ఈ మధ్య నాలో రేగుతున్న కొన్ని మానసిక అలజడులలో ఒకటి, పైన చెప్పిన అంశం. అస్సలు మంచి అంటే ఏమిటి? దేన్ని చెడుగా తలుచుకోవాలి? ఎవ్వరు చేసిన పనులు మంచి పనులు? ఎవ్వరు చేసేవి చెడువి? అస్సలు .. మంచి చెడు అనేటటువంటివి ఎవ్వరైనా ఒక వ్యక్తికి సంభందించినవా లేక వాటికంటూ కొన్ని గుణ గణాలున్నాయా?
ఎవ్వరిని చూసి మనం మంచి వాళ్ళు అని చెప్పచ్చు? ఎవ్వరిని చెడ్డవాళ్ళనవచ్చు? వలబోజు జ్యోతిగారు ఉదహరించినట్లు, రాముడిని ఏవిధంగా మంచి వాడిగా అనుకోవాలీ? జ్యోతిగారి ప్రచురణకు స్పందించిన తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు తెలియజేసినట్లు, ఎకాలంలో వాళ్ళని ఆ యా కాలాలనుగుణంగా మాత్రమే మనం చర్చించు కోవాలి కానీ, వివిధ కాలాలలో చర్చించ కూడదన్నట్లు, మంచి చెడులు కాలాను గుణాలా?
జ్యోతిగారు ప్రచురించిన, ’పురాణాలు ఏం చెబుతున్నాయి’ పుట ఏప్రియల్ 25వ తారీఖునైతే.. నేను ఏప్రియల్ 10వ తారీఖున, ’ఎల్ వీ ప్రసాదు గారి పై నా అభిప్రాయా’న్ని ప్రచురించాను. ఇది చదివిన తరువాత, మా అమ్మకీ నాకు జరిగిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు కూడా నన్ను కలవర పెట్టాయి. అమ్మ వాదనకి నేను మూగ వాడినై పోయా. రామాయణం లోని కొన్ని ఘటనలను జ్యోతిగారు ఉదాహరణగా తీసుకుంటే, అదే రామాయణం లోని మరికొన్ని విషయాలను అమ్మ ఉదహరించింది.
మొదటగా: కుశ లవులు రామనామ జపం చేసుకుంటూ అయోధ్య చేరుకుంటే, దాని వెనుక ఆంతర్యమేమిటి? దీనికి నాదగ్గరున్న సమాధానమేమిటంటే.. (నాదగ్గరే కాకుండా ఎంతో మంది లవకుశ సినిమా చూసే ఉంటారు) పిల్లలిద్దరికీ ఇక తండ్రి అవసరం ఆసన్నమైంది. ఇంక సీతా అమ్మవారి పాత్ర ఇక్కడితో ముగించేయ్యాలి కాబట్టి. మా అమ్మ వేసిన ఒకే ఒక ప్రశ్నేమిటంటే.. పసి పిల్లలను ఒంటరిగా వదిలేసి తాను మాత్రం తన తల్లి దగ్గరకు పోవచ్చా.. ఈ పిల్లలకు మాత్రం తల్లి అక్కరలేదా.. తల్లికొక న్యాయం .. పిల్లల కొక న్యాయం.. ఎంత విచిత్రం.. ఇది ఏవిధంగా న్యాయం. ఇట్టి విషయాన్ని మనం మంచి విషయంగా తలంచుకోవాలా.. లేక తల్లులకొక న్యాయం, పిల్లలకొక న్యాయంగా వ్యవహరించడాన్ని ఆయుగ మంచి, ఈ యుగ చెడుగా తలంచుకోవాలా??
రెండవది: మగవాళ్ళెప్పుడూ శాసించడమేనా.. అర్దం చేసుకునే పని లేదా? నువ్వు నిప్పుల్లోకి దూకు అనగానే సీతా అమ్మవారు, దూకేయ్యాలా!!!! ఎంతటి నిరంకుశత్వం. ఏం నేనెందుకు దూకాలీ, ఉరూ పేరూ లేని ఒక అనామకుడు నిందవేయ్యగానే భార్య శీలాన్ని శంకించాలా? అదే సీతా అమ్మ వారు, నీ శీలం సంగతేమిటని ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేది. ఇది జరగలేదు, సరే.. అస్సలు ఎదైనా చెప్పే ముందు మనం పాటించాలి అని అంటారు కదా. మరి శ్రీరాములు వారు ఎందుకు అగ్ని ప్రవేశం చెయ్యలేదు? తాను పాటించి నిరూపించుకున్న తరువాత అడిగి ఉంటే బాగుండును కదా?
ఇలా .. ఎన్నో.. మరెన్నో.. ఎమో!! ఇలాంటి వాటిని అర్దం చేసుకునేంత బుర్ర నాకు ఆ దేవుడు ప్రసాదించ లేదు. వీటన్నింటినీ ఆలోచించిన తరువాత, నాకు ఒక్క ముక్క అర్దం మయ్యింది.
