తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ..

మొదటి సన్నివేశం:

ప్రస్తుత సన్నివేశ స్థలం

సమయం: ఉదయం పది గంటలు

ప్రదేశం: ప్రబుత్వ మహిళా కాలేజి, బేగంపేట, హైదరాబాదు

పాత్రలు పాత్రధారులు : నేను మరియు ఆఫీసులకు పోయ్యే హైదరాబాదీ జనం. పైన చిత్రంలో పసుపురంగు నేను

పరిస్తితి: ట్రాఫిక్ చాలా బాగా ఉంది, ఆంగ్లంలో crawling అనే పదానికి, తెలుగులో పాకుతోంది అనే పదానికి సరిపోయే విధంగా, ఆరోడ్డుపై నిలచి ఉన్న కార్లు మెల్లగా .. అతి మెల్లగా కదులుతున్నాయి

అసలు కధ:

హీరో : ఇంకెవ్వరో కాదు నేనే

నా ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‍కి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుండటంతో, ఆ రోజు ఉదయానే రాహుల్ బజాజ్ సర్వోసింగ్ షోరూమ్‍లో ఇచ్చి, ఇంటికి వచ్చా. అర్దాంగి వేడి వేడిగా ఇడ్లీలు వేసి ఇస్తే.. గుటుక్కు మంటూ లాగించేస్తుండగా మెరుపులా మెదిలింది ఓ ఆలోచన. మేము ఉండేది, బ్రాహ్మణవాడ, బేగంపేట రైల్వేస్టేషన్ దగ్గర. ఆఫీసేమో జూబ్లీహిల్స్. రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుండా U టర్న్ కొట్టి, మహిళా కళాశాల మీదుగా, లైఫ్ స్టైల్ దగ్గరి ఫ్లైఓవర్ మీదుగా సోమాజీగూడ చేరుకుంటా. ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ఉండడం వలన అందునా తొందరగా బయలు దేరుతానేమో, ట్రాఫిక్ సమస్య అంతగా చికాకుగా అనిపించదు. ఆరోజు బండి లేకపోవడంతో ఆటోలో వెళదాం అనుకున్నా. కానీ పైన చెప్పినట్లు మెరుపులా ఒక ఆలోచన మదిలో మెదిలింది.

 

నాతో పనిచేసే మరో సహ ఉద్యోగిని సికింద్రాబాద్ నుంచి వస్తారు. ఆవిడ కారులో వస్తారు. ఎలాగో ఇటునుంచేకదా వెళ్ళేది అని తలంచి వెంటనే ఒక తంతి తగిలించా. అదేనండీ, ఫోను కొట్టా. ఎప్పుడు అడక పోవడం వల్ల, అడగంగానే ఒప్పుకున్నదామె. కాకపోతే ఒక చిన్న మెలిక పెట్టింది. ఆవిడ ఇంటి దగ్గరే కొంచం లేటుగా బయలు దేరుతాను కాబట్టి, ’నేను మహిళా కాలేజీ దగ్గరకు చేరుకునేటప్పటికి దాదాపు పావుతక్కువ పదకొండవుతుంది.. ఫరవాలేదా..’ అంది. ’ దానిదేముంది.. ఒక్క రోజు ఆఫీసుకి లేటుగా పోతే నన్నెవరూ అడగరు .. మెల్లగానే రండీ..’ అంటూ సమాధానమైతే ఇచ్చాగానీ. ఆఫీసుకి లేటుగా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఎదైతే ఎంటి, ఎలాగో అడిగేశాం .. ఇక ఆవిడకోసం వెయిట్ చెయ్యకపోతే బాగుండ దనుకుని ఇంట్లోనే పది నలభై వరకూ కాలక్షేమం చేసా.

 

ఇక చాల్లే అనుకుని మెల్లగా స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని.. అదేనండీ ల్యాప్ టాప్.. మెల్లగా మైన్ రోడ్డుకి చేరుకున్నా. ఇదిగో ఇక్కడ అస్సలైన కధ మొదలైంది. చూడబోతే, ట్రాఫిక్ చాల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఎదోలే అనుకుంటూ మెల్లగా ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ మేమిద్దరం అనుకున్న చోటుకి చేరుకున్నా. ఇదిగో ఇప్పుడు మొదలైంది అస్సలు సీను.. కష్టాల సీను. ట్రాఫిక్ బాగాఉండటం వల్ల, ద్విచక్ర వాహనాలు మెల్లగా రోడ్డు మీదనుంచి, ఫుట్ పాత్ ఎక్కుతున్నాయి. నేనేమో అక్కడే అడ్డంగా నించున్నానాయే. ఇంక చేసేదేమీ లేక వాహన చోదకులు అడగలేక మెల్లగా నా ప్రక్కనుంచి ఫుట్ పాత్ ఎక్కేస్తున్నారు. నాకేమో ఈ తతంగం అంతా చాలా చికాకుగా ఇబ్బందిగా ఉంది. ఇక లాభం లేదనుకుని. ఫుట్ పాత్‍కి అడ్డంగా నిల్చొని వచ్చే వాళ్ళందరినీ పోలీసులా గదమాయించడం మొదలుపెట్టా..

