నా చిన్నతనంలో చాలా కధలు విషయాలు మా తాతగారి వద్ద, మరికొన్ని మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్నాను. వాటిల్లోంచి ఒకటి మీ కోసం ఇలా..
ఏమిటి?? భోజనమంటున్నాను.. అలాగే భొజరాజంటున్నాను .. అనుకుంటున్నారా!!! ఈ రెండింటికీ ఎక్కడ కలుస్తుందనుకుంటున్నారా??? తలపగలు కొట్టుకోండి. ఈ రేంటికీ ఎక్కడ పొంతన లేదు. కానీ ఆహారం విషయానికొస్తే, ఈ రోజుల్లో, హైదరాబాదు వంటి నగరాల్లో.. ప్రతీ సుభకార్యానికీ, ఎక్కువగా బఫేలు పరిపాటై పోయింది. అట్లాంటి బఫె నే ఈ నాటి నా ఈ పుటకి మూల కారణం. బఫే అనబడే ఈ తంతు, నక్కని చూసి .. (అయ్యొయ్యో.. పులిని చూసి నక్క అని అనాలికదా.. ఎదోలేండి.. ) అన్నట్లుగా.. "హైదరాబాదులో మా చుట్టాలు.. క్రిందటిసారి వాళింటిలో సుభకార్యం జరిగినప్పుడు, ఇలాగే పెట్టారు .." అని ప్రక్క ఊళ్ళలో ఉన్నవారుకూడా ఇదే పద్దతిని పాటించేస్తున్నరు. అదిగో అలాగే, క్రిందటి ఏడాది, విజయవాడలో కొన్ని పెళ్ళిళకు వెళ్ళి నప్పుడు ఒకటి రెండు సార్లు, బఫె భొజనం చేసినట్లు గుర్తు.
ఇక అసలు విషయానికొస్తే.. భోజరాజుకి ఒకనాడు గొప్ప అవమానం జరిగింది. అదేమిటంటే.. తన దగ్గర పనిచేసే ఒక పరిచారకుడు రహస్యంగా ఎవ్వరికో ఉత్తరం వ్రాసుండగా, ఈ రాజుగారు చాటుగా దానిని చదవుతున్నారంట. ఇది గ్రహించిన అతను రాజుగారు చదువుతున్నరన్న విషయం, తాను గ్రహించినట్లుగా రాజుగారు పసి గట్టినట్లైతే బాగుండదు కదా అని, తెలియనట్లుగా ఉన్నట్లుంటూనే, కొంచం తుంటరిగా ఉత్తరం మధ్యలో ముగించెస్తున్ననంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఒక మనో నిబ్బరం లేని ఒక వెధవ కూడా ఈ ఉత్తరాన్ని చదువుతున్నడు కనుక మిగిలిన విషయాలు తరువాత ఉత్తరంలో వ్రాస్తానని ముగించేసాడు. అంతట ఆ రాజు గారు, తనను ఒక వెధవగా పోల్చినందులకు చింతించి, తదుపరి తన సభలోకి వచ్చే వారందరినీ, "మూర్ఖా..!!" అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. సభలోకొచ్చిన ప్రతీ వ్యక్తీ దీనికి ఆశ్చర్య చతికులై, రాజుగారికి ఎదురు చెప్పలేక, మౌనంగా ఆ అవమానాన్ని దిగ మింగు కుంటునారు. ఇది రాజుగారికి కొంత ఊరట నిచ్చినట్లైంది. ఇంతలో మహాకవి కాళిదాసుగారు రంగ ప్రవేశం చేసారు. రాజు గారు యధా ప్రకారం వీరిని కూడా.. "మూర్ఖా!!" అంటూ సంభొదిచే సరికి, మన మహాకవి గారు సంస్కృతంలో క్రింద చెప్పినట్లు చెబుతారు
ఖాద న్న గస్చామి, హాస న్న భాష్యే
గాతం న షోచామి, కృతం నా మన్యే
ద్వభాయం తృతియొ న భవాని రాజన్
కిమ్ కారణమ్ భొజ భవామి మూర్ఖః
దీని అర్ద మేమిటనిన.. నేను నడుస్తూ భుజించను, పొట్ట చెక్కలయ్యెలా నవ్వుతూ మాట్లాడను, ఇద్దరు తగువు లాడు కుంటుండగా మధ్యలో జేరి ఇద్దరి చేత వెధవగా నేననిపించుకోలేదు.. (ఇలా ఇలా ఇంకా ఎదో ఎదో అర్దం దాగి ఉంది. నాకు గుర్తున్నంత వరకూ ఇంతే.. మీలో ఎవ్వరైనా సంస్కృతం తెలిసిన వాళైతే దీని పూర్తి తాత్పర్యం తెలియజేసిన యడల చాల రుణ పడి ఉంటాను). ఇన్ని విషయాలలో నేను మూర్ఖుడిని కాదని ఋజువు అయినందున, నన్ను ఏవిధంగా మూర్ఖుడిని చేసావు .. ఓ రాజా?? అని తిరిగి ప్రశ్నించారు.
తరువాత కధ ఇప్పటికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అవసరమయిన విషయమేమిటంటే.. మూర్ఖులందరూ నడుస్తూ భొజనం చేస్తారన్నది, మహాకవి కాళిదాసుగారి అభిప్రాయం. ఈ విషయమం నాకు చిన్నపుడే నూరి పోసారు కనుక, వృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్‍లు, గట్రా గట్రా, వగైరా వగైరా వంటి వాటికి వెళ్ళ వలసి వచ్చినప్పుడు, చక్కగా ఒక మూల చూసుకుని, చేతిలోని ప్లేటుని దానిమీద పెట్టుకుని భొంచేస్తాను. ఇంతే కాకుండా, మా కార్యాలయంలో నా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బల్ల నేను వెళ్ళే సమయానికి సిద్దంగా ఉంటుంది.
మొన్నీ మధ్య, ఎవ్వరి బ్లాగులోనో ఒక విషయాని ప్రస్తావించడం జరిగింది. దానిని ఇక్కడ మరొక్క సారి సవినయంగా మీతో పంచుకుంటాను..
ఎలాగోలా బ్రతికేయ్యాలంటే, ఎలాగైనా బ్రతికేయ్యవచ్చు. కానీ ఇలాగే బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలన్నీ..
ఏమంటారు?
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి