ఇంతవరకూ జరిగింది: ఒక వారాంతం నేను ఆఫీస్ నుంచి త్వరగా రావటం వల్ల, శాంభవీని ఆట్లాడించడానికి పార్కుకు తీసుకెళ్ళాను. పార్కు నుంచి తిరిగి వచ్చిన తరువాత పెరుగన్నం దగ్గర ప్రమాణం. (మొదటి పుట). అన్నీ సద్దు మణిగిన తరువాత శాంభవి గుండు చేయించు కుంటానన్న కోరిక, మా అందరి స్పందన ప్రతి స్పందనలు. ఆఖరుగా ఒప్పుకోలు. (రెండవ పుట). ఒక వేళ మీరు మొదటి పుట, రెండవ పుట చదవక పోతే, నా విన్నపాన్ని మన్నించి, ముందుగా అవి చదివిన తరువాత ఇది చదవండి. ఇదిగో ఇక్కడుంది దీని మొదటి భాగం. ఇది రెండవ భాగం. ఇక ముందుకు వెళదాం.
---------------------------------
అభయమయితే ఇచ్చెసా గానీ, నా చిట్టి తల్లిని తన నల్లటి పొడుగాటి జుట్టుని లేకుండా చూడ గలనా.. దానికి తోడుగా, నా భార్య, ’ఏంటండీ .. మీరు మాట ఇవ్వడం .. అది అడగడం .. భలే బాగుందే.. మీ వరస. అదేదో చిన్న పిల్ల తెలిసో తెలియకో అడిగిందను కోండి, మంచి మర్యాద లేకుండా మీరు కూడా గంగిరెద్దులాగా తలూపేస్తారా..’ అంటూ యుద్ధాన్ని ప్రకటించింది.
’తెలిసో తెలియకో చిన్నది అడిగింది, ముందు వెనుకలు ఆలోచించ కుండా నెనే మాటిచ్చేసాను. ఇప్పుడు నేను మాట తప్పననుకో, రేపు పెద్దైయ్యాక, అది కూడా నాలాగా మాట తప్పితే నువ్వు భరించగలవా..’, సూటిగా ఒక్కటే ప్రశ్న. అంతే, చిరుబుర్రు లాడుకుంటూ ముందు గదిలోకి దారి తీసింది. ఇంతలో అమ్మ వచ్చే వేళయితే మమ్మల్ని బయటకు పంపించదనే భయంతో, శాంభవిని తీసుకుని, మెల్లగా జారుకున్నా. ధైర్యంగానైతే బయలు దేరాగానీ, మనసులో ఎదో తెలియని భాధ. నా చిట్టి తల్లిని జుట్టు లేకుండా చూడగలనా అన్న అనుమానం, చూసి తట్టుకోగలనా అన్న భయం. మెల్లిగా మంగలి దగ్గరకి చేరుకున్నాక, ఆఖరు సారిగా నా చిట్టి తల్లిని కన్నులారా చూసుకుని, వాడితో చెప్పా.
’కొంచం నెప్పి పుట్టకుండా గుండు చెయ్య గలవా..’ అంటూంటే.. వాడు వింతగా చూసాడు నావైపు.
’సారూ .. నాది ముప్పై సంవత్సరాల అనుభవం.. మీకెందు కండీ, రాండి .. కూకోండి.. మీకు తెలియకుండా గీకేత్తాగా..’ అన్నాడు.
’నాకు కాదు నాయినా .. నా కూతురు కి’ అనగానే, వాడొక వింత చూపు చూసాడు.
’ఏంటి సారూ, చిన్న పిల్లకి జుత్తు చూడబోతె చాలా బాగుంది.. గుండు గీకిత్తున్నారు.. చిన్న పిల్లలన్నాక తప్పులు చెత్తారు .. అంత మాత్రాన ఇంత చిచ్చ వెస్తారా.. వీల్లేదు బాబు.. నాను చెయ్య’ నంటూ మొండి కేసాడు. వాడిని కాస్తా బుజ్జగించి, బ్రతిమాలి, బామాలి, క్రింద మీద పడి, నా చిన్నారికి గుండు చేయించే సరికల్లా తల ప్రాణం తోకకొచ్చింది.
మెల్లగా ఇంటికి చేరుకుని, శాంభవికి దగ్గరుండి శ్నానం చేయించి గుండు నిండా చల్లాగా ఉంటూందని చందనం రాసా. ఇంతలో అమ్మ రానే వచ్చింది. వస్తూ వస్తూనే విషయం తెలుసుకుని, రుద్ర కాళిలా నామీద తోక తొక్కిన పాము పడగ విప్పినట్లు కస్సు బుస్సు లాడింది. కలి కాల మంటూ, నన్నూ.. నా కూతుర్ని అరగంట సేపు తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టేసింది. మెల్లగా నేను తేరుకునే లోపుల, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా నాకూతురు చల్లగా జారుకుంది.
శాంభవి ఇంట్లో లేదన్న విషయం మాకు అర్దమయ్యె సరికల్లా ఓ గంట పట్టింది. నాకు మెల్లగా భయం పట్టుకుంది. శాంభవిని వెతుక్కుంటూ రోడ్డు మీదకి బయలుదేరాను. నాకు తెలిసిన రోడ్లన్నీ తిరిగా. ఏక్కడా కనబడలేదు. భయం నన్ను మింగేస్తోంది, లేని పోని ఆలోచనలు మదిలోదూరి మెదడుని తొలిచేస్తున్నంతలో, లీలగా ఎందుకో నిన్న సాయంత్రం జరిగిన విషయం గుర్తుకొచ్చింది. గుండు పిల్లవాడు గుర్తుకొచ్చాడు. అంతే .. ఆఘ మేఘాలమీద అటు వైపు పరిగెత్తా.. నేను వాళింటికి చేరుకునే సరికల్లా .. నాకంట బడ్డ దృశ్యం నన్ను మారు మట్లాడనివ్వలేదు. శాంభవికి ఆ గుండు పిల్లవాడు వీడ్కోలు చెబుతున్నాడు. నా చిన్నారి, నన్ను చుస్తూనే ఎగ్గిరి దూకింది, నేను సిద్దంగా ఉన్నానా లేనా అన్న ఆలోచన చేయకుండా.
శాంభవి మీద వచ్చిన కోపాన్ని ఒక్క సారిగా తమాయించుకుని, ఎక్కడ తొందర పడి మళ్ళి నిన్న రాత్రిలాగా కొడతానో అన్న ఆలోచనతో శాంతించి, నా చిట్టి తల్లిని తనివి తీరా ముద్దాడు తుంటే, వింతగా ఓ చూపు చూసింది. సరే పిల్లల్ని భయపెట్టి పనులు చేయించు కోకూడదు, మంచిగా చెప్పి చేయించు కోవాలని తలంచి, శాంభవికీ క్లాసు పీకే కార్యక్రమాన్ని అప్పటికి వాయిదా వెసేసాను.
అరోజంతా శాంభవీని విడిచి పేట్టి ఉంటే ఒట్టు. ఎదో కోల్పోయామన్న భాధ. ఎదో తెలియని ఆందోళన. ఎం జరుగుతోందో తెలియని ఆవేదన. అన్ని కలసి ఇబ్బడి ముబ్బడిగా నన్ను కలగా పులగం చేసెస్తూ ఉంటే, ఎమి చెయ్యాలో తోచక సాయంకాలం శాంభవిని తీసుకుని పార్కుకు బయలు దెరా. పార్కుకు చేరుకున్నానన్న మాటే గానీ నిన్నటి హుషారు లేదు నాలో. పిల్లలందరూ ఒకరి తరువాత ఒక్కరు చేరుకుంటున్నారు. శాంభవికి గుండు అన్న విషయం వారు గమనించారో లేదొ కానీ వాళ్ళు గమనిస్తున్నారో లేదో అన్న తలంపే నాకు ఒక గిల్టీ ఫీలింగ్. వాళ్ళదేం పట్ట నట్టు యధా విధిగా క్రిందా మీదా మల్ల గుల్లాలు పడుతున్నారు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నాకంట్లో పడ్డాడు ఓ గుండు పిల్లాడు. వాడు కూడా వీళందరితో ఆడుతూ పాడుతూ ఎగిరెగిరి దూకుతున్నాడు. వాడికో వార్నింగ్ ఇదాం అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళేంతలో వాడి తల్లి నిన్నటి నా భాధ్యతను తీసుకున్నట్లుగా.. అందరితో చలాకీగా తిరిగేస్తోంది. మన, తన, పర భేదం లేనట్లుగా అందరినీ తన పిల్లలుగా ఆడిస్తోంది. అంత మంది పిల్లల మధ్యలో వాళ ఆనందాన్ని నేనెందుకు చెడగొట్టాలనుకుని, కొంచం దూరంగా కూర్చోని వాళ్ళను గమనిస్తున్నాను. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఎనిమిది కావస్తోందన్నట్లుగా చేతి గడియారం చూపిస్తోండంతో మెల్లగా శాంభవిని తీసుకుని బయలుదేరా. నాకు ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే, రాత్రి అవ్వస్తున్నా ఆ గుండు పిల్లాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. వాడి గురించి ఆలోచించడం మానేస్తే నాకే మంచిదని తలంచి, శాంభవి ని తీసుకుని ఇంటి వైపు అడుగులేసా.
