26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.
సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.
మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.
వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.
రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.