ఈ మధ్య నేను మొదలు పెట్టిన పరిశోధనా అంశం, ’తెలుగు బ్లాగులు చదివే (తెలుగు)వారు ఏ ఏ ప్రదేసాలలో ఉన్నారు’. ఇక్కడ చదివేవారు అని మీరు అర్దం చేసుకోవాలి, చదివే ప్రతీవారూ తెలుగువారు అవుతారా లేదా అన్నది నా పీత బుర్రకి అందని విషయం. ఎందుకంటే, ఈ రోజుల్లో మిశ్రమ భాషా తల్లి తండ్రులు ఉన్నతరం మనది. తల్లిగారిది తెలుగైతే, తండ్రి గారిదేమో తమిళం. అలాగే ఇదే తంతు అటుదిటుగా అవ్వనూ వచ్చు. అందుకని, ఎవ్వరు ఏభాషా కోవిదులైనా, నావరకూ మాత్రం వారు తెలుగు ప్రచురణలు చదవగలిగారా లేదా అన్నది మాత్రమే.
ప్రస్తుత విషయానికొస్తే, నేను బ్లాగు ప్రపంచంలో ఇంకా చిన్న వాడినే. కానీ బ్లాగు చదివే ప్రపంచంలో మాత్రం పెద్దవాడిని కాకపోయినా, చిన్న వాడిని మాత్రం కాదు. ఎడా పెడా ఏది పడితే అది చదివేస్తూ ఉంటాను.. చదివిన ప్రతీదీ అర్దమవ్వాలన్న రూల్ ఏమీ లేదు కదా. అట్లాగే, చాలా చదువుతూ ఉంటాను, చాలా చాలా మరచి పోతుంటాను. కాబట్టి, చదివిన ప్రతీ విషయం గుర్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించకుండా, నా మది ఇష్టానికే వదిలేస్తా.. కావాలని గుర్తు పెట్టుకోను. అలాగే కావాలని మరచిపోనూ.
నాలాగే, ఎంత మంది బ్లాగులు చదువుతున్నారో అన్న ఆలోచన రాక ముందు, నా బ్లాగును ఎంత మంది చదువుతున్నారా అన్న కుతూహలం కలిగింది. అంతే.. అన్నదే తడవుగా, ఉచిత బ్లాగు కౌంటర్ల వెంట పడ్డా. ఇష్టమొచ్చిన వాటన్నీంటినీ నా బ్లాగుకు తగిలించేసా. తగిలించిందే తడవుగా, వాటి పని అవి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఇంత వరకూ బాగానే జరిగింది. ఈ మధ్యనే నా బ్లాగు వెయ్యి సార్లు కొట్టించు కొంది. ఈ సహస్ర హిట్ల ప్రయాణం గురించి నేను గమనించే లోపుల, కూడలి పిచ్చా పాటిలో ఎవ్వరో ధన్యవాదాలు తెలియజేసారు. ఇదీ ఆనందించ వలసిన విషయమే. కానీ.. ప్రతీ నాణానికీ రెండు వైపులున్నట్లుగా, నా వెయ్యి హిట్ల ప్రవహసానికీ నెగెటివ్ ఆలోచనను ఆకట్టారు సదురు ఓ బ్లాగరు. మన బ్లాగుకి మనమే హిట్లు కొట్టి, మనమే చంకలు కొట్టించు కోవడం హాస్యాస్పదం అన్నారు.
ఇదిగో ఇక్కడ నాకు కాలింది. (ఎక్కడ అని ఎదురు ప్రశ్న వేయ్యకండీ.. అలాగే.. బర్నాల్ రాయక పోయ్యారా .. అంటూ అగ్నికి ఆజ్యం పొయ్యకండి) నా బ్లాగుని నేను ఎన్ని సార్లు హిట్ చేసానా అన్న పరిశోధనలో చాలా చాలా విషయాలు వెలుగులోకి తొంగి చూసాయి. వాటిల్లో ముఖ్యమైనది, నన్ను భాధ పెట్టినదీ ఏమిటంటే.. విసిగించకుండా, అస్సలు విషయంలోకొద్దాం.
