ఆహా .. ఏమి పరిణామము, ఎంతటి శుభవార్త

గూగుల్ గుంపులలో ఉద్యోగ వార్తల నిమిత్తం it-consult​ing-us-sta​ffing అనే పేరుతో ఓ గుంపు నడుస్తోంది. ఈ గుంపు నందు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ ఉంటారు. దాదాపుగా ఎక్కువశాతం అవకాశాలు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉండే సంస్థలకు సంబందించినవై ఉంటాయి. అలాంటి చోట ఇవ్వాళ్ళ నాకు ఆశ్చర్యపరచే విధంగా ఓ ప్రకటన కనబడింది. అదేమిటంటే..

Topic: Requirements for SQL Server Developer,Teradata Developer :Vijayawada

ఇలాంటి ప్రకటన ఇలాంటి చోట ఇవ్వడం ముందుగా కొంచం అతి చేసినట్లు అనిపించవచ్చు. కానీ ఈ ప్రకటన ఇచ్చిన వారి వెబ్ సైట్ మరియు వారి వివరాలు చూసిన తరువాత ఈ ప్రకటన వెనకాల ఎంతో కొంత నిజాయతీ ఉండకపోదు అనిపించింది. ఇక్కడ నన్ను ఆశ్చర్య పరచిన మరియు సంతోషానికి గురిచేసిన విషయాలు..

మొదటిది, విజయవాడ కూడా సాఫ్ట్ వేరు నిపుణలకు అవకాశాలనిస్తున్నది అని.

రెండవది, విజయవాడ లాంటి చిన్నపట్టణంలోని ఓ సంస్థ అంతర్జాతీయ స్థాయికెదిగి ఆ స్థాయిలోని నిపుణలకు అవకాశాలిస్తామంటూ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడం. ఇవన్నీ చూడబోతే సాప్ట్ వేరు రంగం తొందరలో విజయవాడలో ఓ వెలుగు వెలగబోతున్నట్లు కనబడుతోంది. ఆహా, ఆలోచనే ఎంతటి హాయినిస్తోంది. ఇవన్నీ కనుక జరిగితే, చక్కగా నాలాంటి వాడు జీతం తక్కువైనా మావూరు చేరుకుంటారు.

ముంగించే ముందు ESS సంస్థ వారికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నందులకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ వీరు మరింతగా అభివృద్ది చెంది మరింత ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలిస్తే భారతదేశంలో విద్వత్తు ఉన్న యువత పరదేశ మోజులో పడి మాతృదేశానికి దూరం కాకుండా చేసిన వారౌతారని ఆశిస్తున్నాను.

ఎండా కాలంలో వర్షాలు !!

ఈ నెలలో ఇప్పటికి ఇది మూడవ సారి నేను వర్షాల గురించి వినడం. మొన్నా మధ్య భాగ్యనగరంలో చిరుజల్లుతో మొదలై కుండపోతగా ఓ రోజు పుల్లుగా కురిసేసింది. దానికి తోడుగా నిన్న జరగాల్సిన IPL మాచ్ వర్షం కారణంగా కొంతసేపు పోస్ట్ పోన్ అయ్యింది. ఇరవై ఓవర్లు జరగాల్సిన మాచ్‌ని పదిహేడు ఓవర్లకు కుదించినందువల్ల చెన్నై సూపర్ కింగ్స్ వారు నూటముప్పై ఒక్క పరుగులే చేయడం కోచీ టస్కర్స్ వారికి అనుకూలించింది. చక్కగా కోచీ వారు పదిహేడు ఓవర్లలో కొట్టాల్సిన దానిని పదిహేను ఓవర్లలోనే సాధించి గెలిచేసారు. ఇదంతా వరుణుడి వల్లనే అని నా అభిప్రాయం.

వీటికి తోడుగా ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ మరియు రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కూడా ఆలస్యంగా మొదలౌబోతోంది. దీనికి కారణం కూడా వర్షమే. ఈ మ్యాచ్ మొదలౌతుందో లేదో అనేది అనుమానమే. వాతావరణ శాఖ వారి వివరం ప్రకారం, IPL మ్యాచ్ లలో చాలా వాటికి వర్ష బెడద ఉండేటట్టు ఉంది. దీనికి తోడుగా రేపు కొలకత్తాలో జరగనున్న మ్యాచ్, కోచీ టస్కర్స్ మరియు కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఆటకూ వర్షం ఆటంకం కానుంది. ఇంతే అనుకుంటే, వచ్చే ఆదివారం భాగ్యనగరంలో జరగనున్న మ్యాచ్, డక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగే ఆటకు కూడా వర్షం ఆటంకం కానుంది.

ఇవన్నీ ప్రక్కన పెడితే, ఎండా కాలంలో వర్షాలు అనే ఆలోచన వింతగా ఉంది. ఇదేమైనా క్లైమేట్ షిఫ్ట్ (వాతావరణ / ఋతువుల కదలిక) అని మనం అనుకోవచ్చా? కొంత కాలం అయితే ఏప్రియల్ నెల నుంచి వర్షాకాలం మొదలై ఎండాకాలం జనవరి నుంచి ఉంటుంది అని అనుకోవచ్చా!! ఏమో ఇలాంటి ఆలోచనే క్రొత్తగా ఉంది. ఇలా ఆలోచించాలంటేనే భయంగా ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్లు? ఏమో ఈ పీత బుర్రకి అంతు పట్టటం లేదు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త

ఓ పెద్ద ఫ్లాప్, కొమరం పులి నుంచి బయట పడి, కొత్తగా రిలీజ్ అవుతున్న తీన్‍మార్ సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త. కొమరం పులి పాటల గురించి ఓ రివ్యు ఇంతకు ముందు వ్రాసాను. అది నేను వ్రాసిన మొదటి పాటల రివ్యు. స్వతహగా నేను సినిమాలు చూడాలనుకోను, కానీ ఏదైనా సినిమా నేను చూడాలనుకుంటే.. అంతే సంగతులు.. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందే.

అలా నేను చూడాలనుకున్నానంటే అది ఖచ్చితంగా ఫ్లాపే అని చాలా సార్లు ఋజువైంది. కొమరం పులి సినిమా విషయంలో కూడా ఇది నిజమైంది. కాకపోతే కొత్తగా వచ్చే తీన్‍మార్ సినిమా విషయంలో నేను చూడాలనుకోవటం లేదు. అన్నంత మాత్రాన ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేను కానీ, ఫ్లాప్ మాత్రం కాదు. అంటే, నిర్మాతకు నష్టం లేదు అన్నమాట.

ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక శుభవార్తే అని నా అభిప్రాయం. ఈ పుట చదివిన వారిలో పవన్ అభిమానులెవ్వరైనా ఉంటే, స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.

 
Clicky Web Analytics