తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

9 స్పందనలు:

కొత్త పాళీ said...

ఇది సులభమే. ఎందుకంటే సంక్రాంతి తిథుల మీద ఆధార పడే పండుగ ఖాదు కాబట్టి. మిగతా పండుగలన్నీ తిథులు (అంటే చంద్రుడి కళలు) మీద ఆధారపడీ నిర్ణయమౌతాయి. మకర సంక్రమణం సూర్య గతి మీద ఆధార పడినది. గ్రిగేరియన్ కేలెండరు (మన వాడే పాశ్చాత్య కేలెండరు) కూడా సౌరమాన కేలెండరే కాబట్టి సంక్రాంతి ఎప్పుడూ ఆయా రోజుల్లోనే వస్తుంది. మన పొరుగు తమిళ సోదరుల ఉగాది కూడా ఎప్పుడూ ఏప్రిల్ 14 నే వస్తుంది .. వాళ్ళు కూడా సౌరమానం వాడతారు.
ఈమాటలో నాగమురళి గారి వ్యాసంలో రెండో పేజీలో solstice and equinox గురించి రాసిన భాగం చదవండి.

Dr. Ram$ said...

గొప్ప డౌటే వచ్హింది గురువు గారి కి...మరి యెవరు తీరుస్తారో గాని.. చూద్దాము..

వెంకట రమణ said...

మిగతా తెలుగు పండగలన్నీ చంద్రమాన కాలెండరు ప్రకారం చేసుకుంటాం, కాని సంక్రాంతి మాత్రం సూర్యగమనాన్ని బట్టి జరుపుకుంటాం. ఆంగ్ల సంవత్సరం కూడా సూర్యు గమనం మీదే ఆధారపడి ఉంది కాబట్టి, సంక్రాంతి ఎప్పుడూ దాదాపు అదే తేదీల్లో వస్తుంది.

వెంకట రమణ said...

మిగతా తెలుగు పండగలన్నీ చంద్రమాన కాలెండరు ప్రకారం చేసుకుంటాం, కాని సంక్రాంతి మాత్రం సూర్యగమనాన్ని బట్టి జరుపుకుంటాం. ఆంగ్ల సంవత్సరం కూడా సూర్యు గమనం మీదే ఆధారపడి ఉంది కాబట్టి, సంక్రాంతి ఎప్పుడూ దాదాపు అదే తేదీల్లో వస్తుంది.

దైవానిక said...

ఇది చాలా పెద్ద విషయం అడుగుతున్నారు. క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
మన తెలుగువారి కాలమానం చాంద్రమానం. అంటె చంద్రున్ని ఆసరాగా చేసుకొని కాలాన్ని లెక్కిస్తారు(totallయ్ lunar కాదు. దీన్ని luni-solar అంటారు). మనం భూమిని constantగా పెట్టి సూర్య చంద్రుల పాత్ ని(ecliptical path) 27 నక్షత్రాలుగా లేదా 12 రాశులుగా విభజిస్తారు(based on angular movement 30 degrees per zodiac). ఆశ్వని మొదలు రేవతి వరకు లేదా మేషం మొదలు మీనం వరకు.

చంద్రౌడి ఏ రాశిలో ఉన్నాడో దాని బట్టి ఆ సమయానికి రాశి వస్తుంది. ఇక మనకి ఒక నెల అంటె నెలపోడపు మొదలుకొని అమావాస్య వరకు. ఆ నెలలో సూర్యుడు ఏ రాశిలో ప్రవేసిస్తాడో(he should enter not where he is on the first day) దాని బట్టి నెల పేరు నిర్ణయింపబడుతుంది. నెల మొదలు ఎఫ్ఫుడు నెలపొడుపే అవుతుంది. సపోస్ సూర్యుడి చిత్తాలో ప్రవేశిస్తె అది చైత్రము. మనం "ecliptical" పాత్ ని 12 గా విడగొట్టాము కాబట్టి అది "even" గా ఉండదు. ఒక్క నేలలో సూర్యుడు రాశి మార్పిడి జరగకపోవచ్చు. అప్పుడు అధిక మాసం అవుతుంది. ఒకే నెలలో సూర్యుడు రెండు రాశులలోకి మారొచ్చు అప్పుడూ అది క్షయ నెలవుతుంది.
ఇక మన పండుగలన్ని చంద్రమానం ప్రకారం వస్తాయి. కాబట్టి ఒకే రోజు రావు. మకర సంక్రాంతి మాత్రం సూర్యుడు మకర రాశిలో కి వెళ్ళి నప్పుడు వస్తుంది. అంటె సూర్యుడి మీద మాత్రమే ఆధారపడుతుందన్నమాట. జార్జీయన్ కాలెండర్ సౌరమానం కాబట్టి అదీ ఎప్పుడు ఒకే రోజు వస్తుంది.

మీకు అర్థం అయ్యేట్టు చెప్పాననుకుంటాను :). word verification for comments తీసేస్తే బాగుంటుంది.

oremuna said...

ఎందుకంటే మిగిలిన పండగలు అన్నీ చంద్ర క్యాలాండర్ ప్రకారం లెక్కిస్తారు, మన ఇంగ్లీషు క్యాలాండర్ మాత్రం సూర్యుడ్ని బట్టి లెక్కిస్తారు. కానీ సంక్రాంతి పండుగ మాత్రం బై డిజైన్ సూర్యుని గమనాన్ని బట్టి ఉంటుంది కనుక సూర్యూ క్యాలాండర్ అయిన ఆంగ్ల క్యాలాండర్ కూడా ఒకే రోజు పడుతుంది.

nagamurali said...

చక్రవర్తి గారూ,

మనం తిథులప్రకారం లెక్కగట్టే కాలమానాన్ని చాంద్రమానం అంటారు. ఇందులో అమావాస్య నుంచీ మళ్ళా అమావాస్య వరకూ ఒక నెల గా లెక్కించబడుతుంది. ఒక నెలలో ముప్ఫై తిథులు ఉంటాయి. ఒక తిథి ఇంచుమించుగా ఒక రోజుకి సమానం. తిథుల గురించి వివరంగా నా బ్లాగులో ఒక టపా రాశాను, చూడండి.

ఒక అమావాస్య నుంచి ఇంకో అమావాస్య వరకూ పట్టే కాలం సగటున 29.530589 రోజులు. అంటే ఇది చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల యొక్క పరిమాణం. ఇటువంటి నెలలు పన్నెండు అయితే ఒక సంవత్సరం. కాబట్టి ఒక చాంద్రమాన సంవత్సరానికి పట్టే కాలం సగటున 354.367068 మాత్రమే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం (అంటే సౌరమాన సంవత్సరం) 365.25 రోజులు కదా. కాబట్టి చాంద్రమానంలో సంవత్సరం పరిమాణాన్ని 354 గానే వదిలేస్తే ఆ సంవత్సరంలో తిథులు సౌరమానం ప్రకారం ప్రతీ యేడాదీ ఒక పదిరోజులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నేళ్ళు గడిచేసరికి చాంద్రమానపు నెలలు (చైత్రమూ, వైశాఖమూ మొదలైనవి) ఋతువులని అనుసరించి రావు. అంటే చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అని చెప్పడానికి వీలుండదు. అసలు ‘సంవత్సరం’ (సైక్లిక్ గా తిరిగే కాల ప్రమాణం) అన్న భావనే దెబ్బ తినేస్తుంది. కాబట్టి చాంద్రమాన సంవత్సరంలో ప్రతీ మూడు సంవత్సరాలకోసారి అధిక మాసం కలిపి పదమూడు నెలలు చేస్తారు. ఆ విధంగా సౌరమానంతో పోలిస్తే వెనకబడిన ముప్ఫై రోజులూ సరిచేయబడి మళ్ళీ చాంద్రమానమూ, సౌరమానమూ సమం (synchronize) అవుతాయి.

మనం అవలంబించే గ్రిగోరియన్ కాలెండర్ సౌరమానం. తెలుగు కాలెండరు చాంద్రమానం. కాబట్టే తిథులు ఎప్పుడూ మన డేట్ల ప్రకారం రావు. అయితే మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే అది సూర్యుడి చుట్టూ భూమి తిరిగే చలనం ప్రకారం లెక్కవేయబడే ఖగోళ సన్నివేశం. కాబట్టి అది సౌరమానంలోకి వస్తుంది. అంటే మనం చెప్పుకునే డేట్ల ప్రకారం సుమారుగా ఒకేరోజు వస్తుంది.

ఇంకో సంగతి. ముస్లిములు అవలంబించేది కూడా చాంద్రమాన సంవత్సరమే అయినా వాళ్ళకి అధికమాసాలు లేవు. కాబట్టి వాళ్ళ నెలలు ప్రతీ ఏడాదీ ముందుకు జరిగిపోతూ మన ఇంగ్లీషు కాలెండరులోని ప్రతీ నెలనీ స్పృశిస్తూ ఉంటాయి.

మాలి said...

మీ ప్రశ్నకి సమాధానం మొత్తం చెప్పలేను కానీ, సమాధానపడదగ్గ వివరణ ఇవ్వగలను. మన మిగిలిన పండుగల తేదీలు అన్నీ చంద్రగమనం మీద లెక్కిస్తారు, సంక్రాంతి తేదీ మాత్రం సూర్యగమనం మీద ఆధారపడివుంటుంది. బహుశా అందుకనే ఆ పండుగ వచ్చే తేదీల్లో ప్రతి సంవత్సరం పెద్ద తేడా వుండదు. దీని గురించి నేను కూడా ఇంతకు ముందు ఆలోచించినా, ఈ వివరణ మాత్రం మీ ప్రశ్న చదువుతున్నపుడే స్ఫురించింది.

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

మీ ప్రశ్నా అద్భుతంగా ఉంది, దానికి వచ్చిన సమాధానాలూ అంతే గొప్పగా ఉన్నాయి. ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే సమాధానం ఇక ధైర్యంగా చెప్పచ్చు. :)

 
Clicky Web Analytics