మంచి చెడు అనేటటువంటివి, ప్రతీ వ్యక్తి ఇష్టాయిష్టాలే తప్ప మరొకటి కాదని. మనకి ఇష్ట మయితే అది మంచిది, మనకు కష్టమయ్యి అయిష్టమయితే అది చెడ్డది. That's it, very simple.
Good and Bad are nothing but Like and Dislike
1 స్పందనలు:
కాలంతో పాటుగా మంచి, చెడ్డలుగా భావించబడే ‘విలువలు’ మారుతూ ఉంటాయి. మన కాలంలో మంచిగా పరిగణించబడేదాన్ని తప్పకుండా స్వీకరించి అనుసరించవలసిందే. అలాగే చెడ్డగా భావించబడేదాని జోలికి పోకుండా ఉండవలసిందే. అసలు మంచేదో చెడేదో నాకు తెలియనే తెలియదు అనగలగడం సాహసమే అవుతుంది.
బహుశా మీ ప్రశ్న మంచి చెడ్డలకి ప్రమాణమేమిటి అని. పురాణాలు మొదలైనవాటిని నమ్మితే మంచిదే. అవి చదవగా వచ్చే ధర్మ సందేహాలు తీర్చడానికి చాలా వ్యాఖ్యానాలే ఉన్నాయి. అవి అర్ధం కాకపోయినా, నచ్చకపోయినా మంచి అన్నదాన్ని ఆచరించదలచుకున్నవాళ్ళకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. వాటివల్ల కన్ఫ్యూజన్ మాత్రమే కలుగుతూ ఉంటే, పురాణాల్ని పక్కనపెట్టి మనం ఎరిగిన, నమ్మిన మంచిని ఆచరించుకోవచ్చు.
నా ఉద్దేశ్యం ప్రకారం సీత అగ్నిప్రవేశం చాలా అపార్ధం చేసుకోబడిన ఘట్టం. వాల్మీకంలో నాకు గుర్తు ఉన్నంతవరకూ రాముడు సీతని అగ్ని ప్రవేశం ఏమీ చెయ్యమనలేదు. ఆయన చెప్పింది ఇదీ. సీత బలవంతంగా ఎత్తుకొని పోబడింది కాబట్టి వాళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తాను ఏకపత్నీవ్రతుడు కనుక మళ్ళీ వివాహం చేసుకోడు. సీత వానరుల్లోగాని, రాక్షసుల్లోగాని, ఆఖరికి లక్ష్మణుణ్ణైనా గాని మళ్ళా వివాహం చేసుకోవచ్చు. రాముడలా అంటే సీత, నువ్వు లేని బతుకు నాకు లేదు, నేను జీవితాన్ని చాలిస్తానని అంటుంది. ఆరకంగా అగ్నిలో పడి మరణించడానికి ఆవిడ సిద్ధమైంది. అగ్ని ఆవిడని దహించకుండా తిరిగి రాముడికి అప్పగించడం వేరే సంగతి. ఏ రకంగా చూసినా ఈ ఘట్టంలో రాముడు చాలా ధర్మంగా ప్రవర్తించాడనీ, సీతకి అసాధారణమైన స్వేచ్ఛ ఇచ్చాడనీ అనిపిస్తుంది. ఈరోజుల్లో కూడా ఎవరూ ఒకే వివాహబంధానికి కట్టుబడి, అది విచ్ఛిన్నమైతే, ఆ స్త్రీకి మళ్ళా తనకి నచ్చిన వాళ్ళని వివాహం చేసుకొనే స్వేచ్ఛ ఇవ్వడం అన్నది ఊహించలేని విషయం. రాముడు కూడా ఏ అగ్ని సాక్షిగా తాను వివాహమాడాడో అదే అగ్ని వచ్చి నీ వివాహం విఛ్చిన్నం కాలేదని చెప్పాడు కాబట్టి మళ్ళీ అదే బంధానికి కట్టుబడ్డాడు.
పురాణాదుల్ని పక్కనపెట్టినా కూడా, నైతిక విలువలు అనేవాటికి ఒక ఖచ్చితమైన భౌతిక ప్రాతిపదిక ఉన్నదనీ, వాటికి మతాలతో ఏమీ సంబంధం లేదనీ సైంటిస్టులు చెప్తున్నారు. ఏ పరిణామ సిద్ధాంతం ప్రకారమైతే మనమందరం జంతువుల్లోంచి పుట్టామో, అదే పరిణామ ప్రక్రియ మన మెదళ్ళలో ‘నైతిక విలువలు’ అనేవాటిని హార్డ్ వైర్ చేసింది. కాబట్టి ఏది మంచో, ఏది చెడో నాకు తెలియడం లేదు, మతగ్రంథాల్లో హత్య చెయ్యమని ఉంది కాబట్టి (అలా ఉండదనుకోండి, అలా అర్ధం చేసుకున్న వాడి సంగతి నేను చెప్పేది) నేను హత్య చేస్తాను అంటే ఏమీ కుదరదు. మనం చెయ్యీ కాలూ ఆడించడం ఎంత సహజమో మన మెదడుకి నైతిక విలువలు తెలియడం కూడా అంత సహజం - సైన్సు ప్రకారం కూడా.
Post a Comment