తెలంగాణా వాదులూ.. మీకు అన్యాయం జరిగిపోతోంది

ఇవ్వాళ ఉదయం ఇంట్లో టిఫిన్ ఆలశ్యం అయ్యేటప్పటికి, బయటికి వెళ్ళి తిందాం అని బయలుదేరాను. ప్రస్తుతం నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను కదా, అదో పెద్ద చెత్త కుండి అని ఆలశ్యంగా తెలిసింది. ఉదయం వేళల్లో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళితే ఓ చోట చాలా మందు గుమ్మి కూడి ఉన్నారు. ఏంటిదిరా, అనుకుంటూ కొంచం నిశితంగా పరిశీలిస్తే అప్పుడు అర్దం అయ్యింది అక్కడ గుమ్మి కూడి ఉన్న వారంతా టిఫిన్ కోసం అని.

చూడబోతే అదో పెద్ద పద్మ వ్యూహంలా ఉంది. దానిని ఎలాగో ఒకలా ఛేదించుకుని టోకెన్లు ఇచ్చే వాడి వద్దకు వెళ్ళి ఇడ్లీ టొకెన్ అడిగాను. ఏదో పేద్ద తప్పు చేసినట్లు వాడో లుక్కు ఇచ్చాడు. తీరా విషయం ఏమిటంటే అక్కడ ఇడ్లీల కన్నా పూరీలు ఫేమస్. సరే నా భార్యకు పూరీ అంటే ఇష్టం కదా అని ఓ ప్లేట్ పూరీ కట్టించుకుని నేను తినడానికి ఏమి ఉందన్నాను. ’అక్కడ బొండాలున్నాయి పోయి ఏది కావాలో పెట్టించుకుని తిను..’ అని ఓ డైలాగ్ వేశాడు.

సరే కదా అని ఆ ప్రక్కనే ఉన్న సర్వింగ్ టేబుల్ వాడి దగ్గరకు వెళ్ళి బాబూ ఓరెండు బోండాలివ్వు అన్నాను. ఏ బోండా కావాలి అన్నాడు? అప్పుడు నా గొంతులో వెలక్కాయ పడింది. బోండాలో రకాలా !! ఏమిటబ్బా ఆ రకాలు అని తేరిపారా చూశాను. అక్కడ రొండు రకాల బోండాలు కనబడ్డాయి. ఒకటి బాగా వేయించ బడి అచ్చం వెజ్ మంచూరియాలా కరకర లాడే రకంగా గరుకుగా పెద్ద సైజు జామకాయ లాగా కనబడింది. అంటే అది వెజ్ మంచూరియా అంత సైజు లేదు కానీ అంతకు ఓ రెండు మూడింతలు సైజు పెద్దగా ఉంది. మఱొకటి కొంచం లేతగా దోరగా వేయించినట్లు నున్నగా నాజూకుగా మగ్గిన సపోటాలా ఉంది.

ఇంతకీ ఏమిటా అవి అనిడిగితే, దోరగా వేయించినట్లున్న దానిని మైసూర్ బోండా అంటారండీ అన్నాడు. మరి మరోదేమిటి అని అడిగితే వాడిచ్చిన సమాధానమే ఈ పోస్టుకి మూలాధారం. దానిని .. అంద్రా బోండా అంటారంట. గేందిరా ఇది, ఈడకొచ్చి ఈడ కొట్టేటి ఈడ అమ్ముకుంటూ ఆంద్రా అంటావ్ .. గిసంటుదే మరోటి సెయ్యాలా.. గసొంటి దానికి తెలంగాణా బొండా అని పేరట్టాలా. ఏమంటార్ ర్రా.. మీకు సానా అన్నాయం సేత్తుండ్రు. తినే తిండికాడ గూడా మీకు హాక్కు లే? దీన్ని మీరందరూ గల్సి కండిచాలే, గా పేరెట్టినోడ్ని బొక్కల్ చూరజూర నూకల్న. గపుటిదాఁక నేను బొండా దిన. బిడ్డా నీ తెలంగాణా బొండామీదొట్టు

 
Clicky Web Analytics