కధే.. కానీ .. మరచి పోలేక పోతున్నాను .. మోదటి భాగం

ఒకానొక వారాంతం.. సాయంకాలం ఆఫీస్‍లో పని అంతా ముగించుకుని తొందరగా ఇంటికి చేరుకోవాలనే తాపత్రయంలో త్వరగా ఇంటికి బయలుదేరాను. హైదరాబాదు అంటే తెలియని దేముంది, అంతా ట్రాఫిక్ మయం. అటువంటి ఈ పద్మ వ్యూహం లాంటి రోడ్లు, ట్రాఫిక్ జామ్‍లూ ఛేదించుకుంటూ ఇంటికి చేరాను. హమ్మయ్య, ఇవ్వాళ జీవితంలో మొదటి రోజు ఇంటికి అనుకున్న వేళకి చేరుకున్నా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే, మా అమ్మాయి, శాంభవి, నాన్నా!! అంటూ ఎగ్గిరి దూకింది. ఈ మధ్య పిల్లలతో గడపడం లేదన్న విషయం చాలా ఆలస్యంగా అవగతమయ్యింది. ఇవ్వాళ త్వరగా ఇంటికి చేరుకున్నాం గనుక పిల్లని చక్కగా బయటకి తీసుకు వెళతానన్నాను. శాంభవి కంట్లో ఆనందానికి అవధుల్లేవు. భార్య కాఫీ కలప బోతే, వద్దని వారించి, కాళ్ళు కడుక్కుని, శాంభవితో దగ్గరలో ఉన్న పార్కుకు బయలు దేరాను.

వెనుక నుంచి,  ’జాగర్త రోయ్.. రోడ్డు మీద అటూ ఇటూ నడవకండి. వచ్చే పొయే వాహనాలు చూసుకుని రోడ్డు దాటు. చిన్నదసలే అల్లరి పిల్ల చెయ్యి వదలకు..’, మా అమ్మ ఇంకా ఎదో అంటోంది. లీలగా చిన్నప్పుడు అమ్మ అనే మాటలు ఇప్పుటికీ చెవ్వులో మారుమోగుతున్నాయి. ఇంత కాలమయినా నన్నింకా చిన్న పిల్లాడినే అనుకుంటుందేమో. చిన్నగా నవ్వుకుంటూ రోడ్డెక్కాం నేను నా బంగారు తల్లి. దగ్గర్లో ఉన్న పార్కుకు చేరుకున్నామో లెదో పొలోమంటూ చేరిపోయ్యారు చాలా మంది పిల్లలు. ఇంకే మా అమ్మాయికి నాతో పనిలేక పోయింది. అంతా ఒకళ్ళ చుట్టూ మరికరు చేరి పరుగులే పరుగులు. మధ్య మధ్యలో అప్పుడప్పుడూ నేను గుర్తుకొచ్చినప్పుడల్లా, శాంభవి నావైపు తిరిగి ఒక చిన్న నవ్వు విసిరేసి మళీ ఆటల్లో లీనమైపోతోంది. పిల్లలంటే స్వతహాగా ఇష్టం గనుక ఇక అక్కడున్న పిల్లల్లో తన పర భేధం పరచిపోయు నేనూ అందరినీ ఆడిస్తూ సరదాగా కలిసిపోయా. కొంత మంది పిల్లల తల్లులు నన్ను చూసి, కొంచం దూరంగా నిల్చోని వారు వారు పిచ్చా పాటి వేసుకుంటున్నారు. నేను కూడా అది గమనించనట్టు పిల్లలతో పిల్లవాడిగా కలసిపోయి వాళందరినీ ఆడిస్తూ కాలం గడిపేసా.

ఇలా తెలియకుండానే చీకట్లు పడడం ఒకళ్ళ తరువాత ఒకళ్ళు చిన్నగా జారుకోవడం గమనించే సరికి రాత్రి ఎనిమిదయ్యింది. మెల్లాగా అందరినీ గదమాయించి, ఒక్కక్కరినీ ఇంటి ముఖం పట్టించే సరికి తల ప్రాణం తోకలోకి చేరిందనుకోండి. అలా అందరం కలసి చేయి చేయి కలసి మానవ హారంగా బయలు దేరాం. ఒక్కొక్కళ్ళనీ వారి వారి ఇండ్ల దగ్గర దించి, మెల్లాగా నేను శాంభవీ ఇంటి దారి పట్టాం. శాంభవి మొహంలో ఎన్నడూ చూడనంత ఆనందం కొట్టోచ్చినట్టు కనబడుతోంది. గల గల ఎదో ఎదో మాట్లాడేస్తోంది. నవ్వుతూ అన్నింటికీ బదులిస్తూ, తన చిన్న తనానికి ఆనందిస్తూ అడుగులేస్తున్నాను. ఇంతలో ఒక ఇంటి ముందు ఠక్కున ఆగింది శాంభవి. నేను తేరుకునే లోపల, తుర్రుమంటూ ఆ ఇంటిలోకొ పరుగెత్తింది. ఆ ఇల్లెవరిదో, ఆ ఇంట్లో వాళ్ళెవ్వరో నాకు తెలియనందున గుమ్మం ముందు అయోమయంగా నిల్చోని పోయ్యాను. రెండు మూడు నిమిషాలలో ఆఇంట్లోంచి శాంభవిని ఎత్తుకుని మరోచెత్తో వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఆ ఇంటి ఇల్లాలు బయటకు వస్తూ కనబడగానే గుండె కుదుట పడింది. వాళబ్బాయిని చుస్తోంటే, నున్నగా గుండు చేయించుకున్నట్లుంది. శాంభవి నన్ను చూస్తూనే ఆవిడ చంక దిగి, వాళ్ళ అబ్బాయికి బై చెప్పి నన్ను చేరుకుంది. మెల్లగా ఇంటికి చేరుకునే సరికల్లా గడియారం తొమ్మిది చూపిస్తోంది.

కాళ్ళు చేతులు కడుక్కుని ముందు గదిలోని పడక్కుర్చిలో చేరగిల్లా. ఇంక వనుక గదిలో మాఅమ్మ శాంభవి ఇద్దరూ క్రిందా మీద పడుతున్నారు. బయటకెళ్ళి ఆడుకొని వచ్చావు కదా, చక్కగా స్నానం చెయ్యమంటోంది అమ్మ. నాన్న చెయ్యలేదు కదా నేనెందుకు చెయ్యాలంటోంది శాంభవి. మనసులో నవ్వుకుంటూ, ఈ తతంగం ఎప్పుడూ ఉండేదేగా అనుకుంటూ, వార్తా పత్రికలోకి తల దూర్చేసాను. కాసేపు పత్రిక చదివిన తరువాత, టీవీ ఆన్ చేసా. ఆ ఛానల్, ఓ ఛానల్, మూడు ఛానల్, పది ఛానల్, గాడిద గుడ్డు ఛానల్.. అంటూ ఈ మధ్య వచ్చిన అన్నింటినీ ఒక సారి పరీకిస్తూంటే.. వెనకాల గదిలో గొడవ ఎక్కువయ్యింది. సరే, ఆ విషయమేమిటో అని అనుకుంటూ, టీవీ కట్టేసి అక్కడికి చేరా. తీరా చూద్దునుకదా, శాంభవి పెరుగన్నం తినడానికి మారాం చేస్తోంది. వాళ్ళమ్మ, అదే నా భార్య, ఎదేదో చెబుతోంది. అయినా శాంభవి వినటం లేదు. ఇక నావల్ల కాదంటూ, కొంచం సహాయం చెయ్యవచ్చు గా అన్న చూపుతో నావైపు చూసింది నా అర్దాంగి. ఇక ఇప్పుడు నా వంతయ్యి నట్లుగా, పెరుగన్నం గిన్నెని చెతుల్లోకి తీసుకున్నా.