ఎదో గతికా మన్నట్లుగా భోంచేసి, శాంభవీని పొట్ట మీద పడుకోబెట్టుకుంటూ పడక్కుర్చీలో మేను వాల్చా. నా స్తితి అర్దం చేసుకుందెమే, అమ్మ నా ప్రక్కకు చేరి, ’ నాయనా .. ఒంట్లో బాగోలేదా.. అన్నం సరిగా తినలేదు..’ అంది.
’ఏం లేదమ్మా.. శాంభవికి కొత్తగా ఆ వింత కోరిక ఎందుకొచ్చిందా అన్న ఆలోచనలో కొంచం కఠినంగా వ్యవహరించాను.’
’పోనీలేరా.. అయ్యిందేదో అయ్యింది, ఇక ముందు జాగర్తగా ఉంటే చాలు. మన పిల్ల మన మాట వింటే అదే పదివేలు. జుట్టు దేముంది ఇవ్వాళ పోతే రేపొస్తుంది’ అని సముదాయిస్తుంటే, భద్రకాళిలా చిందులేసిన మహాంకాళేనా ఈవిడ అని నాకు అనుమానమొచ్చింది. నిద్రలోకి జారుకున్న శాంభవీని తన చేతుల్లోకి తీసుకుని, ’ వెళ్ళి పడుకోరా.. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్‍కి వెళ్ళాలి కదా’ అంది. నిజమే కదా అనుకుంటూ శాంభవీకి రెండు ముద్దులిచ్చి, అమ్మ చేతిలో పెట్టా.
నిద్రలేమితో ఉన్న నాకు ఆ రాత్రి, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఉదయాన్నే నిద్రలేవగానే అనుకున్నా, శాంభవిని దగ్గరుండి స్కూల్ దగ్గర దించాలని. అనుకున్నదే తడవుగా, నా అలోచనని అర్దాంగికి చెప్పెసి, భోజనాన్ని సిద్ధం చెయ్యమంటూ ఒక ఆజ్ఞ జారీచేసేసా. త్వర త్వరగా తయారయ్యి, శాంభవీని స్కూల్ దగ్గర దించడానికి తయ్యారయ్యా. నేను తనని దించి వెళతానన్న విషయం తెలుసుకున్న శాంభవి చలాకిగా తన పనులన్నీ తనే చేసేసుకుంటూ నాతో సమానంగా సిద్ధమయ్యింది.
స్కూలు గేటు దగ్గర దించి సాగనంపు తున్నంతలో, అదే గుండు పిల్లవాడు కారులో దిగుతూ కనబడ్డాడు. వీడిక్కడెందుకు తగలడ్డాడా అని అనుకుంటు ఉంటే.. నా చిట్టి తల్లి వాడిని పిలిచి చెయి చేయి కలుపుని చెంగు చెంగున లోపలికి దూసుకేళ్ళి పోయింది. ఇదెక్కడి పీడరా బాబూ అనుకున్నంతలో, కారులోంచి ఆ గుండుగాడి తల్లి తండ్రి మెల్లగా నా దగ్గరకు చేరుకున్నారు. వారి కళ్ళలో నీరు ఉబికి ఉబికి వస్తున్నట్లున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నట్లున్నారు.
’ఏమండీ .. శాంభవీని కన్న మీరు కారణ జన్ములు. మీకు మీ శాంభవీకి చేతులెత్తి మొక్కాలి’, అంటూ ఉంటే.. నేనేమి వింటూన్నానో నాకేమి అర్దం కావటంలేదు.
’నిన్న సాయంత్రం మీ గురించి వెతికే లోపే మీరు ఇంటికెళ్ళి పోయ్యారు..’ ఆ గుండుగాడి తల్లి అంటోంది.
’మీరు వెళ్ళి పోయ్యారు అనేకన్నా, మేము తేరుకునే సరికి చాలా రాత్రి అయ్యిందంటే బాగుంటుంది.’ ఆ తల్లి గొంతు పూడకపోయింది
’నిజంగా నండి’, అపిల్ల వాడి తండ్రి అందుకున్నాడు. ’ మావాడు ల్యుకేమియా అనే వ్యాధితో భాధ పడుతున్నాడు. ఆ వ్యాధి కోసం వాడిన మందులు మరియూ కెమో ధెరపీ దుష్‍ప్రభావం వల్ల, వాడి నెత్తిన జుట్టు పూర్తిగా రాలిపోయింది. దీంతో మా వాడు ఆత్మ న్యూనతా భావంతో ఎవ్వరితో కలవలేక ఒంటరి వాడై పోయ్యాడు. దానితో, వాడు ఎక్కడికీ తీసుకెళదాం అన్నా రావటం లేదు. సైకాలకిస్టుని సంప్రదిస్తే, ఇది ఒక మానసిక వ్యాధి అని ఇదీ మందులతో సరి అవ్వదని చెప్పాడు. మేము గత ఐదు నెలలుగా ఎంత ప్రయత్నించినా మావాడు ఇల్లు వదిలి రావటం లేదు. అట్లాంటి రోజుల్లో మీ అమ్మాయి మా అబ్బాయిని గత వారంలో యాదృశ్చికంగా కలిసింది. మా వాడిని ఎవ్వరూ గేలి చెయ్యకుండా తాను చూసుకుంటానని మాట ఇచ్చి, వాడితో స్నేహం చేస్తుంటే, ముందు మాకే భాధేసింది. మా వాడిని మార్చడం కోసం మీ అమ్మాయి ఇంత పని చేస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇంతటి త్యాగ మూర్తిని కన్న మీరు ధన్య జీవులు’ అంటూ .. రోడ్డు అని కూడా గమనించ కుండా కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్న దంపతుల్ని చూస్తున్న నాకు నా చిన్నారి ఎంత ఎదిగి పోయిందో అనిపించింది.
అంతటి సున్నిత మనస్కురాలినా నేను కొట్టింది అన్న అలోచన నన్ను ఆశాంతం దహించి వేసింది. ఇదంతా తెలుసుకున్న నేనూ ఏడుస్తోంటే.. ఎమి జరిగిందో తెలియక వారూ తడబడ్డారు. కొద్ది సేపటికి తెరుకున్న నేను మనసులో..
’చిట్టి తల్లీ.. ఎంతటి నిస్వార్ద ప్రేమ నీది. ప్రేమలో పరమార్దమే గానీ, అర్దముండదని నాకు నేర్పిన గుణపాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను. నిన్ను శిక్షించిన నన్ను ఆ దేవుడు నన్నెందుకు శిక్షించలేదా..’ అని భాధ పడ్డా. ఎప్పుడో చదివిన కొన్ని మాటలు గుర్తుకొచ్చాయి.
The happiest people on this planet are not those who live on their own terms, but are those who change their terms for others inspire others.
-----------------------------------------------
ఆఖరున, ఈ మొత్తం కధానిక నాకు forward గా వచ్చిన ఒక మాస్ మైల్ నుంచి అని గమనించగలరు. మీకూ ఇట్లాంటిదే ఒకటి వచ్చి ఉంటుంది. కధ కొంచమే, దాని చుట్టు అల్లిన పరిస్తితులు అన్ని నా స్వంతం. కాళిదాసు కవిత్వం కొంచం, దానికి తోడు మన పైత్యం కొంచం అన్నట్లుగా అస్సలు దాని చుట్టు నేను కల్పించుకున్న కధానికే ఇది. ఎలా ఉంది?
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
3 స్పందనలు:
kallallo neelu tirigayandi...chaala baaga raasaru...
చాలండీ.. నేను పడ్డ శ్రమకి మీరిచ్చిన కితాబు అమోఘం. మీరు పెద్దగా ఏమీ వ్రాయక పోయినా, చిన్న స్పందనే నాకు భూకంప మంత కదిలింపు. ఈ ప్రోత్సాహం ఎల్ల వేళలా కొనసాగాలని భావిస్తూ..
ధన్యవాదాలతో
మంచి కథ.
గత రెండేళ్లలో ఎప్పుడో విపుల లో చదివిన గుర్తు. అది తమిళం నుంచి తర్జుమా అనుకుంటాను.
Post a Comment