’ఏందిది.. ఇదేమన్నా రోడనుకున్నారా.. ఫుట్‍పాత్.. అటునుంచి వెళ్ళండి..’ నా స్వరంలో కోపం కొట్టొచ్చినట్లుగా అనిపించగానే..

’కొంచం తపుకో అన్నా.. ట్రాఫిక్ చూసావుగా.. ఆఫీసుకి లేటైతోందే..’ అంటున్నాడు ఓ మొటరిస్టు

’ఫుట్ పాత్‍లు ఉన్నవి.. మనుష్యులు నడవడానికి బాసూ.. బండ్లు నడపడానికి కాదు .. అర్ద మైందా..’ అంటూ.. ’పోలీసోళ్ళు ఇక్కడ నిలబడి, ఫుట్‍పాత్‍లు ఎక్కి నడిపించే వీళ్ళందరికీ ఫైన్ వెయ్యచ్చు కదా..’ అని మనసులో అనుకుంటూ ఉండగానే .. జూయ్యి మంటూ మరో మోటరిస్టు అమాంతం వచ్చి గుద్దినంత పని చేసాడు..

’ఏం బాసూ కనబడటంలే.. అలా అడ్డం నిలబడక పోతే తప్పుకోవచ్చుగా ..’ డబాయిస్తున్నాడు. ’ఎదో పెద్ద ఈ ఫుట్ పాత్‍లన్నీ వీళ్ళే కట్టించినట్లు.. చూడండి ఎలా అడ్డం నుంచున్నాడో..’ ప్రక్కనున్న మరో మొటరిస్టుతో అనగానే..

అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా ఒక్క దూటున నా మీద విరుచు పడ్డారు. ’ఏందయ్య.. ఇందాకణ్ణించి చూస్తున్నాం .. ఎవ్వరినీ ఫుట్ పాత్ ఎక్కనివ్వటం లేదు .. ఇదేమన్నా నీ బాబు జాగీరనుకున్నావా...’ మరో గొంతుకు ..

’జరగవయ్యా.. జరగమంటూంటే వినబడటం లేదా..’ ఇంకొడడు.. ఎక్కడ లేని ఐక్యత వీళ్ళందిరిలో ఒక్క సారిగా పుంజుకుంది.

ఇలా ఒకరొకరుగా నామీద యుధానికి దిగటంతో, అలవి కాని చోట అధికుల మన రాదన్నట్లు.. ప్రక్కకి జరిగి వాహన చోదకులకు త్రోవనిచ్చా.. దొరికిందే తడవుగా, ఒకళ్ళు తరువాత మరొకళ్ళు దూసుకుంటూ ఫుట్‍పాత్ పైకి పోనిచ్చేసారు..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

మరో పుటలో తరువాతి సన్నివేశం.. అంత వరకూ ’ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ ఉండకండే.. ’. ఈ పుటకి స్పందిస్తూ తరువాత situation ఎమై ఉంటుందో మీఊహకి ఎలా తోచిందో.. నేను ఈ పుటకి శీర్షికగా ’తనదాక వస్తే కానీ..’ అంటూ ఎందుకు పెట్టానో చెప్పకోండి చూద్దాం



ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన, నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా, విశ్వదాభిరామ! వినురవేమ!

రెండవ ఝాడ్యం.. ఏమి చెయ్యాలి?

ఈ పుట యొక్క మూల విషయాని వెళ్ళే ముందు, కొంత ఉపోధ్ఘాతం. ఇందులో నేను తెలియజేయబోయే కొన్ని విషయాలను, ’మీకు తెలియని నా ఐదు విషయాలు..’ అనే ప్రచురణగా మీ ముందుంచుదాం అని అనుకున్నా. ఇలాంటి ఒక దారాన్ని మన బ్లాగు స్నేహితుల ముందు ఉంచుదాం అనే ఆలోచన మొదటిసారిగా ఏప్రియల్ నెల eతెలుగు సమావేశంలో కలిగింది. దీనిలో భాగంగా, ఆది తెలుగు బ్లాగర్‍గా అందరికీ సుపరిచితులైన చావా కిరణ్ గారిని వారితోపాటుగా.. లేఖినీ, కూడలి వంటి వాటిల్లి విజయ వంతంగా నిర్వహిస్తూ.. బ్లాగింగ్‍ ప్రపంచానికి దూరంగా.. ఉంటూ వస్తున్న వీవన్ గారిని.. మరియూ దీప్తిధారగా పేరొందిన చీమకుర్తి భాస్కర రావు గార్లను మొదటగా ఎంచుకున్నా. వారందరికీ ఒక పెద్ద చాంతాడంత ఉత్తరం వ్రాయడం జరిగింది. వారి వారి అనుమతిని కోరుతూ నేను లిఖించిన ఆ ఉత్తరం ఎక్కడకి చేరిందో తెలియదు గానీ, ఆ అలోచన మాత్రం చిత్తు కుండీ చేరుకుంది. ఎందుకంటారా.. చదవండి..

