కధే.. కానీ, మరచి పోలేకున్నాను.. రెండవ భాగం

ఇంతవరకూ జరిగింది: ఒక వారాంతం నేను ఆఫీస్ నుంచి త్వరగా రావటం వల్ల, శాంభవీని ఆట్లాడించడానికి పార్కుకు తీసుకెళ్ళాను. పార్కు నుంచి తిరిగి వచ్చిన తరువాత పెరుగన్నం దగ్గర ప్రమాణం. ఒక వేళ మీరు మొదటి పుట చదవక పోతే, నా విన్నపాన్ని మన్నించి, ముందుగా అది చదివిన తరువాత ఇది చదవండి. ఇదిగో ఇక్కడుంది దీని మొదటి భాగం. ఇక ముందుకు వెళదాం.

-----------------------------------------

శాంభవి పరుగు పరుగున వెళ్ళి మూతి కడుక్కుని వచ్చి నా ప్రక్కన చేరింది. ఇంతలో లోపలి నుంచి, ’భోజనం తయారయ్యింది .. వడ్డిస్తున్నాను.. రండీ..’ అంటూ కేకేసింది నా అర్దాంగి. చిన్నదాన్ని అలాగే చంకనేసుకుని మధ్య గదిలోకి వెళ్ళి కూర్చున్నా. శాంభవి ఎదో ఎదో మాట్లాడుతోంది. కానీ నాకేమీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఎందుకంటే, ఇందాక పెద్ద సత్య హరిశ్చంద్రుడి లాగా వాగ్దానం అయితే చేసేసాను కానీ మనసులో ఒక్కటే భయం. ఇప్పుటికిప్పుడు ఏమి కొనమని అడుగుతుందోనని భయం. భోజనానికి కూర్చున్న నాకు తోడుగా మా అమ్మ, భార్య రాగానే, చిన్నదాన్ని క్రింద పడుకో పెట్టి, భోజనానికి ఉపక్రమించా. వంట లన్నీ ఘుమ ఘుమ లాడుతోంటే, చక్కగా కంది పొడి వేసుకుని కొంచం ఎక్కువే లాగించేసా. అందరం భోజనాలయిన తరువాత, అమ్మేమో తన గదిలోకి చేరి మెల్లగా నిద్రకి ఉపక్రమించడానికి ప్రయత్నిస్తోంది. భార్యమో అంట్లన్నీ తోమేస్తే, ఉదయం పని తగ్గుతుందని, వాటిని ఒక పట్టు పట్ట డానికి ఉపక్రమించింది. శాంభవి నిద్ర పోవడం లేదు. అదిగో అప్పుడు మొదలైంది మా ఇద్దరి మధ్య అస్సలైన సంభాషణ.

’నాన్నా!! ఇందాక నువ్వు నాకేది కావాలంటే అది ఇస్తాన్నావు గదా..’ అంది చిన్న తల్లి

’అవును తల్లీ.. కానీ ఇప్పటికిప్పుడు ఒక వీడియో గేమో.. కంప్యూటరో.. అడిగావనుకో .. డబ్బులు లేవు కదా.. అందుకని.. కొంచం ఖర్చు తక్కువలో ఎదైనా అడుగు. తెస్తా’ అని భరోసా ఇస్తూనే, గుండెలు చిక్క బట్టుకున్నా.

’అవేమీ వద్దు నాన్నా.. నిన్ను ఖర్చు పెట్టే పనేమీ ఆడగనూ..’

’సరే తల్లీ.. ఏమె కావాలి??’.. పైన కొటి దేవుళ్ళను ప్రార్దిస్తున్నా

’మరే... మరే.. నేను గుండు చేయించు కుంటా.. రేపు నన్ను మన మంగళోడి దగ్గరకు తీసుకెళవా!!’, బుంగ మూతి పెట్టుకుని అడిగింది. నాకు అర్దంకాలేదు. భ్రుకుటి ముడి పడింది. నేను విన్న మాటలు నిజమేనా అన్న అనుమానంతో.

