ఇది కూడా నిజమే ..

నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని పూరిద్దాం కదా అని చేసిన నా ప్రయత్నంలో నేను బొటా బొటిన పాస్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో బొటా బొటి అంటే వందకు పాస్ మార్క్ అన్నమాట. హిందిలో అయితే వందకు పదిహేను మార్కులు వస్తే పాస్ అన్న మాట అలాగే మిగిలిన సభక్ట్ లలో అయితే ముప్పై ఐదు వస్తే పాస్ అన్న మాట. ఆ లెక్కలో నాకు వందకు నలభై మార్కులు వచ్చాయి.

సమస్యలో వాడు ఇచ్చింది ఐదు ఖాళీలు పూరించమని. నాకు ఙ్ఞప్తికి వచ్చినవి రెండు. అంటే పాస్ అన్న మాట. వాడు ఇచ్చినవి వాటిల్లో నాకు వచ్చినవి ఇక్కడ ఉంచుతా.

వరుస తెలుగు పదం మొదటి అక్షరం రెండొవ అక్షరం మూడవ అక్షరం నాల్గవ అక్షరం ఐదవ అక్షరం
బ్రతికిన       V E
ధైర్యము B R A V E
నడువు       V E
నదులు       V E
బానిస S L A V E

మిగిలిన తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు ఏమై ఉంటుందబ్బా!!

మీరేమవ్వాలనుకుంటున్నారు / ఏమి చెయ్యాలనుకుంటున్నారు

WorstNew

పేజీ తిప్పితే ..

ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది.

ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ మించి కధాగమనంలోని మాటల విషయంలో ఆ రచయితని మెచ్చుకోకుండా ఉండలేను. దీనినే క్రియాత్మకత అని అంటారు.

ఎవ్వరైనా ఏదైనా ఫొటో మోడల్ గా చేద్దాం అని అనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఆనందిస్తారు అని వ్రాయటం కన్నా ఆస్వాదిస్తారు అని వ్రాయటం భేషుగా ఉంటుందేమో. ఒక్క సారి ఆలోచిస్తే పుస్తకంలో ఉండే ప్రకటనలలోని పాత్రలు నిజంగా ఇలాగే ఆలోచిస్తాయా అనేటటువంటి ఊహ ఎంత విచిత్రంగా ఉందో కదా. ప్రకటనలలోని పాత్రలు కనుక నిజంగా ప్రాణం వస్తే ఇలాగే ఆలోచిస్తాయేమో!!

పుస్తక ప్రదర్శన 3వ రోజు విశేషాలు

eతెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న పుస్తక ప్రదర్శన యందలి స్టాల్ యొక్క మూడొవ రోజు విశేషాలు వ్రాద్దామని రెండు రోజులనుంచి అనుకుంటున్నా, కుదరటం లేక ఇవ్వాళ ఎలాగైనా వ్రాసి ముగిద్దామని కూర్చున్నాను. వీలైన వివరంగా వ్రాస్తాను.

మూడోరోజు ప్రధమంగా నేను వెళ్ళటం జరిగింది. మూడోరోజు శనివారం అయినందున ఉదయం పదకొండు గంటలకే తెరుస్తారని చాలా సార్లు నిర్వాహకులు ప్రచారం చేసినందున ఆరోజు ఇంకొంచం ముందుగా వెళదాం అనుకున్నా, భోజనం చేసి అక్కడికి చేరుకునేటప్పటికి పన్నేండున్నర అయ్యింది. స్టాల్ మూసి ఇన్న వైనం ఎందుకో కించిత్ నచ్చక పోయినా, చేసేది లాభాపేక్ష లేకుండా కదా.. ఎవ్వరికి వీలైతే వారు మనకు కలసి వస్తారు, వీలుకాలేని వారిని ఎందుకు వీలుకాలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా అని సమర్దించుకుని, నా వంతు కర్తవ్యంగా నేను వచ్చాను కదా అనుకుని ఓదార్చుకున్నాను. అదిగో అలా మొదలైంది పుస్తక ప్రదర్శనలో మొదటి శనివారం.

అన్నీ సద్దుకుని నా అంకోపరిని నలుగురికి కనబడేటట్టు పెట్టి, కరపత్రాలను సర్ది కుర్చీలో కూలబడ్డాను. జనాలు చాలా పలుచగా వస్తూ ఉన్నారు. మెల్ల మెల్లగా ఒక్కరొక్కరూ రావటం మొదలైంది. వచ్చిన వారికి కరపత్రాలు అందిస్తూ, అడిగిన వారికి తెలిసిన విషయాన్ని తెలియజేస్తూ సాగుతుండగా, మూడున్నర వేళలో కొంచం కునుకు పట్టింది. అలాగే కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతుంటే, ఓ నడి వయస్కుడు చక్కగా నా అంకోపరిని సర్దేసే పని చేశాడు. గబుక్కున మెళకువ వచ్చింది కాబట్టి బ్రతికి పోయ్యాను. మేలుకుని అతని చేతిలో కరపత్రాన్ని ఉంచి పంపేటప్పటికి పట్టిన కునుకు కాస్తా పోయింది.

అలా గట్టేక్కిన సమయానికి మెల్ల మెల్లగా తెలుగు బ్లాగర్లు, eతెలుగు కార్యవర్గ సభ్యులు రావటం మొదలైంది. కబుర్లు చెప్పే కశ్యప్ గారు ముందుగా అక్కడికి చేరుకున్నారు. వారి వెనకాల జావాలినిక్స్ వ్రాసే కట్టా విజయ్ గారు రావటం జరిగింది. ఆనాటి విషయాలలో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే, కట్టా విజయ్ గారు తనతో తెచ్చిన ఎయిర్ టెల్ వారి ఇంటర్ నెట్ కార్డ్. దాని సహాయంతో సందర్శకులకు అంతర్జాలంలో తెలుగు ఎంత బాగా అభివృద్ది చెందుతుందో చూపించగలిగాం. అంతర్జాల సదుపాయాన్ని ఆనాడు eతెలుగు వారికి అందించినందులకు సభా ముఖంగా వారికి ధన్యవాదములు.

అదిమొదలు, ఏకలింగం పేరుతో బ్లాగే మాలికా మూలకారుకులలో ఒక్కరైన శ్రీనివాస్ గారు, శంకరాభరణం అని బ్లాగుతున్న తెలుగు మాస్టారైన కంది శంకరయ్యగారు, వారి వెనకాలే ప్రఙ్ఞ అనే శీర్షికన బ్లాగుతున్న మఱో బ్లాగరు, కోతి కొమ్మచి బ్లాగరుతో మాట్లాడుతుండగా మూడు బీర్ల తరువాత అంటూ అక్కిరాజుగారు వచ్చి కాసేపు పిచ్చాపాటి వేసారు. ఆఖర్లో అనుకుంటా ఒక మంచి మాట చెబుతానంటూ మఱో తెలుగు బ్లాగరు అప్పారావుగారు రావటం జరిగింది. మహిళా బ్లాగర్లలో చురుకుగా పాలు పంచుకుంటున్న జ్యోతిగారు కూడా ఆరోజు తళుక్కున మెరిసి అదృశ్యం అయ్యారు. వీరందరితో పాటుగా సంసృత డాక్యుమెంట్స్ వెబ్ సైట్ నకు సహకారాన్ని అందిస్తున్న గుత్తిన శ్రీనివాస్ గారు కూడా విచ్చేసి వారి అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు.

ఆనాటి చిత్రాలను ఈ లంకెలో చూడవచ్చు.

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.

మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.

వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.

రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.

 
Clicky Web Analytics