అడిగినదే తడవుగా.. వయస్సులోనూ.. అనుభవంలోనూ.. ఎన్నని చెప్పమంటారు, అన్నింటిల్లోనూ పెద్దవారైనా భాస్కర రావు గారు వెంటనే స్పందించి వారి సమ్మతిని తెలియజేసారు. మరి మన చావాకిరణ్ గారేమో తన తొలిరేయి నందు, అదేనండీ పది పుటల ప్రచురణలో పూర్తిగా నిమగ్నమై పోయ్యారో ఎమో.. ఈ సంగతి గురించి అస్సలు పట్టించుకున్నట్లు లేరు. మరి మన వీవెన్ గారేమో తరచుగా ఈ విషయాన్ని గుర్తు చేసి, మీ సమ్మతినో లేక తిరస్కారాన్నో తెలియజేయండి అని పలు సార్లు అడగగా, ’ప్రస్తుతానికి కొంచం బిజీగా ఉన్నాను. మైల్ చెయ్యండి.. ఆలోచిస్తా..’ నంటూ తప్పించుకున్నారు. అంటే.. దీనికి ముందు లిఖించిన ఉత్తరం ఎక్కడికి చేరుకుందో నాకర్దం కాలేదు. ఏది ఏమైనా ఇంటర్వూలకు వెళ్ళినప్పుడు, ’We will get back to you..’  అని hr అన్నారంటే దాని అర్దం ఇంక ఈ ఉద్యోగానికి ఆశలొదులుకోవాల్సిందే అని అనుభవం ఉన్న వాళ్ళు అర్దం చేసుకుంటారు. అలాగే, ఎవ్వరైనా పెద్ద వారిని ఎదైనా విషయం గురించి అడిగారనుకోండి, ’మైల్ చెయ్యి.. చదివి రిప్లై ఇస్తా..’ అని మీకు జవాబు ఇచ్చారో .. దాన్ని ఎలా అర్దం చేసుకోవాలో (అనుభ)విఙ్ఞులకు వేరేగా చెప్పనక్కరలేదు. ఏది ఏమైనా అప్పుడు మిస్సైన కొన్ని విషయాలు ఇప్పుడు ఇక్కడ.

-----------ఉపోద్ఘాతం ఇంతటితో ముగిసింది--------------

ఇప్పుడు అస్సలు విషయానికొస్తా. ఉబుసు పోక నేను ప్రారంభించిన ఈ బ్లాగ్ ఎటో ఎటో తిరిగి, నా మెదడంతా పురుగు తొలిచి వేసినట్లు తొలిచేసేసిన తరువాత భవదీయుడు ఉదయించాడు. అంత వరకూ బాగానే ఉంది. కానీ అస్సలు భాధ ఇప్పుడే మొదలైంది. నాజీవితంలో రెండు సంఖ్యకూ పెద్ద పీటే ఉంది. నా ప్రయత్నం లేకుండానే చాలా విషయాలు ఈ రెండు సంఖ్యతో ముడి పడి ఉన్నాయి. ఏమి చెయ్యాలో తోచక ఇదిగో ఇలా మీతో ఇక్కడ.

  • నేను మా తల్లి తండ్రులకు రెండవ సంతానం
  • బ్రాహ్మణుడు స్వతహాగా ద్విజన్ముడంటారు. మొదటిది సాధారణ జన్మమయితే, మరోది ఉపనయనం అయ్యినప్పుడు
  • ఏడవ తరగతి చదివేటప్పుడు ఒకసారి చావు దరిదాపులలోకి వెళ్ళి వచ్చానంట. అమ్మా వాళ్ళు అంటూ ఉంటారు. ఆవిధంగా నేను ఓ రకంగా రెండవ సారి చావు దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది
  • ఒక్క intermediate మాత్రమే మొదటి సారిగా వ్రాసిన పరిక్షలో పాస్ అయ్యా. ఎందుకంటే, దీనికీ రెండు సంవత్సరాలే కదా ఉండేది
  • intermediateలో నేను vocational science గా కంప్యూటర్ సైన్సుని తీసుకున్నా. నా దురదృష్టవశాత్తు, అందులో అన్ని సీట్లు నిండుకున్నందున, మొదట Electrical & Electronics లో చేరి, తరువాత Computersకి మారి పోయా
  • ఇలా చాలా చాలా..
  • వీటన్నింటికీ మించి, ఉబుసు పోక మొదలు పెట్టిన ఈ బ్లాగు కూడా రెండవది. మొదటిది ఆంగ్లంలోని చక్రవర్తి అయితే, రెండవది ఈ ఉబుసు
  • పోనిలే భవదీయుడు మూడవదవతుందనుకుంటే.. తెలుగులో నేను మొదలు పెట్టిన రెండవ బ్లాగు ఈ భవదీయుడు
  • ఇది ఇలా ఉంటే.. పుండు మీద కారం జల్లినట్లు, భవదీయుడు శీర్షిక పేరుతో మరోవ్యక్తి ఇప్పటికే భ్లాగు మొదలు పెట్టడం నాకు మింగుడు పడని విషయం

ఎక్కడి కెళ్ళినా ఇది నన్ను వదలటం లేదు .. సాధరణంగా ఎవ్వరినైనా మీ లక్కీ సంఖ్య ఏమిటి అని ప్రశ్నవేస్తాం, అలాగే నన్ను ఎవ్వరైనా ప్రశ్నిస్తే.. ఏమి సమాధానం చెబుతానో తెలియదు కానీ, మీ unlucky number ఏమిటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా రెండునే గుర్తుకు తెచ్చుకుంటా. ఏమి చేస్తే బాగుంటుందో పాలు పోవటంలేదు. మీకేమైనా తోస్తే తెలియజేయ గలరని మనవి.

ఇట్లు,

భవ అస్మ దీయుడు

RSS Feeds ని చదవడానికి అనువైన సాధనమేమి?

ఈ మధ్య తరచు గా అందరి బ్లాగులు చదవడం మొదలు పెట్టా. ఇక్కడ నేను ఎదుర్కొంటున్న మొదటి సమస్య ఏమిటంటే, ఎవ్వరు ఎప్పుడు ప్రచురిస్తారో మనకి తెలియని విషయం కదా. అందువల్ల, అందరి బ్లాగులు అను నిత్యం వెతుకుతూ ఉండాల్సి వస్తోంది. ఇలా ఎందుకు, చక్కగా జల్లెడ, తెలుగుబ్లాగర్స్[డాట్]కామ్, కూడలి, లాంటివి ఉన్నాయి కదా.. అనుకుంటే, వాటిని కూడా తరచుగా సందర్శిస్తూ ఉండాల్సి వస్తోంది.

నేను స్వతహగా మైక్రోసాఫ్టు వారి అవుట్‍లుక్ ఎక్స్‍ప్రెస్ ద్వారా బ్లాగులను సబ్‍స్క్రైబ్ చేసుకుని చదువు కుంటాను. కానీ తెలుగుని అర్దం చేసుకోలేక, అవుట్‍లుక్ వింత వింతగా చూపుతోంటే, విసుగెత్తి 3rd party టూల్స్‍కై వెతికి కనబడిందల్లా ప్రయత్నించి చూసా. ఈ ప్రయత్నంలో నాకు శ్రమ తప్పితే, అన్నీ తెలుగుని అర్దం చేసు కోవటం లేదన్న విషయం సుస్పష్ట మయ్యింది.

ఇవన్ని ఎందుకు, ఎదో సామెత చెప్పినట్లు,

సామాన్యుడు అన్ని విషయాలు స్వతహాగా తాను అనుభవించి సోధించి సాధించి నేర్చుకుంటాడు, కానీ తెలివైన వాడు ఎదుటి వారి అనుభవాల నుంచి నేర్చుకుంటాడు

నేనే అన్ని ఎందుకు ప్రయత్నించాలి? నాకన్నా ముందుగా చాలా మంది అనుభవఙ్ఞులు ఇలాంటి సాధనం కోసం ప్రయత్నం చేసే ఉంటారు కదా. వాళ్ళని అడిగేస్తే పోలా అని అనిపించిందే తడవుగా, ఆఫీస్‍కు వెళ్ళే సమయం ఆసన్న మవుతున్నా,వ్ెనుకనుంచి భార్య,

ఏమండీ ఆఫీస్‍కు లేటవుతోంది.. దారిలో మళ్ళీ ట్రాఫిక్కు.. జామూ .. అంటారు .. బయలు దేరండీ.. తొమ్మిదిన్నరైంది..

అంటున్నా వినకుండా.. మీ అందరికీ నా విన్నపమేమిటంటే.. మీకు తెలిసిన RSS Readers గురించి తెలియ జేయగలరు. చదివి నందులకు ధన్యవాదములు.

ఎమ్ ఎమ్ కే గారి స్పందన చదివిన తరువాత అనిపించింది. వారు చెప్పిన రెండు సలహాలలో గూగుల్ వారి రీడర్ కే నా ఓటు. కానీ నేను వెతుకుతున్నది అంతర్జాలం (online) లో చదవడానికి వీలైయ్యే రీడర్లు కాదు. అంతర్జాలంలో కాకుండా, offlineలో చదువుకోవడానికి వీలైనటు వంటివి అన్న మాట. నేను ప్రయత్నించి నచ్చక పోయిన టూల్స్ వివరాలు ఈ క్రింది విధంగా..

  • Feed Reader 3.12
  • NewGator - FeedDemon
  • Thunderbird
  • Sharp Reader
  • Omea Reader
  • News Crawler
  • Blog Navigator
  • Blog Bridge
  • Alertbear
  • RSS Bandit

ఇంకా ఎవేవో.. ఏవీ నన్ను తృప్తి పరచలేక పోయ్యాయి. మీరు ఏదైనా ఇష్ట పడి నట్లైతే .. తెలియజేయగలరని మనవి.

తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

హక్కు దారులు దొరికారు.. మూల రచయత వివరాలు

ఈ మధ్య నేను ప్రచురించిన ’కధే.. మరచిపోలేకపోతున్నామూడు భాగాల కధ యొక్క మూల రచయత దొరికారు. ఎదో కష్ట పడి నాదైన శైలిలో పెద్ద పొడిచేసా అనుకుంటుండగా, ఈ కధని ఆంద్రజ్యోతిలో నాకన్నా ముందుగా కొల్లూరి సోమ శంకర్ గారు పెరుగన్నం పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ కధ జులై16 వ తారీఖు 2006 వ సంవత్సరంలో అనువాద కధగా ప్రచురిత మయ్యింది. ఈ కధకి మూల రచయత గా మధురై వాస్తవ్యులైన శ్రీధరన్ రంగస్వామి గారిని కొల్లూరి సోమ శంకర్ గారు పేర్కొన్నారు. ’ఆనంద వికటన్’ అనే టైటిల్‍తో మొదటి సారిగా శ్రీధరన్ రంగ స్వామిగారు రచించితే, దాని ఆంగ్ల అనువాదాన్ని 'The Promise' అనే టైటిల్‍తో మొదటి సారిగా 2003 వ సంవత్సరంలో జులై 27వ తారీఖున, బెంగళూరు ప్రాంత పత్రికైన Deccan Herald వారు, ఆ నాటి ఆదివారం అనుభందంలో ప్రచురించారని తెలియ జేసారు.

పైన పేర్కొన్న అంశాలు అన్నీ మీకు ఇండస్‍లేడీస్ వారి వెబ్ సైటు నుంచి చదువుకోవచ్చు. ఈ వైబ్ సైటులోని ఒక చర్చావేదికలో మూలకధను, The Promise గా వారి నిర్వాహకాధికారి, ’శక్తి’ గారు ప్రచురించారు. ఇచ్చట శ్రీధర్ గారు, ’వరలొట్టి’ అనే చిరునామాతో చేసిన వ్యాఖ్యలు కూడా చదవ వచ్చు. బహుశా శ్రీధరన్ రంగ స్వామిగారు నేను ఇలా రెండవ సారి తెలుగులోకి అనువాదించానని అనుకుంటారనుకుంటా. కాబట్టి తమిళం మరియు ఆంగ్లంలో రచించిన శ్రీధరన్ గారికి అంతే కాకుండా తెలుగులోకి మొదటి సారిగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి నా బ్లాగు ముఖంగా విన్న వించుకోదలచిన దేమిటంటే..

అయ్యా.. విఙ్ఞులారా.. నేను ప్రచురించే నాటికి ఈ కధ మూలాలు తెలియ నందున, శ్రీధరన్ గారి మూల కధకు నా సొంత పైత్యాన్ని చేర్చి తెలుగులో (మరోసారి) నాదైన శైలిలో కూర్చడమైనది. ఈ మొత్తం జరిగిన సమయంలో తమరిని ఎమైనా నొప్పించినట్లైతే, పెద్ద మనసుతో క్షమించమని మనవి. వీటి మీద సర్వ హక్కులు తమవే.

ఎదో కొద్దిగా నా బుర్రకు తోచినట్లుగా, కొంచం మసాళా చేర్చడం మినహా, మొత్తం కధా కధనం పైన పేర్కొన్న వారివే. అన్యధా మంచిగా తలుస్తారని ఆశిస్తాను.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తెలుగువాళ్ళూ .. ఎక్కడ .. తమరెక్కడ??

ఈ మధ్య నేను మొదలు పెట్టిన పరిశోధనా అంశం, ’తెలుగు బ్లాగులు చదివే (తెలుగు)వారు ఏ ఏ ప్రదేసాలలో ఉన్నారు’. ఇక్కడ చదివేవారు అని మీరు అర్దం చేసుకోవాలి, చదివే ప్రతీవారూ తెలుగువారు అవుతారా లేదా అన్నది నా పీత బుర్రకి అందని విషయం. ఎందుకంటే, ఈ రోజుల్లో మిశ్రమ భాషా తల్లి తండ్రులు ఉన్నతరం మనది. తల్లిగారిది తెలుగైతే, తండ్రి గారిదేమో తమిళం. అలాగే ఇదే తంతు అటుదిటుగా అవ్వనూ వచ్చు. అందుకని, ఎవ్వరు ఏభాషా కోవిదులైనా, నావరకూ మాత్రం వారు తెలుగు ప్రచురణలు చదవగలిగారా లేదా అన్నది మాత్రమే.

ప్రస్తుత విషయానికొస్తే, నేను బ్లాగు ప్రపంచంలో ఇంకా చిన్న వాడినే. కానీ బ్లాగు చదివే ప్రపంచంలో మాత్రం పెద్దవాడిని కాకపోయినా, చిన్న వాడిని మాత్రం కాదు. ఎడా పెడా ఏది పడితే అది చదివేస్తూ ఉంటాను.. చదివిన ప్రతీదీ అర్దమవ్వాలన్న రూల్ ఏమీ లేదు కదా. అట్లాగే, చాలా చదువుతూ ఉంటాను, చాలా చాలా మరచి పోతుంటాను. కాబట్టి, చదివిన ప్రతీ విషయం గుర్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించకుండా, నా మది ఇష్టానికే వదిలేస్తా.. కావాలని గుర్తు పెట్టుకోను. అలాగే కావాలని మరచిపోనూ.

నాలాగే, ఎంత మంది బ్లాగులు చదువుతున్నారో అన్న ఆలోచన రాక ముందు, నా బ్లాగును ఎంత మంది చదువుతున్నారా అన్న కుతూహలం కలిగింది. అంతే.. అన్నదే తడవుగా, ఉచిత బ్లాగు కౌంటర్ల వెంట పడ్డా. ఇష్టమొచ్చిన వాటన్నీంటినీ నా బ్లాగుకు తగిలించేసా. తగిలించిందే తడవుగా, వాటి పని అవి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఇంత వరకూ బాగానే జరిగింది. ఈ మధ్యనే నా బ్లాగు వెయ్యి సార్లు కొట్టించు కొంది. ఈ సహస్ర హిట్ల ప్రయాణం గురించి నేను గమనించే లోపుల, కూడలి పిచ్చా పాటిలో ఎవ్వరో ధన్యవాదాలు తెలియజేసారు. ఇదీ ఆనందించ వలసిన విషయమే. కానీ.. ప్రతీ నాణానికీ రెండు వైపులున్నట్లుగా, నా వెయ్యి హిట్ల ప్రవహసానికీ నెగెటివ్ ఆలోచనను ఆకట్టారు సదురు ఓ బ్లాగరు. మన బ్లాగుకి మనమే హిట్లు కొట్టి, మనమే చంకలు కొట్టించు కోవడం హాస్యాస్పదం అన్నారు.

ఇదిగో ఇక్కడ నాకు కాలింది. (ఎక్కడ అని ఎదురు ప్రశ్న వేయ్యకండీ.. అలాగే.. బర్నాల్ రాయక పోయ్యారా .. అంటూ అగ్నికి ఆజ్యం పొయ్యకండి) నా బ్లాగుని నేను ఎన్ని సార్లు హిట్ చేసానా అన్న పరిశోధనలో చాలా చాలా విషయాలు వెలుగులోకి తొంగి చూసాయి. వాటిల్లో ముఖ్యమైనది, నన్ను భాధ పెట్టినదీ ఏమిటంటే.. విసిగించకుండా, అస్సలు విషయంలోకొద్దాం.

నా పరిశోధన నాబ్లాగుకు మాత్రమే కాకుండా, సదురు తెలుగు బ్లాగులన్నింటికు వర్తిస్తుందని నా అభిప్రాయం, నా బ్లాగు చదివే పరదేసీయులూ మీరేమంటారు. మీ మీ బ్లాగులు ఎవ్వరెవ్వరు.. ఏ ఏ ప్రదేశాలలో నుంచి చదువుతున్నరో తెలియజేయ గలరు.

ఎక్కువగా, తెలుగు బ్లాగులు చదివేవారిని విభజన ప్రాతీయ పరంగా చూస్తే, భారతదేశ చదువరులే ఎక్కువ భాగాన్ని కొట్టేస్తారు. కానీ అమెరికాలో ఉన్న భారతీయులలో తెలుగు తెలిసీ.. చదివే పరిఙ్ఞానం కలిగిన వారితో మన భారతీయులను పోలిస్తే, తెలరికన్లు (తెలుగు + అమరికన్ = తెలరికన్లు) చాలా తక్కువ శాతంగా మనం గమనించవచ్చు. అట్టి తెలరికన్లు, దాదాపు మన భారత చదువరిలతో బాహా బహి పోటీకి దిగారు. మొత్తంగా వారుకూడా పట్టు బిగించి, మన స్వంత గడ్డను మరచి పోలేదన్నట్లుగా మనవారితో పోటీ పడుతున్నారు. అట్టి వీరందరూ కూడా, బ్లాగు లోకంలోకి ప్రవేశించినట్లైతే, అహా .. బ్లాగు ప్రపంచం మూడు పుటలు ఆరు చదువరులుగా వెలుగొందుతుంది.

image

కానీ ఆశ్చర్యపరచిన విషయమేమిటంటే.. కెనడాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వున్నా, గల్ఫ్ ‍లో ఉన్న తెలుగు వారికన్నా, తక్కువగా బ్లాగులు చదువు తున్నారన్న విషయం మింగుడు పడటం లేదు. ఇక్కడ ముఖ్యంగా percentage ని మాత్రమే లెక్కగా తీసుకో బడింది, అంతే కానీ అసలైన సంఖ్యలు ఎక్కువగా ఉండవచ్చు.

అన్నింటికన్నా కలవర పరచిన విషయ మేమిటంటే.. నార్త్ అమెరికా దేశాలైన బ్రజిల్, అర్జంటీనా, పెరూ, చిలీ, వెనుజ్యువెలా వంటి ప్రదేశాలలో మన తెలుగు వారు ఉన్నపటికీ, వారు నామ మాత్రంగానైనా తెలుగు వెలుగులను చూస్తున్నారా అని అనుమానమేస్తోంది. వీరికి తోడుగా, ఆఫ్రికా దేశాలలోని తెలుగు వారు మాత్రం మేము తెలుగు మర్చిపోయామన్న లెక్కలోకి వచ్చేసినట్లున్నారు. ఇక చైనా, జపాన్, రష్యా, కజకిస్తాన్, మంగోలియా వంటి దేశ తెలుగు వారిని మనం తెలుగువారు అని అనక్కరలేదేమో!!! అన్నింటికీ మించి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఫిన్‍లాండ్, నార్వే, ఐస్‍లాండ్, గ్రీన్‍లాండ్ లాంటి ప్రదేశాలలో నుంచి కూడా చదువరులు హిట్లు ఇస్తున్నారన్న విషయమే గొంతులో మింగుడు పడలేనటువంటి వెల్లక్కాయ మాదిరిగా ఉంది. ఏది ఏమైనా ఈ సర్వే నాకు చాలా విషయాలు తెలియ జేసింది.

