics