తెలంగాణా వాదులూ.. మీకు అన్యాయం జరిగిపోతోంది

ఇవ్వాళ ఉదయం ఇంట్లో టిఫిన్ ఆలశ్యం అయ్యేటప్పటికి, బయటికి వెళ్ళి తిందాం అని బయలుదేరాను. ప్రస్తుతం నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను కదా, అదో పెద్ద చెత్త కుండి అని ఆలశ్యంగా తెలిసింది. ఉదయం వేళల్లో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళితే ఓ చోట చాలా మందు గుమ్మి కూడి ఉన్నారు. ఏంటిదిరా, అనుకుంటూ కొంచం నిశితంగా పరిశీలిస్తే అప్పుడు అర్దం అయ్యింది అక్కడ గుమ్మి కూడి ఉన్న వారంతా టిఫిన్ కోసం అని.

చూడబోతే అదో పెద్ద పద్మ వ్యూహంలా ఉంది. దానిని ఎలాగో ఒకలా ఛేదించుకుని టోకెన్లు ఇచ్చే వాడి వద్దకు వెళ్ళి ఇడ్లీ టొకెన్ అడిగాను. ఏదో పేద్ద తప్పు చేసినట్లు వాడో లుక్కు ఇచ్చాడు. తీరా విషయం ఏమిటంటే అక్కడ ఇడ్లీల కన్నా పూరీలు ఫేమస్. సరే నా భార్యకు పూరీ అంటే ఇష్టం కదా అని ఓ ప్లేట్ పూరీ కట్టించుకుని నేను తినడానికి ఏమి ఉందన్నాను. ’అక్కడ బొండాలున్నాయి పోయి ఏది కావాలో పెట్టించుకుని తిను..’ అని ఓ డైలాగ్ వేశాడు.

సరే కదా అని ఆ ప్రక్కనే ఉన్న సర్వింగ్ టేబుల్ వాడి దగ్గరకు వెళ్ళి బాబూ ఓరెండు బోండాలివ్వు అన్నాను. ఏ బోండా కావాలి అన్నాడు? అప్పుడు నా గొంతులో వెలక్కాయ పడింది. బోండాలో రకాలా !! ఏమిటబ్బా ఆ రకాలు అని తేరిపారా చూశాను. అక్కడ రొండు రకాల బోండాలు కనబడ్డాయి. ఒకటి బాగా వేయించ బడి అచ్చం వెజ్ మంచూరియాలా కరకర లాడే రకంగా గరుకుగా పెద్ద సైజు జామకాయ లాగా కనబడింది. అంటే అది వెజ్ మంచూరియా అంత సైజు లేదు కానీ అంతకు ఓ రెండు మూడింతలు సైజు పెద్దగా ఉంది. మఱొకటి కొంచం లేతగా దోరగా వేయించినట్లు నున్నగా నాజూకుగా మగ్గిన సపోటాలా ఉంది.

ఇంతకీ ఏమిటా అవి అనిడిగితే, దోరగా వేయించినట్లున్న దానిని మైసూర్ బోండా అంటారండీ అన్నాడు. మరి మరోదేమిటి అని అడిగితే వాడిచ్చిన సమాధానమే ఈ పోస్టుకి మూలాధారం. దానిని .. అంద్రా బోండా అంటారంట. గేందిరా ఇది, ఈడకొచ్చి ఈడ కొట్టేటి ఈడ అమ్ముకుంటూ ఆంద్రా అంటావ్ .. గిసంటుదే మరోటి సెయ్యాలా.. గసొంటి దానికి తెలంగాణా బొండా అని పేరట్టాలా. ఏమంటార్ ర్రా.. మీకు సానా అన్నాయం సేత్తుండ్రు. తినే తిండికాడ గూడా మీకు హాక్కు లే? దీన్ని మీరందరూ గల్సి కండిచాలే, గా పేరెట్టినోడ్ని బొక్కల్ చూరజూర నూకల్న. గపుటిదాఁక నేను బొండా దిన. బిడ్డా నీ తెలంగాణా బొండామీదొట్టు

20 స్పందనలు:

John said...

గింతన్యాయమా ? వెంటనే తెలంగానా బోండా లు షురూ చేసేట్టు పార్లమెంట్ల బిల్లు పెట్టాల...

గంతే..

తెలుగు పాటలు said...

vethikite anni tappule kanapadutayi

Anonymous said...

సార్ ఇలాంటి జోకులే తెలంగాణా వాల్లని రెచ్చగ్ల్డుతున్నయేమో?

చక్రవర్తి said...

జాన్ గారు,

హాస్యాన్ని హాస్యంగా తీసుకుని స్పందించినందులకు ధన్యవాదములు.