మిగిలిన దేశాలలో ఉన్న తెలుగు వారూఊఊఊఊఊఊఊ .. ఎక్కడున్నారు?? దయచేయండీ.. చదవండి, స్పందించండి, తర్కించండి, తిట్టండి, కొట్టండి(నన్ననుకునేరు.. నన్ను కాదు.. బ్లాగు లింకులను). మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

మంచి - చెడు.. ఎలా అర్దం చేసుకోవాలి?

ఈ మధ్య నాలో రేగుతున్న కొన్ని మానసిక అలజడులలో ఒకటి, పైన చెప్పిన అంశం. అస్సలు మంచి అంటే ఏమిటి? దేన్ని చెడుగా తలుచుకోవాలి? ఎవ్వరు చేసిన పనులు మంచి పనులు? ఎవ్వరు చేసేవి చెడువి? అస్సలు .. మంచి చెడు అనేటటువంటివి ఎవ్వరైనా ఒక వ్యక్తికి సంభందించినవా లేక వాటికంటూ కొన్ని గుణ గణాలున్నాయా?

ఎవ్వరిని చూసి మనం మంచి వాళ్ళు అని చెప్పచ్చు? ఎవ్వరిని చెడ్డవాళ్ళనవచ్చు? వలబోజు జ్యోతిగారు ఉదహరించినట్లు, రాముడిని ఏవిధంగా మంచి వాడిగా అనుకోవాలీ? జ్యోతిగారి ప్రచురణకు స్పందించిన తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు తెలియజేసినట్లు, ఎకాలంలో వాళ్ళని ఆ యా కాలాలనుగుణంగా మాత్రమే మనం చర్చించు కోవాలి కానీ, వివిధ కాలాలలో చర్చించ కూడదన్నట్లు, మంచి చెడులు కాలాను గుణాలా?

జ్యోతిగారు ప్రచురించిన, ’పురాణాలు ఏం చెబుతున్నాయి’ పుట ఏప్రియల్ 25వ తారీఖునైతే.. నేను ఏప్రియల్ 10వ తారీఖున, ’ఎల్ వీ ప్రసాదు గారి పై నా అభిప్రాయా’న్ని ప్రచురించాను. ఇది చదివిన తరువాత, మా అమ్మకీ నాకు జరిగిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు కూడా నన్ను కలవర పెట్టాయి. అమ్మ వాదనకి నేను మూగ వాడినై పోయా. రామాయణం లోని కొన్ని ఘటనలను జ్యోతిగారు ఉదాహరణగా తీసుకుంటే, అదే రామాయణం లోని మరికొన్ని విషయాలను అమ్మ ఉదహరించింది.

మొదటగా: కుశ లవులు రామనామ జపం చేసుకుంటూ అయోధ్య చేరుకుంటే, దాని వెనుక ఆంతర్యమేమిటి? దీనికి నాదగ్గరున్న సమాధానమేమిటంటే.. (నాదగ్గరే కాకుండా ఎంతో మంది లవకుశ సినిమా చూసే ఉంటారు) పిల్లలిద్దరికీ ఇక తండ్రి అవసరం ఆసన్నమైంది. ఇంక సీతా అమ్మవారి పాత్ర ఇక్కడితో ముగించేయ్యాలి కాబట్టి. మా అమ్మ వేసిన ఒకే ఒక ప్రశ్నేమిటంటే.. పసి పిల్లలను ఒంటరిగా వదిలేసి తాను మాత్రం తన తల్లి దగ్గరకు పోవచ్చా.. ఈ పిల్లలకు మాత్రం తల్లి అక్కరలేదా.. తల్లికొక న్యాయం .. పిల్లల కొక న్యాయం.. ఎంత విచిత్రం.. ఇది ఏవిధంగా న్యాయం. ఇట్టి విషయాన్ని మనం మంచి విషయంగా తలంచుకోవాలా.. లేక తల్లులకొక న్యాయం, పిల్లలకొక న్యాయంగా వ్యవహరించడాన్ని ఆయుగ మంచి, ఈ యుగ చెడుగా తలంచుకోవాలా??

రెండవది: మగవాళ్ళెప్పుడూ శాసించడమేనా.. అర్దం చేసుకునే పని లేదా? నువ్వు నిప్పుల్లోకి దూకు అనగానే సీతా అమ్మవారు, దూకేయ్యాలా!!!! ఎంతటి నిరంకుశత్వం. ఏం నేనెందుకు దూకాలీ, ఉరూ పేరూ లేని ఒక అనామకుడు నిందవేయ్యగానే భార్య శీలాన్ని శంకించాలా? అదే సీతా అమ్మ వారు, నీ శీలం సంగతేమిటని ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేది. ఇది జరగలేదు, సరే.. అస్సలు ఎదైనా చెప్పే ముందు మనం పాటించాలి అని అంటారు కదా. మరి శ్రీరాములు వారు ఎందుకు అగ్ని ప్రవేశం చెయ్యలేదు? తాను పాటించి నిరూపించుకున్న తరువాత అడిగి ఉంటే బాగుండును కదా?