’నాన్నా.. వింటున్నావా.. నేను గుండు చేయించు కుంటా.. రేపు నన్ను బయటకు తీసుకు వెళతావా..’ కొంచం గట్టిగా అంది నా చిన్నారి శాంభవి.

’ఏంటీ!!!’ ప్రక్క గదిలోంచి అమ్మ నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి వచ్చి కోపంగా చూస్తూ...

’ఏమే.. చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు.. ఏంటి ఆ మాటలు .. ’ వంటింటి లోంచి భార్య

’ఇదంతా నీ నిర్వాహకమే .. చూడు అది ఎట్లాంటి మాటలు మాట్లాడుతోందో.. ’, అమ్మ కొనసాగిస్తూ, ’నీ తోటి పిల్లలు అలాగే తిరుగుతున్నారే.. నీ కెందు కొచ్చింది ఆ అలోచన. హమ్మ!!! గుండు లేదు ఏమీ లేదు .. గమ్మున కళ్ళు మూసుకుని పడుకో’, అంటుంటే, నాకు వెంటనే సాయంకాలం చూసిన గుండు పిల్లవాడు వాడి తల్లి గుర్తుకొచ్చారు.

’ఏమిరా ఆలోచిస్తున్నావు.. అది మాట్లాడేది ఎమైనా అర్ద మవుతోందా.. ఆడ పిల్లని ఆడ పిల్ల గా పెంచరా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, అదేం మాట్లాడుతోందో. ఇదంతా నీ పెంపకమేరా. ఏం సమాధానం చెబుతావో చెప్పు’, అని అమ్మ గదమాయించేంత వరకూ నేను విన్నది నిజమేనన్న విషయం అవగతమవలేదు. శాంభవి చూడకుండా అమ్మకి కనుసైగ చేసి, ’అమ్మా!! నువ్వేళ్ళి పడుకో.. ఇది నాకు, నా కూతురు మధ్య విషయం’ అని అమ్మని అక్కడనుంచి పంపేసాను. ఎదో సణుక్కోంటూ వెళ్ళి పోయింది. ’ఏమిటండీ .. మీరి మరీనూ.. చిన్నదానికోసం కన్న తల్లిని అంత మాట అంటారా’, అంటూ భార్య అమ్మని వెనకేసుకుని రాబోయింది. శ్రీమతికీ ఒక చిన్న కనుసైగ చేసి, ’నీ పని నువ్వు చేసుకో..’ అంటూ గదమాయించేసా.

’ఏంటో .. ఈ తండ్రీ కూతుళ్ళ విషయం మనకు అర్దం కాదత్తయ్యగారూ.. మీ కెందుకు గానీ మీరు పడుకోండి, రేపు పొద్దున నీళ్ళొస్తాయి కదా, నేను పడుకుంటున్నాను.’ అంటూ మా పడక గదిలోకి దారి తీసింది.

ఇక మధ్య గదిలో నేను శాంభవే మిగిలాం. గొంతుక సవరించుకుని, మెల్లిగా మొదలు పెట్టా. ’చిన్నారీ, నీ జుట్టు చాలా పొడుగుగా ఉంది కదా.. ఇప్పటికిప్పుడు గుండు చేయించాం అనుకో అంత జుట్టు పోతే రావడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి వద్దులేరా’ అన్నాను.