’చిన్నతల్లీ .. మంచి పిల్లవు కదా... ఇదేమో నాన్న ముద్దంట’, అంటూ శాంభవికి తినిపిచ్చడానికి ప్రయత్నం చెసా. మొదటి ముద్ద చట్టుక్కున తినేసింది. ఇందేంటి ఇలా తినేసిందని తేరుకునే లోపుల, ముందు గదిలోకి పరుగు లంకించుకుంది శాంభవి. వెనకాలే నేనూ.. ’నాకోసం కొంచం తిను తల్లీ ..’ అంటూ బుజ్జగించడం మొదలు పెట్టా. గిన్నే వైపు చూపిస్తూ.. ’నాన్నా చాలా ఉంది .. నావల్ల కాదూ.. అమ్మ కూరన్నం, పచ్చడన్నం, చారూ అన్నీ కలిపి కుక్కి కుక్కి పెట్టింది. చూడు నా పొట్ట ఎంత ముందుకొచ్చిందో. నావల్ల కాదూ..’ అంటూ మారాం చేయ్యబోయ్యింది. ’ఫరవాలేదమ్మా, ఈ కొంచం తినేయ్యి నీకేం కావాలంటే అదిస్తా ..’ అంటూ అభయమిచ్చేసా ధైర్యంగా. శాంభవి కళ్ళలో ఎదో తెలియని వెలుగు, ఒక్క సారిగా వెయ్యి ఓల్టుల బల్బు వెలిగినట్లుగా వెలిగాయి. అంతే సంగతీ అన్నట్లు, చక చకా నేను ముద్దలు కలిపి పెట్టేయ్యడం, గుటుక్కు గుటుక్కు మంటూ శాంభవి తినేయ్యడం నాకు ఎందుకో మింగుడు పడలేదు. ఏది ఏమైనా, నాకు కావలసిందల్లా పెరుగన్నం కాస్తా అయిపోవాలి. అది కూడా నా చిట్టి తల్లి ఎదురు చెప్పకుండా తినేయ్యడం. ఈ రెండూ పెద్ద కష్ట పడకుండా జరిగి పోయ్యేటప్పటికి, భార్య అమ్మ వైపు ఒక చిన్న లుక్కేసి, ’ఇంత దానికి మీరు ఊరకే హడావిడి చెస్తారు.. నా చిట్టి తల్లిని చూడండి చక్కగా ఒక్క మాటకి తినేసింది’, అన్నాను

2 స్పందనలు:

Kottapali said...

అయ్యా, ఈ కథలాంటిదే ఎక్కడో చదివినట్టుంది.
బ్లాగులో పెట్టే కథలు మీవి కాని పక్షంలో అవి ఎవరు రాశారో, ఎక్కణ్ణించి తెచ్చారో ప్రకటించటం సాంప్రదాయం

ఓ బ్రమ్మీ said...

కొత్తగారూ,

ఈ కధ చాలా చిన్నగా ఆంగ్లంలో forward mailగా నాదగ్గరకు వచ్చింది. అలాగే నాకు forward చేసిన వారికి మరెవ్వరో forward చెసినట్టు అందులో ఉంది. కాబట్టి నేను ఎవ్వరికి దీని credits అంద జేయ్యాలో తెలియలేదు.

అలాగే మీరు మొత్తం కధ చదివిన తరువాత స్పందించి ఉంటే బాగుండేది. ఎది ఏమైనా, ఈ కధలో కొంత నాకొచ్చిన మైల్ నుంచి, కొంత నా కవితా శక్తి (creativity) నుంచి జాలువారాయని గమనించ గలరు.

దర్సించినందులకు ధన్యవాదములు. మూడు పుటలుగా ప్రచురిద్దాం అనుకున్నా. అవి అన్నీ అయిన తరువాత తమ అముల్యమయిన సలహాలు అలగే మీ స్పందనలూ తెలియజేయగలరు.

 
Clicky Web Analytics