ఇలా .. ఎన్నో.. మరెన్నో.. ఎమో!! ఇలాంటి వాటిని అర్దం చేసుకునేంత బుర్ర నాకు ఆ దేవుడు ప్రసాదించ లేదు. వీటన్నింటినీ ఆలోచించిన తరువాత, నాకు ఒక్క ముక్క అర్దం మయ్యింది.

మంచి చెడు అనేటటువంటివి, ప్రతీ వ్యక్తి ఇష్టాయిష్టాలే తప్ప మరొకటి కాదని. మనకి ఇష్ట మయితే అది మంచిది, మనకు కష్టమయ్యి అయిష్టమయితే అది చెడ్డది. That's it, very simple.

Good and Bad are nothing but Like and Dislike

అబ్బా చికాకేస్తోంది - జల్సా పాటలు

సినిమా పాటలంటే పదికాలాల పాటు వినడానికి సొంపుగా ఉండాలి, అంతె కానీ కొత్తల్లో కొత్తగా, పాతబడె కొద్దీ చత్తగా ఉంటే, జల్సా పాటల లాగే ఉంటాయి. ఈ మధ్య విడుదలైన జల్సా చిత్రం ఎన్ని చిత్ర-విచిత్రాలు చేసిందో మీకందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ సినిమా ఇంకా చూడలేదు కానీ, చాలా మంది వ్రాసిన రివ్యూలు పుల్లుగా వారి వారి బ్లాగులలో చదవడమైనది. ఏమో, నేను స్వతహాగా సినిమాలు తక్కువగా చూస్తా కాబట్టి, ఆ సినిమా గురించి వ్యాఖ్యానించే అనుభవం లేదనుకోవచ్చు. ఇక అస్సలు విషయానికొస్తే.. అదేనండీ జల్సా పాటల విషయానికి వస్తే..

నాకు తెలిసినంత వరకూ రేండు రేడియే స్టేషన్ వాళ్ళు ఈ పాటల ప్రసార హక్కులు మాకే సొంతమంటే, మాకే సొంతం అన్న రీతిలో యడా పెడా వాయించేస్తున్నారు. ఇంతకీ ఎవ్వరు అధికారిక ( అఫీషియల్ పార్ట్‍‍నర్స్) హక్కుదారులో ఆ సినిమా వాళ్ళకే తెలియాలి. మీకేమైనా తెలుసా. తెలిస్తే, మరచి పోకుండా చెప్పండీ. చెప్పారనుకోండి మీకో పెద్ద -- పెడతా.

రోజూ ఆఫీస్‍కు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, నా నోకియా 3310 లోని రేడియో వింటూ హైదరాబాదు ట్రాఫిక్ భాధల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాను. జల్సా విడుదలవ్వడానికి ముందు రెండు రోజుల నుంచి ఈ రోజు వరకూ ’పాడిందే పాటరా పాత పళ్ళ దోసరా..’ అంటూ అరిగి పోయిన గ్రామ పంచాయితీ రేడియోల్లో పందుల పెంపకం గురించి పాత రోజుల్లో వినిపించిన సొదలా.. ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి.. జల్సా పాటలతో సంభందం ఉన్నా లేకపోయినా.. ఈ రేడియో జాకీలకి పిచ్చి పట్టినట్లు ఎన్ని సార్లు వినిపిస్తారో తెలియదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేసిందే వేసి, చికాకు పెట్టేస్తునారనుకోండి.

వీళ భాధ భరించలేక, ఫోన్ హేడ్‍సెట్ కాస్తా తీసేసి, చక్కగా నా మ్యూజిక్ ప్లేయర్‍ని బయటకు తీసా. ఆఫీస్‍కు వచ్చే వేళ్ళల్లో ఎదైనా కాల్ కనుక మిస్ అయితే, ఆఫీస్‍కు చేరుకున్నాకో లేక ఇంటికి చేరుకున్నాకో వాళకి తిరిగి మిస్ కాల్ చేస్తే, అవసరమైన వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారు. లేకపోతే లేదు. కానీ ఈ జల్సా పాటలు, మొదట్లో బాగానే ఉన్నాయి, ఎందుకో ఇప్పుడిప్పుడే వెగటు పుడుతున్నాయి. కానీ ఎదో పద్యంలో చెప్పినట్లు..

అనగ అనగ రాగ మతిశయిల్లుచుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విస్వధా అభిరామ వినురవేమ

వినగా వినగా పాటలు వినసొంపవ్వాలి.. అలాగే తినగా తినగా.. వేప కాయలు కూడా తియ్యగా అవ్వాలి, ఏమిటో మరి నాకు ఈ పాటలు వినగా.. వినగా.. చెవులు తుప్పు పడుతున్నాయి. ఎవ్వరైనా పాటలు వింటే తుప్పు వదిలిందంటారు. ఏంటో కొత్తగా నాకు తుప్పు పడుతోంది. ఏమి చేతురా లింగా .. ఏమీ చేతురా..

 
Clicky Web Analytics