తెలుగు పాటలు పేరుతో వ్రాస్తున్న వారికి,
నిజమేనండి వెతికితే అన్నింటియందూ దోషాలు కనబడతాయి. కానీ ఈ విషయం ఇక్కడ వ్రాసింది హాస్యప్రధానంగా మాత్రమే అని నా అభిప్రాయం. కావున తప్పుగా వ్రాయలేదనుకుంటున్నాను. వ్రాసానని మీకు అనిపిస్తే మన్నించండి.

అఙ్ఞాత గారు,
ఇలాంటి జోకులకే రెచ్చి పోతున్నారని మీరనుకుంటే, ఇలాంటి జోకులు వీరు రెచ్చి పోతున్నారనే వచ్చాయని మీరు గమనించాలి. పిచ్చితగ్గితే పెళ్ళౌతుంది, పెళ్ళైతే గాని పిచ్చి తగ్గదు అని నానుడి ఇలాంటి సందర్బంలో గుర్తుకు వస్తుంది.

Anonymous said...

కూకట్పల్లిని చెత్తకుండి చేసిందెవరు? మీ ఆంధ్రోల్లు కాదా?

చక్రవర్తి said...

రెండో అఙ్ఞాత గారు,

ఏంటి "మీ ఆంధ్రోల్లు" అంటున్నారు.. మీరు ఆంద్రులు కారా!!

Anonymous said...

చెత్తకుండీలో వుంటూ టిఫిన్లు వెతుక్కోవడమేమిటో అర్థం కాలేదు.

చక్రవర్తి said...

టిఫిన్ కోసం వెతుక్కుంటూ వెళితేనే అర్దం అయ్యింది నేను ఉన్నది చెత్త చోట్లో అని.

Anonymous said...

అవ్ మళ్ళ, గీ ఆంధ్రోళ్ళు గీ కూకట్ పల్లినే చెత్తకుప్ప జేసిండ్రు.మరి మన కచరా&కొ పూరా ఆంధ్రప్రదేశ్నే చెత్తకుప్పజేసిండ్రు.మన రాష్ట్రమ్ ఇజ్జత్,గుడ్విల్,భవిష్యత్,ప్రశాంతత,అభివృద్ధి,పారిశ్రామిక,పెట్టుబడి వాతావరణం అని గల్పి మూసినదిలో ముంచినంగాదే. ఎవ్వల్ గొప్ప మన తెలబానులే గొప్ప. మనం క్రీస్తు పుట్టకముందు నుంచి గిన్తెగదన్న, చల్ మనం టి.న్యూస్ జూసుకుంటా,నమస్తే తెలంగాణా పేపర్ జడువుకుంటా,నిజామ్కి సలాంలు గోట్టుకుంటా గడ్పుదం.

Anonymous said...

Finally you posted something meaningful Mr. Chakri. keep it up

చక్రవర్తి said...

సూటిగా అంటూ వ్రాసే తెలుగు బ్లాగర్ గారికి,
మీ తెలంగాణా భాణి బాగుంది. మొన్నామధ్య తెలంగాణా పేపర్లో మిమ్మల్నే అనుకుంటా చూసింది. స్పందించినందులకు ధన్యవాదములు

నాలుగో అఙ్ఞాత గారు,
ముందుగాఁ నన్ను చక్రి అని సంబోదించడానికి నేను అనుమతించను. ఎందుకంటే, ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు ఎందెందు వెదకినా అందందే గలఁడు.. చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశిపునికి చెప్పినప్పుడు ప్రహ్లాదుని మాట ఒమ్ము చేయకుండా స్థంబం వైపు చూపించిన చేయిని సత్యం చేస్తూ స్థంబంలోంచి బయటకు వచ్చారు నృశింహ స్వామి. కాబట్టి చక్రి అనే సంబోదన శ్రీ మహా విష్ణువునకే సబబు అని నా అభిప్రాయం. కావున నా అభిప్రాయాన్ని మన్నించి నన్ను చక్కగా చక్రవర్తి అని పిలువ గలరు.

ఆఖరిగా నన్ను మెచ్చుకున్నందులకు ధన్యవాదములు.

Vinod Kumar Naik Bukke said...

ఇంకా బొంబాయ్ రవ్వ, బెంగుళూరు మిరపకాయ, సింగపూర్ కాలని, విజయవాడ రుచులు, నెల్లూరు వారి వంటలు, చైనీస్ ఫుడ్స్, .. ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత లిస్టు ఉంది. అయిన తెలంగాణా వాళ్ళను మోసం చెయ్యని ఎదవెవ్వడు బాసు ...

చక్రవర్తి said...

వినోద్ గారికి,

మొట్ట మొదటగా, అయ్యా!! ఇది హాస్యప్రధానంగా వ్రాయబడినది అని గమనించండి. కాబట్టి ఎదవలగురించి మనకు అనవసరం. ఎదవ తనంగురించి అస్సలు అనవసరం. ఎదవ అనే విషయం కూడా అప్రస్తుతం. నా ఉద్దేశ్యంలో ఇది అచ్చంగా హాస్యాన్ని చూపటంలో వ్రాయబడినది కావున దీనిని ప్రక్కత్రోవ పట్టించ కుండా అలాగే పరుషములైన మాటలు వాడకుండా స్పందించ మనవి.
అర్దం చేసుకుంటారని అనుకుంటూ, స్పందించినందులకు ధన్యవాదములు

Vinod Kumar Naik Bukke said...

@చక్రవర్తి
ఎxవ అన్న పదం తో ఎన్ని జోకులు, సీన్లు రాలేదు .....
ఇది ఒక ప్రాంతీయతా భావాన్ని కించపరచడానికి కాదని కేవలం హాస్యం కోసం మాత్రమే అని పోస్టులో మీరు గమనికగా ఇచ్చి ఉంటె కామెంట్లలో సంజాయిషీ చెప్పడం అవసరమయ్యేది కాదనుకుంటా....
ఇకపోతే ఈ అంశంలో హాస్యానికి మూలాధారమయిన బోండా గురించి మీరు చెబితే , ఇంకా ఇవి కూడా ఉన్నాయని చేబుదామనే నా ఉద్దేశ్యం. కాని త్రప్పు దోవ పట్టించాలని కాదు. పొరబాటున ఎ_వ దోర్లేసింది మాస్టారు. మీరు హార్ట్ అయితే నన్ను క్షమించండి.

చివరగా ....
మీరు అయ్యా అని సంభోదించడం లోని ఉద్దేశ్యం నేను తెలంగాణా వాడిని అయివుంటాను అనేమో..?! కానీ నేను వాణ్ని కాదు.

గమనిక:
* ఎ_వతనం కూడా ఇక్కడ అప్రస్తుతం అని మీరు గమనించలేదా....

Vinod Kumar Naik Bukke said...

మర్చిపోయా ....
లేబుల్స్ లో తెలంగాణా అని పెట్టకుండా వెటకారం, చమత్కారం అని పెట్టిన మీ సంస్కారానికి నిజంగా హ్యాట్సాఫ్ ....
మీరు స్వచ్చంగా హాస్యాన్ని పండించారు. దానికి నిదర్శనం మీ లేబుల్స్.

చక్రవర్తి said...

వినోద్ గారు,

పొరపాటుని గ్రహించినందులకు ధన్యుడను. కాకపోతే నేను ఎవ్వరి మనోభావాలను దెబ్బతీసేవిగా ఉండకుంటే బాగుంటుందని నా అభిప్రాయాన్ని తెలియజేసాను. ఇక్కడ ఇంతవరకే వ్రాస్తాను, మరింత ముందుకు వెళ్ళను. ఆఖరిగా లేబుళ్లను గమనించినందులకు మిమ్ములను మెచ్చుకోలేకుండా ఉండ లేను, అలాగే ఇది ఓ ఆటవిడుపు మాత్రమే సుమా!!
వివరణ ఇచ్చి మీ ఆంతర్యాన్ని తెలియజేసినందులకు మీకు థాంక్స్

Anonymous said...

తెలంగాణ బోండా తింటే తెలంగాణ ఇస్తరా సారూ? గెప్పుడిస్తరు?

చక్రవర్తి said...

ఐదో అఙ్ఞాత గారు,

నా ఉద్దేశ్యం తెలంగాణా బోండా లేదని కాని, తెలంగాణాకు సంబందించినది కాదు సుమా.. తెలంగాణా గురించి నన్నడక్కు. దాని గురించి నాకేమీతెలియదు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణా బోండా ఎక్కడ ఉందో చెప్పు, దాని గురించి చర్చిద్దాం

Jai Gottimukkala said...

చక్రవర్తి గారూ, మీరు రాసింది హాస్యానికే కావచ్చు. కానీ ఇదే అదునుగా తెలంగాణా వారిని, వారి సంస్కృతిని కించపరిచే బ్లాగోత్తములకు మంచి అవకాశం కల్పించారు.

FYI the guy who calls himself "Sootigaa" is not from Telangana. Similarly his contrived attempt at mimicking Telangana language is fake too.

చక్రవర్తి said...

జై గారు,

స్వతహాగా నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. కానీ ఎందుకో నాకు తెలియకుండానే ఈ విషయం బ్లాగడం జరిగింది. ఇకపై ఇలా కించపరిచే బ్లాగర్లు అవకాశం లేకుండా చూసుకుంటాను. స్పందించి మీ మనోభావాన్ని తెలియజేసినందులకు ధన్యవాదములు

 
Clicky Web Analytics