నా పరిశోధన నాబ్లాగుకు మాత్రమే కాకుండా, సదురు తెలుగు బ్లాగులన్నింటికు వర్తిస్తుందని నా అభిప్రాయం, నా బ్లాగు చదివే పరదేసీయులూ మీరేమంటారు. మీ మీ బ్లాగులు ఎవ్వరెవ్వరు.. ఏ ఏ ప్రదేశాలలో నుంచి చదువుతున్నరో తెలియజేయ గలరు.
ఎక్కువగా, తెలుగు బ్లాగులు చదివేవారిని విభజన ప్రాతీయ పరంగా చూస్తే, భారతదేశ చదువరులే ఎక్కువ భాగాన్ని కొట్టేస్తారు. కానీ అమెరికాలో ఉన్న భారతీయులలో తెలుగు తెలిసీ.. చదివే పరిఙ్ఞానం కలిగిన వారితో మన భారతీయులను పోలిస్తే, తెలరికన్లు (తెలుగు + అమరికన్ = తెలరికన్లు) చాలా తక్కువ శాతంగా మనం గమనించవచ్చు. అట్టి తెలరికన్లు, దాదాపు మన భారత చదువరిలతో బాహా బహి పోటీకి దిగారు. మొత్తంగా వారుకూడా పట్టు బిగించి, మన స్వంత గడ్డను మరచి పోలేదన్నట్లుగా మనవారితో పోటీ పడుతున్నారు. అట్టి వీరందరూ కూడా, బ్లాగు లోకంలోకి ప్రవేశించినట్లైతే, అహా .. బ్లాగు ప్రపంచం మూడు పుటలు ఆరు చదువరులుగా వెలుగొందుతుంది.
కానీ ఆశ్చర్యపరచిన విషయమేమిటంటే.. కెనడాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వున్నా, గల్ఫ్ లో ఉన్న తెలుగు వారికన్నా, తక్కువగా బ్లాగులు చదువు తున్నారన్న విషయం మింగుడు పడటం లేదు. ఇక్కడ ముఖ్యంగా percentage ని మాత్రమే లెక్కగా తీసుకో బడింది, అంతే కానీ అసలైన సంఖ్యలు ఎక్కువగా ఉండవచ్చు.
అన్నింటికన్నా కలవర పరచిన విషయ మేమిటంటే.. నార్త్ అమెరికా దేశాలైన బ్రజిల్, అర్జంటీనా, పెరూ, చిలీ, వెనుజ్యువెలా వంటి ప్రదేశాలలో మన తెలుగు వారు ఉన్నపటికీ, వారు నామ మాత్రంగానైనా తెలుగు వెలుగులను చూస్తున్నారా అని అనుమానమేస్తోంది. వీరికి తోడుగా, ఆఫ్రికా దేశాలలోని తెలుగు వారు మాత్రం మేము తెలుగు మర్చిపోయామన్న లెక్కలోకి వచ్చేసినట్లున్నారు. ఇక చైనా, జపాన్, రష్యా, కజకిస్తాన్, మంగోలియా వంటి దేశ తెలుగు వారిని మనం తెలుగువారు అని అనక్కరలేదేమో!!! అన్నింటికీ మించి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఫిన్‍లాండ్, నార్వే, ఐస్‍లాండ్, గ్రీన్‍లాండ్ లాంటి ప్రదేశాలలో నుంచి కూడా చదువరులు హిట్లు ఇస్తున్నారన్న విషయమే గొంతులో మింగుడు పడలేనటువంటి వెల్లక్కాయ మాదిరిగా ఉంది. ఏది ఏమైనా ఈ సర్వే నాకు చాలా విషయాలు తెలియ జేసింది.
మిగిలిన దేశాలలో ఉన్న తెలుగు వారూఊఊఊఊఊఊఊ .. ఎక్కడున్నారు?? దయచేయండీ.. చదవండి, స్పందించండి, తర్కించండి, తిట్టండి, కొట్టండి(నన్ననుకునేరు.. నన్ను కాదు.. బ్లాగు లింకులను). మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
1 స్పందనలు:
Post a Comment