’అదేంటి నాన్నా!! నువ్వేనా ఈ మాటలనేది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నువ్వే కదా చెప్పావు. నేను నిన్ను డబ్బులు కూడా అడగటం లేదే. నువ్వేకదా హరిశ్చంద్రుడు కధ చెప్పింది..’ అంటూ ఇంకేదో చెప్పబోతోంటే, మధ్యలో దూరి, ’ అదికాదు తల్లీ, ఆడ పిల్లలు గుండు చేయించు కోరాదు’ అన్నాను

’ఏం? ఎందుకని?’ ఎదురు ప్రశ్న వేసింది. సమాధానం నాదగ్గర ఉంటే కదా. అవును నిజమే ఆడవాళు గుండు చేయించుకో వద్దని ఎవ్వరు చెప్పారు?? ఎక్కడ వ్రాసారు. శాంభవి చేత ఆ నిర్ణయాన్ని మార్చడం కోసం చాలా ప్రయత్నం చేసా. వినేట్టట్టు లేదే. విస్వ ప్రయత్నం చేసిన తరువాత, చివ్వరకు విసుగెత్తి,  ’హాయ్.. ఎంత మంది ఎన్ని మాటలు చెబుతున్నా నీ మాట నీదే కానీ మా మాట వినవా..’ అంటూ ఒక్కటిచ్చా. పాపం బాగా తగిలిందనుకుంటా.. ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఈ చిన్నది ఎందుకిలా అడిగిందా అని అలోచిస్తూండగా, సాయంత్రం చూసిన గుండు పిల్లవాడు గుర్తుకొచ్చాడు. ఇదంతా సావాస దోషం అని నన్ను సమర్దించుకుని, ఎలాగోలా ఆ పిల్ల వాడి స్నేహాన్ని మాన్పించేయ్యాలని నిర్ణయంచుకున్నా. ఎందుకంటే, చాలా మంది పిల్లలు, వారి చుట్టూ ఉన్న వారిని అనుకరిస్తూ ఉండడాని సాధారణంగా మనం గమనించే ఉంటాం కనుక.

చిన్నదాన్ని నిద్ర పుచ్చా గానీ, నాలోని ఆత్మ నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. మనమే ఇచ్చిన మాట మీద నిలబడక పోతే, చిన్న పిల్లలు ఎవ్వరిని ఆదర్సంగా తీసుకుంటారు. రేపు పెరిగి పెద్దైన తరువాత వాళ్ళు కూడా, ఇచ్చిన మాటలు తప్పి ప్రవర్తిస్తే.. ఈ ఊహ తలచుకుంటేనే భయం వేస్తోంది. ఆ రాత్రి అంతా కాళ రాత్రే. ఒక వైపు శాంభవిని కొట్టానే అన్న భాధ, మరో వైపు ఇచ్చిన మాటపై నిలబడాలా లేక మాటకు కట్టుబడి నా చిన్న తల్లికి గుండు చేయించాలా అన్న వేదన. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. సూర్యుడు కూడా ఏమి జరుగుతుందా అన్న ఉత్సాహంతో కొంచం తొందరగానే వచ్చేసాడనిపించింది. నిద్ర లేమి నాలో కొట్టొచ్చినట్లుగా కనబడు తోంది.

కాలకృత్యాలు, పూజ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్నా.. ఏమి జరుగుతోందో అన్న భయం. శాంభవికేమో ఇవేమీ గుర్తులేనట్లు, సరదాగా చెంగు చెంగు మంటూ ఇల్లంతా బొంగరంలా తిరిగేస్తోంది. వాళమ్మేమో దాని వెనుక బ్రేక్‍ఫాస్ట్ తినిపించ డానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అమ్మేమో గుడికేళొస్తానంటూ బయటకు వెళింది. ఇంతలో..

’నాన్నా.. నీకిష్టం లేక పోతే, నేను గుండు చేయించు కోనులే..’, బుంగ మూతి పెట్టి అంటున్న శాంభవిని చూసే సరికి, కళ్ళు తిరిగినంత పనైంది.

’లేదు తల్లీ.. నువ్వన్నట్లే నీకు గుండు చేయిస్తా..’ అప్రయత్నంగా నాగొంతులోంచి నాకు తెలియకుండా వచ్చేశాయి.

0 స్పందనలు:

 
Clicky Web Analytics