RRKK ఓ రివ్యూ

నేను ఓ సామాన్య సినిమా ప్రేక్షకుడిని. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. కానీ అమెరికా వచ్చిన తరువాత చాలా సినిమాలు దొంగతనంగా చూస్తున్నాను. నేను సినిమాలు చూడకపోవడానికి కారణాన్ని ఇంతకు ముందు తెలియ జేసాను. నాకు జీవితంలో కష్టం కన్నా సౌకర్యం ముఖ్యం. అలాంటి సౌకర్య్ం కొన్ని చోట్ల దొరకదు. అందులో హైదరాబాద్ సినిమా హాళ్ళలో అస్సలు కష్టం. అందుకనే నేను సినిమా అంటే చాలా దూరంగా ఉంటాను. కానీ అమెరికా వచ్చిన తరువాత ఇక తప్పటం లేదు. అలాగే ఈ రోజు రామ రామ కృష్ణ కృష్ణ చూడడం జరిగింది. ఈ పుటని సినిమా మొత్తం చూడకుండానే మొదలు పెట్టాను. అంటే మొదటి భాగం నాకు ఎంత నచ్చిందో అర్దం చేసుకోగలరు.

rrkk

హాస్యం ప్రధానంగా తీసారనిపించింది. సినిమాలో కొన్ని పాత కక్షలు ఉన్నా, కధానిక ప్రాకారం చాలా బాగా తీసారు. వ్యాపార పరంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ కధలు చాలా అతికినట్టున్నాయి. ఈ హీరో పేరు నాకు తెలియదు కానీ, అదేదో సినిమా పేరు గుర్తుకు రావటం లేదు కానీ .. ప్రేమకోసం అమెరికా వెళ్ళి హీరోయిన్ ని అక్కడ వదిలేసి వస్తాడు, అలా ఆ సినిమానుంచి ఈ సినిమా వరకూ ఏమాత్రం తన స్టైల్ మార్చుకోకుండా యధాతధంగా కృత్రిమం కనబడకుండా నెట్టుకొచ్చేసాడు.

దర్శకుడెవ్వరోకానీ బాగానే చిత్రీకరించాడు. కధని ఎవ్వరు వ్రాసారో కానీ కాస్తంత కమర్షియల్ గా తీర్చిదిద్దారు. కాస్తంత ప్రేమ కాస్తంత సెంటిమెంటు కాస్తంత హాస్యం కాస్తంత త్యాగం మరింత ఆప్యాయత చేర్చి మధ్యతరగతి కుటుంబం ప్రశాంతంగా చూసేటట్టు తీర్చి దిద్దారు.

ఈ మధ్య కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొన్నిసినిమాలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం. హైదరాబాద్ చేరుకున్న తరువాత తప్పనిసరిగా ఈ సినిమాకి నా భార్య సమేతంగా వెళ్ళి చూస్తాను. అలాగే మీరుకూడా చూడండి. నా భార్యకి ఓ చక్కటి సినిమా చూపించానన్న ఆనందం ప్రక్కనున్న వాళ్ళ చెమట కంపు అధిగమిస్తుంది. క్లైమాక్స్ లో హింస పాళ్ళు అనవసరమైనా కధాపరంగా మాస్ జనానికి బాగానే ఆకట్టుకుంటుంది. అర్జున్ సెలక్ట్ చేసుకునే పాత్రలన్నీ చాలా హుందాగా ఉంటాయి. అప్పుడెప్పుడో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఓ టీవీ ఛానల్ కోసం చేసిన ఓ టాక్ షోలో అర్జున్ జగపతి బాబు ఇద్దరూ మంచి స్నేహితులని విన్నా. ఆ తరువాత నేను చూసిన అర్జున్ మొదటి సినిమా ఇదే. చాలా హుందాగా చేశాడు. మొత్తం మీద నాకు నచ్చింది. నిర్మాతకు నా వంతు డబ్బులు భాగ్యనగరం చేరుకున్న తరువాత. అంతవరకూ ఇంతే సంగతులు..

 
Clicky Web Analytics