తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics