పుస్తక ప్రదర్శన 3వ రోజు విశేషాలు

eతెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న పుస్తక ప్రదర్శన యందలి స్టాల్ యొక్క మూడొవ రోజు విశేషాలు వ్రాద్దామని రెండు రోజులనుంచి అనుకుంటున్నా, కుదరటం లేక ఇవ్వాళ ఎలాగైనా వ్రాసి ముగిద్దామని కూర్చున్నాను. వీలైన వివరంగా వ్రాస్తాను.

మూడోరోజు ప్రధమంగా నేను వెళ్ళటం జరిగింది. మూడోరోజు శనివారం అయినందున ఉదయం పదకొండు గంటలకే తెరుస్తారని చాలా సార్లు నిర్వాహకులు ప్రచారం చేసినందున ఆరోజు ఇంకొంచం ముందుగా వెళదాం అనుకున్నా, భోజనం చేసి అక్కడికి చేరుకునేటప్పటికి పన్నేండున్నర అయ్యింది. స్టాల్ మూసి ఇన్న వైనం ఎందుకో కించిత్ నచ్చక పోయినా, చేసేది లాభాపేక్ష లేకుండా కదా.. ఎవ్వరికి వీలైతే వారు మనకు కలసి వస్తారు, వీలుకాలేని వారిని ఎందుకు వీలుకాలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా అని సమర్దించుకుని, నా వంతు కర్తవ్యంగా నేను వచ్చాను కదా అనుకుని ఓదార్చుకున్నాను. అదిగో అలా మొదలైంది పుస్తక ప్రదర్శనలో మొదటి శనివారం.

అన్నీ సద్దుకుని నా అంకోపరిని నలుగురికి కనబడేటట్టు పెట్టి, కరపత్రాలను సర్ది కుర్చీలో కూలబడ్డాను. జనాలు చాలా పలుచగా వస్తూ ఉన్నారు. మెల్ల మెల్లగా ఒక్కరొక్కరూ రావటం మొదలైంది. వచ్చిన వారికి కరపత్రాలు అందిస్తూ, అడిగిన వారికి తెలిసిన విషయాన్ని తెలియజేస్తూ సాగుతుండగా, మూడున్నర వేళలో కొంచం కునుకు పట్టింది. అలాగే కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతుంటే, ఓ నడి వయస్కుడు చక్కగా నా అంకోపరిని సర్దేసే పని చేశాడు. గబుక్కున మెళకువ వచ్చింది కాబట్టి బ్రతికి పోయ్యాను. మేలుకుని అతని చేతిలో కరపత్రాన్ని ఉంచి పంపేటప్పటికి పట్టిన కునుకు కాస్తా పోయింది.

అలా గట్టేక్కిన సమయానికి మెల్ల మెల్లగా తెలుగు బ్లాగర్లు, eతెలుగు కార్యవర్గ సభ్యులు రావటం మొదలైంది. కబుర్లు చెప్పే కశ్యప్ గారు ముందుగా అక్కడికి చేరుకున్నారు. వారి వెనకాల జావాలినిక్స్ వ్రాసే కట్టా విజయ్ గారు రావటం జరిగింది. ఆనాటి విషయాలలో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే, కట్టా విజయ్ గారు తనతో తెచ్చిన ఎయిర్ టెల్ వారి ఇంటర్ నెట్ కార్డ్. దాని సహాయంతో సందర్శకులకు అంతర్జాలంలో తెలుగు ఎంత బాగా అభివృద్ది చెందుతుందో చూపించగలిగాం. అంతర్జాల సదుపాయాన్ని ఆనాడు eతెలుగు వారికి అందించినందులకు సభా ముఖంగా వారికి ధన్యవాదములు.

అదిమొదలు, ఏకలింగం పేరుతో బ్లాగే మాలికా మూలకారుకులలో ఒక్కరైన శ్రీనివాస్ గారు, శంకరాభరణం అని బ్లాగుతున్న తెలుగు మాస్టారైన కంది శంకరయ్యగారు, వారి వెనకాలే ప్రఙ్ఞ అనే శీర్షికన బ్లాగుతున్న మఱో బ్లాగరు, కోతి కొమ్మచి బ్లాగరుతో మాట్లాడుతుండగా మూడు బీర్ల తరువాత అంటూ అక్కిరాజుగారు వచ్చి కాసేపు పిచ్చాపాటి వేసారు. ఆఖర్లో అనుకుంటా ఒక మంచి మాట చెబుతానంటూ మఱో తెలుగు బ్లాగరు అప్పారావుగారు రావటం జరిగింది. మహిళా బ్లాగర్లలో చురుకుగా పాలు పంచుకుంటున్న జ్యోతిగారు కూడా ఆరోజు తళుక్కున మెరిసి అదృశ్యం అయ్యారు. వీరందరితో పాటుగా సంసృత డాక్యుమెంట్స్ వెబ్ సైట్ నకు సహకారాన్ని అందిస్తున్న గుత్తిన శ్రీనివాస్ గారు కూడా విచ్చేసి వారి అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు.

ఆనాటి చిత్రాలను ఈ లంకెలో చూడవచ్చు.

 
Clicky Web Analytics